
న్యూఢిల్లీ: భారతీయులు లేదా భారత దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా విదేశాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపైనా విచారణ చేపట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అధికారాలిచ్చేందుకు ఉద్దేశించిన ఓ బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. విదేశాలకు సంబంధించిన కేసుల విచారణను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు పర్యవేక్షిస్తుంది. సైబర్ ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ నోట్లను వ్యాప్తిచేయటం, నిషేధిత ఆయుధాల తయారీ, వాటి అమ్మకం కేసులపై విచారించేందుకు కూడా ఎన్‌ఐఏకి ఈ బిల్లు అధికారం ఇస్తోంది.
(చదవండి : ఎన్‌ఐఏకి కోరలు)
ఇక ఈ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ ఓ కేసు విచారణ సందర్భంగా ఓ రాజకీయ నాయకుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను గతంలో బెదిరించాడని అన్నారు. ఆ మాటకు హైదరాబాద్ ఎంపీ ఒవైసీ అభ్యంతరం తెలుపుతూ ఆయన చెప్పిన దానికి ఆధారాలు చూపాలని కోరారు. దీంతో అమిత్ షా కలగజేసుకుంటూ ప్రతిపక్షం వాళ్లు మాట్లాడుతున్నప్పుడు అధికార పార్టీ వాళ్లు అడ్డు తగలడం లేదనీ, అలాగే అధికార పార్టీ వాళ్లు మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షం వాళ్లు కూడా ప్రశాంతంగా ఉండాలని ఒవైసీని ఉద్దేశించి అన్నారు. దీనికి ఒవైసీ స్పందిస్తూ, తనవైపు వేలు చూపించవద్దని అమిత్ షాకు చెప్పారు. తననెవరూ భయపెట్టలేరని ఆయన పేర్కొన్నారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ తానెవరినీ భయపెట్టడానికి ప్రయత్నించడం లేదనీ, ఒవైసీ మనసులో భయం ఉంటే తానేమీ చేయలేనని అన్నారు. ఈ మాటల అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది.
సభ నుంచి బయటికొచ్చిన అనంతరం ఓవైసీ ఓ జాతీయ పత్రికతో మాట్లాడుతూ.. ‘బీజేపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని జాతివ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారు. జాతీయవాదులు, జాతివ్యతిరేకులు అని తేల్చేందుకు బీజేపీ దుకాణమేదైనా షురూ చేసిందా. బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడేక్రమంలో హోమంత్రి అమిత్‌షా మావైపు వేలు చూపించి బెదిరించేయత్నం చేశారు. ఆయన కేవలం హోంమంత్రి మాత్రమే. దేవుడు కాదు. సభలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడినికి ఆయన నిబంధనలు చదువుకుంటే మంచిది’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment