
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, తిరుపతి : రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్ల (హిజ్రాలు) సంక్షేమం కోసం ఈ బడ్జెట్టులో రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 80 వేల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. ఎక్కువ మంది యాచన ద్వారా జీవనం సాగిస్తున్నారు. సమాజంలో ఎదురయ్యే అవహేళనలను తట్టుకోలేక ఎక్కువ మంది ఇళ్లల్లోనే గడుపుతున్నారు. సొంతిళ్లు, రేషన్‌కార్డులు, హెల్త్ కార్డులు లేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్‌లో రాష్ట్రప్రభుత్వం 26 వేల మందిని గుర్తించి పెన్షన్ స్కీమ్ వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.
వారి సంక్షేమానికి సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం.. వారికోసం ఏడాదికి రూ.50 కోట్లు ఖర్చు చేయాలని అప్పట్లో నిర్ణయించింది. అయితే బడ్జెట్‌లో కేవలం రూ.20 కోట్లు కేటాయించడంపై ట్రాన్స్‌జెండర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అరకొర నిధులతో ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలోనూ అమలు చేయాలని ఏపీ ట్రాన్స్‌జెండర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment