
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. సమావేశాలు 10 నుంచి 15 రోజులపాటు జరిగే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీ కార్యకలాపాల్లో ఐటీ సేవల వినియోగంపై చర్చించేందుకు శనివారం ఢిల్లీలో జరిగిన ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో స్పీకర్ పాల్గొన్నారు. అనంతరం ఏపీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ కార్యకలాపాల కంప్యూటరీకరణ మూడు దశల వరకు పూర్తయిందని, పూర్తి డిజిటలైజేషన్‌కు సంబంధించిన ప్రతిపాదనలను డిసెంబర్ 17లోపు కేంద్రానికి పంపాలని సమావేశంలో నిర్ణయించామన్నారు.
వచ్చే నెల 15 నుంచి 21 వరకు డెహ్రాడూన్‌లో స్పీకర్ల సదస్సు జరగనుందని, ఇటీవల కంపాలలో జరిగిన పలు దేశాల స్పీకర్ల సమావేశంలో చేసిన తీర్మానాల అమలుపై ఈ సదస్సులో చర్చిస్తారని చెప్పారు. దీనికి సంబంధించి అస్సాం అసెంబ్లీ స్పీకర్ చైర్మన్‌గా, తాను సభ్యుడిగా మొత్తం ఏడుగురితో కూడిన సబ్‌కమిటీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారని తెలిపారు. రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు చెప్పారు. టీడీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయమై మీడియా ప్రశ్నించగా.. ఆ ఎమ్మెల్యేను ఇక ఇండిపెండెంట్‌గా పరిగణించవచ్చని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.