
తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా, రెండోసారి ఎన్నికైనా.. ఎవరైనా చట్టసభలోనే కూర్చుంటారు కదా అని సీఎం జగన్ చురకలంటించారు.
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రతి అంశాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారని విమర్శించారు. సభలో ఎక్కడ కూర్చోవాలనే విషయంలో కూడా టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ‘నిబంధనల ప్రకారమే శాసనసభలో సభ్యులకు సీట్ల కేటాయింపు జరిగింది. కేటాయించిన సీట్లలో కూర్చోవాలని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తయినా రూల్స్ పాటించాల్సిందే. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా, రెండోసారి ఎన్నికైనా.. ఎవరైనా చట్టసభలోనే కూర్చుంటారు కదా’ అని సీఎం చురకలంటించారు. ఉద్దేశపూర్వకంగానే టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. దాదాపు 10 ప్రశ్నలు సభ్యులు అడగాల్సి ఉండగా.. ఇంతవరకు రెండు ప్రశ్నలు మాత్రమే అడిగారని, విలువైన సభా సమాయాన్ని వృథా చేయొద్దని టీడీపీ ఎమ్మెల్యేలకు సూచించారు.