ఏపీ సీఎం వైఎస్ జగన్‌ సంచలన నిర్ణయం | AP Cabinet Expanded with Induction Of 25 Ministers, says YS Jagan | Sakshi
Sakshi News home page

25 మందితో పూర్తి స్థాయి కేబినెట్‌ ఏర్పాటు: వైఎస్‌ జగన్‌

Published Fri, Jun 7 2019 11:00 AM | Last Updated on Fri, Jun 7 2019 12:26 PM

AP Cabinet Expanded with Induction Of 25 Ministers, says YS Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: మంత్రివర్గ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా అయిదుగురిని డిప్యూటీ సీఎంలుగా చేయాలని నిర్ణయించారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తాజాగా తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైఎస్సార్‌ఎల్పీలో చేసిన ప్రకటన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు అవకాశం కల్పించనున్నారు. ఇది దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతో అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి. సామాజిక వర్గాలవారిగా సమ ప్రాధాన్యత కల్పించే కీలక నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న వైఎస్సార్‌ఎల్పీ సమావేశంలో ఆయన పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. మొత‍్తం 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. కేబినెట్‌లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. మంత్రివర్గంలో అయిదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, కొత్తవారికి కేబినెట్‌లో అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...‘రాష్ట్రం మొత్తం మనవైపు చూస్తోంది. మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గర చేయాలి. సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాలి. అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలి. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిసి జ్యుడీషియల్‌ కమిషన్‌ గురించి అడిగా. ఇక నుంచి ప్రతి టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలి.  ప్రతి కాంట్రాక్ట్‌ ప్రక్రియ మొదటి నుంచి జడ్జి వద్దకు వెళుతుంది. ఏడు రోజుల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో టెండర్ల ప్రక్రియ ఉంటుంది. జ్యుడీషియల్‌ కమిషన్‌ సూచనల మేరకు ప్రతి టెండర్‌లో మార్పులు ఉంటాయి. ఆరోపణలు వచ్చిన వాటిపై రివర్స్‌ టెండర్‌ ప్రక్రియ చేడతాం. రివర్స్‌ టెండరింగ్‌లో ఎంత మిగిలిందో ప్రజలకు వివరిస్తాం. చంద్రబాబు పాలనలో అంచనాలకు మించి టీడీపీ నేతలు దోచుకున్నారు. ప్రమాణ స్వీకారం నాటి నుంచి పారదర్శక పాలన గురించే ఆలోచనలు. ఇప్పటివరకూ తీసుకున్న అన్ని నిర్ణయాలు ఆ దిశగానే చేస్తున్నాం. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం. మనం వేసే ప్రతి అడుగు ద్వారా మన గ్రాఫ్‌ పెరగాలి. నామినేషన్‌ పద్థతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పనులు కేటాయిస్తాం.’ అని తెలిపారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement