సాక్షి, విశాఖపట్నం: అందరూ ఊహించినట్టుగానే అవంతి శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కింది. విశాఖ జిల్లా నుంచి ప్రముఖ విద్యావేత్త, సీనియర్ రాజకీయ నాయకుడైన అవంతి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌లో చోటుదక్కడంతో ఆయన అనుచరులతో పాటు జిల్లాలోని ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.ఒకేసారి అభ్యర్థులను ప్రకటించినట్టుగానే పూర్తి స్థాయి కేబినెట్ మంత్రి వర్గాన్ని కూడా ఒకేసారి ప్రకటించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందర్ని ఆశ్చర్యచకితులను చేశారు. పైగా దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా తీసుకుంటున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కేబినెట్‌లో 50 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు. సామాజిక వర్గాల సమతుల్యతను పాటిస్తూ కేబినెట్ కూర్పు చేసిన ముఖ్యమంత్రి జగన్ విశాఖ జిల్లా నుంచి ఒకసారి ఎంపీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావును తన కేబినెట్‌లో చోటు కల్పించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో అవంతి విద్యాసంస్థల పేరిట 14కు పైగా ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ విద్యాసంస్థలను నడుపుతున్న అవంతి అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మంచి పేరుతెచ్చుకున్నారు.
2009లో రాజకీయ ఆరంగేట్రం
2009లో రాజకీయ ఆరంగేట్రం చేసిన అవంతి శ్రీనివాసరావు, అప్పటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున భీమిలి నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయగా..ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 2014 వరకు కొనసాగారు. 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి 47,932 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లోక్‌సభ సభ్యునిగా పార్లమెంటులోని వివిధ కమిటీలకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటు రూల్స్ కమిటీ, స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీల్లో సభ్యునిగా ప్రాతినిధ్యం వహించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ సాధన కోసం పార్లమెంటు వేదికగా ఎన్నో పోరాటాలు చేశారు.
ఎంపీ పదవీని త్యాగం చేసి
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు, ఆయన పోరాట పటిమకు ఆకర్షితుడైన అవంతి శ్రీనివాసరావు అనకాపల్లి ఎంపీ పదవీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. ఆ తర్వాత ఆయన్ని భీమిలి కో ఆర్డినేటర్‌గా నియమించగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో భీమిలి నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి సబ్బం హరిపై 9,712 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
మరోసారి నిజమైన సెంటిమెంట్
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైతే మంత్రి పదవి ఖాయమన్న సెంటిమెంట్ మరోసారి నిజమైంది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన పీవీజీ రాజు 1964లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1982లో పీవీజీరాజు కుమారుడు పి.ఆనందగజపతిరాజు ఎన్‌టీ రామారావు మంత్రి వర్గంలో పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎన్నికైన అప్పల నరసింహరాజు 1989లో ఎక్సైజ్ శాఖా మంత్రిగా పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందిన గంటా శ్రీనివాసరావు విద్యా మంత్రిగా పనిచేశారు. దీంతో భీమిలిని గెలుపొందిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉంటే మంత్రి పదవులు లభించడం సెంటిమెంట్‌గా మారింది. భీమిలి నుంచి 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన అవంతి శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కడంతో ఈ సెంటిమెంట్ మరోసారి నిజమైనట్టయింది.
సీఎం జగన్ నమ్మకాన్ని నిలబెడతా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా. సీఎం జగన్ కేబినెట్‌లో పనిచేసే అదృష్టం లభించడం చాలా ఆనందంగా ఉంది. సామాజిక వర్గాల సమతూకం పాటిస్తూ సీనియర్లు, యువతకు సమప్రాధాన్యతనిస్తూ కేబినెట్ రూపొందించడం నిజంగా గొప్పవిషయం. కేబినెట్‌లో తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. విశాఖ జిల్లా ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు తమ ప్రభుత్వం అమలుచేసే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు పాటుపడతాను.–ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతిశ్రీనివాసరావు)
వ్యక్తిగత వివరాలు
పేరు : ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాసరావు)
తండ్రి : వెంకట నారాయణ
పుట్టిన తేదీ : 12.06.1967
విద్యార్హత : డిగ్రీ
భార్య : ముత్తంశెట్టి జ్ఞానేశ్వరి, అవంతి విద్యా సంస్థల చైర్‌పర్సన్
కుమార్తె : ముత్తంశెట్టి ప్రియాంక, ఎంబిబిఎస్
అల్లుడు : ఐ.శ్రవణ్‌కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ అవంతి విద్యాసంస్థలు
కుమారుడు : ముత్తంశెట్టి వెంకటశివ నందీష్, బి.టెక్
స్వస్థలం : గోపవరం, ముసునూరు మండలం, కృష్ణాజిల్లా
నివాసం : 1. పాత బస్టాండ్, భీమిలి, విశాఖ జిల్లా 2. నిఖిత ఆసుపత్రి వద్ద, సీతమ్మధార, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment