న్యూఢిల్లీ: అటల్‌జీ మంచి భోజన ప్రియుడని వాజ్‌పేయి సన్నిహితులు, విలేకరులు గుర్తు చేసుకున్నారు. ఆయనకు స్వీట్లు, రొయ్యలంటే మహా ఇష్టమని చెప్పారు. సీనియర్ జర్నలిస్టు రషీద్ కిద్వాయ్ మాట్లాడుతూ.. ‘ప్రధానిగా ఉన్న సమయంలో ఓ అధికారిక కార్యక్రమం తర్వాత భోజనం కోసమని నేరుగా ఫుడ్ కౌంటర్ వద్దకు వెళ్లారు అటల్‌జీ. ఆప్పుడు ఆయన ఆహార నియమాలు పాటిస్తున్నారు. దీంతో అతని సిబ్బంది ఓ ఆలోచన చేశారు. వెంటనే అక్కడున్న బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్‌ను పరిచయం చేశారు.
ఆ తర్వాత వారిద్దరూ సినిమాల గురించి మాట్లాడుతుండగా.. అక్కడున్న స్వీట్లను సిబ్బంది దాచేశారు’అని చెప్పారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడి స్థానికంగా లభించే ఆహార పదార్థాలను తింటానని పట్టుబట్టేవారని అటల్‌జీతో పని చేసిన అధికారులు గుర్తు చేసుకున్నారు. ‘కోల్‌కతాలో పుచ్‌కాస్, హైదరాబాద్‌లో బిర్యా నీ, హలీమ్, లక్నోలో గలోటి కబాబ్స్ ఆయన తినేవారు. చాట్ మసాలా దట్టించిన పకోడాలు, మసాల టీ కాంబినేషన్ ఆయనకు భలే ఇష్టం’ అని ఓ అధికారి చెప్పారు. ‘ఎన్నోసార్లు అటల్‌జీనే స్వయంగా మాకు వండిపెట్టారు. మాంసాహారం గానీ, స్వీట్‌గానీ ఏదో ఒకటి మా కోసం వండేవారు’ ఓ జర్నలిస్టు అన్నారు.
కేబినెట్ భేటీల్లో వేరుశనగలు తినేవారు
‘కేబినెట్ సమావేశాల సమయంలో అటల్‌జీ ఉప్పుతో దట్టించిన వేరుశనగ కాయాలు తినేవారు. ఖాళీ అయినాకొద్దీ తీసుకురమ్మనేవారు’అని అటల్‌జీతో పనిచేసిన ఓ సిబ్బంది చెప్పారు. ‘అటల్ తన సన్నిహితుడు లాల్జీ లాండన్‌ను లక్నోలోని చౌక్ నుంచి కబాబ్స్ తీసుకురమ్మనేవారు.
కేంద్ర మంత్రి విజయ్ గోయెల్ ఆయన కోసం ఢిల్లీ నుంచి బెడ్నీ ఆలూ, చాట్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి రొయ్యలు తీసుకొచ్చేవారు’అని మరో సన్నిహితుడు చెప్పారు. వాజ్‌పేయితో ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓ జర్నలిస్టు మాట్లాడుతూ.. ‘నేను చూసిన వారిలో చాలా రిలాక్స్‌డ్ ప్రధాని’అన్నారు. ఆయన అనారోగ్యంగా ఉన్నా కాజూ, సమోసాలు తినేవారని మరో సన్నిహితుడు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment