అసంపూర్తిగా దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం(ఫైల్‌ఫొటో) ఇన్‌సెట్‌లో చంద్రబాబు, రఘువీరా.
సాక్షి, విజయవాడ : కనకదుర్గమ్మ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు దారుణంగా ఉందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. గతంలో బాబు సీఎంగా ఉన్నప్పుడే అమ్మవారి కిరీటం చోరీకి గురైందని, ఇప్పుడు ఏకంగా గర్భగుడిలో క్షుద్రపూజలు చేయిస్తున్నారని, దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణంలోనూ ఎక్కడలేని జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. మార్చిలోగా ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తిచేయకుంటే ఆందోళన చేపడతామని రఘువీరా హెచ్చరించారు. శనివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘‘గతంలో కిరీటం చోరీ, ఇప్పుడు క్షుద్రపూజలు.. చంద్రబాబు హయాంలోనే జరిగాయి. పొద్దున లేస్తే దుర్గగుడి ఫ్లైఓవర్ నా కల అని చెప్పుకుంటారాయన. మరి పనులు చూస్తే ఎక్కడిక్కడే నిలిచాయి. నాడు హైదరాబాద్‌లో తెలుగుతల్లి ఫ్లైఓవర్ విషయంలోనూ ఎనిమిదేళ్లు కాలయాపన చేశారు. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పూర్తిచేసింది. ప్రస్తుతం టీడీపీ దృష్టంతా దోపిడీపైనే ఉందితప్ప అభివృద్ధిపై కాదు. రాజధానిలో ఎక్కడిక్కడ కబ్జాలు, దందాలు.. ఇవే సీఎం, ఆయన కుమారుడు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేస్తోన్నపనులు! మార్చిలోపు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తికాకుంటే ఏప్రిల్‌లో కాంగ్రెస్ శ్రేణులు నిరవధిక దీక్షలకు దిగుతాం’’ అని రఘువీరా రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment