సాక్షి, అమరావతి : శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కృష్ణానది కరకట్టపై వెలిసిన అక్రమ కట్టడాల కూల్చివేతపై గురువారం సభలో వాడీవేడీ చర్చ జరిగింది. అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటున్న చంద్రబాబు తప్పును ఒప్పుకోకుండా చర్చను పక్కదారి పట్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ‘చట్టాలను ఎన్నటికీ అతిక్రమించను. సభాసంప్రదాయాలు పాటిస్తాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పోరాటం చేస్తాను’ అని చంద్రబాబు వ్యాఖ్యానించడంపట్ల అంబటి చురకలంటించారు.
‘చంద్రబాబు మాటలు వింటుంటే నా రక్తం మరిగిపోతోంది’ అని అనడంతో సభలో నవ్వులు పూసాయి. సీఎం స్థాయిలో ఉండి అక్రమాలకు పాల్పడిందే కాకుండా ఈ విధమైన మాటలు చెప్పడం సమంజసమా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టిన బాబు విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ‘ఇవన్నీ చేసికూడా సభా నియమాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి ఉపన్యాసాలిస్తున్నారు. శభాష్ చంద్రబాబు’ అని అంబటి వ్యాఖ్యానించారు. లింగమనేని అక్రమ కట్టడంలో నివాసముంటున్న ఆయన అక్కడ నుంచి ఖాళీ చేసి గౌరవాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment