సాక్షి, గుంటూరు : అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగకుండా అడుగడుగునా అడ్డుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారికి న్యాయం చేస్తే ఓర్వలేకపోతున్నారని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కోఆర్డినేటర్ లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. ప్రభుత్వం తొలి దశలో రూ.1150 కోట్లు కేటాయించి రూ.20 వేల లోపు బాధితుల కష్టాలు తీర్చేందుకు ముందుకొచ్చిందని, రూ.10 వేల లోపు డిపాజిట్లు ఉన్నవారి ఖాతాల్లో ఇప్పటికే నగదు జమయిందని తెలిపారు. దీనిని భరించలేని చంద్రబాబు నాయుడు, లోకేశ్, ఇతర టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం చూస్తే సిగ్గేస్తుందని చెప్పారు.
అగ్రిగోల్డ్‌పై నారా లోకేశ్ ట్విట్టర్‌లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. అగ్రిగోల్డ్‌పై నిజానిజాల నిగ్గు తేల్చుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. లోకేశ్ తన ట్విట్టర్లో పెట్టిన దానికి కట్టుబడి ఉండే పక్షంలో తన చాలెంజ్‌ను స్వీకరించాలని సవాలు విసిరారు. లేని పక్షంలో తన ట్విట్టర్ ఖాతా క్లోజ్ చేసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ అంశంపై కోర్టుకు వెళ్లినప్పుడు ఎస్.ఎల్. గ్రూప్ వారి ఆస్తులను టేకోవర్ చేస్తానందని, 2018, ఏప్రిల్ 3న ఆ గ్రూప్ సభ్యులతో చంద్రబాబు ఢిల్లీలో మంతనాలు జరిపి వారిని బెదిరించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
2018 ఏప్రిల్ 3వ తేదీ అర్ధరాత్రి ఢిల్లీ ఏపీ భవన్ సాక్షిగా చంద్రబాబు –అగ్రిగోల్డ్ ఎం.డి. సీతారామ్, ఎస్.ఎల్.గ్రూప్ సుభాష్ చంద్ర, మాజీ ఎంపీ అమర్ సింగ్‌తో చీకటి ఒప్పందానికి ప్రయత్నించారని ఆరోపించారు. అందుకు భయపడే ఎస్‌ఎల్ గ్రూప్ వెనక్కు తగ్గిందని వెల్లడించారు. ఆ సమావేశం జరిగిన వారం తర్వాత ఆ గ్రూప్ సభ్యులు అగ్రిగోల్డ్ ఆస్తులు కొనడం లేదని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని అప్పిరెడ్డి గుర్తు చేశారు.వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన అయిదు నెలల్లోనే ఇచ్చిన హామీల్లో 80 శాతం అమలుచేసి ప్రజల మన్నన పొందారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంట్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment