పాత ‘బస్తీ మే సవాల్‌’..!  | Azharuddin is the Hyderabad MP ring from congress | Sakshi
Sakshi News home page

పాత ‘బస్తీ మే సవాల్‌’..! 

Published Mon, Mar 5 2018 2:44 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Azharuddin is the Hyderabad MP ring from congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మజ్లిస్‌ పార్టీతో అమీతుమీకి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది. ఎంఐఎంకు పట్టున్న పాతబస్తీలో సత్తా చాటేందుకు హస్తం పార్టీ వ్యూహం రచిస్తోంది. ఇన్నాళ్లూ ఎంఐఎంతో అవగాహన కుదుర్చుకుని పాతబస్తీ రాజకీయాలు చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఆ పార్టీని లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అనంతర పరిణామాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంఐఎం అనుసరిస్తున్న తీరును దృష్టిలో ఉంచుకుని మజ్లిస్‌తో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో మజ్లిస్‌ గెలిచే అవకాశమున్న అసెంబ్లీ స్థానాల్లో కనీసం నాలుగింటికైనా ఎసరు పెట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటి నుంచే అభ్యర్థుల వేటలో దిగిన పీసీసీ పెద్దలు.. దారుస్సలాంను దెబ్బతీసే బాధ్యతలను భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌కు అప్పగించనున్నారు. 

ఆ నాలుగింటిలో.. 
పాతబస్తీలో ఎంఐఎం ఆధిపత్యానికి గండికొట్టడం అంత సులువైన పనేమీ కాదు. దశాబ్దాలుగా ఆ పార్టీకి అండగా నిలుస్తున్న ఆరేడు నియోజకవర్గాల్లో దారుస్సలాం మాటే వేదం. అలాంటి చోట ఇన్నాళ్లూ మిత్రపక్షంగా ఉండి ఇప్పుడు టార్గెట్‌ చేయాల్సి రావడాన్ని కాంగ్రెస్‌ సవాల్‌గా తీసుకుంది. మజ్లిస్‌ గెలిచే అవకాశమున్న యాకుత్‌పుర, బహుదూర్‌పుర స్థానాల్లో కదిలించడం కష్టమేననే అంచనాకు వచ్చిన కాంగ్రెస్‌ మిగిలిన స్థానాలపై గురిపెట్టింది. ఎంఐఎంకు ఆయువుపట్టు లాంటి చార్మినార్, చాంద్రాయణగుట్ట, నాంపల్లి అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలని, ఆయా స్థానాల్లో సామాజిక, రాజకీయ పరిస్థితులు తమకు కలసి వస్తాయని అంచనా వేస్తోంది. చార్మినార్‌లో ఎంఐఎంకు చెందిన మాజీ కార్పొరేటర్‌ మహ్మద్‌గౌస్, చాంద్రాయణగుట్టలో ఎంఐఎం బద్ధశత్రువు మహ్మద్‌ పహిల్వాన్‌ను రంగంలోకి దింపాలని భావిస్తోంది. నాంపల్లి స్థానం నుంచి మంచి పట్టున్న ఇటీవలే పార్టీలో చేర్చుకున్న ఫిరోజ్‌ఖాన్‌కు నాంపల్లి టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది. కార్వాన్, మలక్‌పేట స్థానాల్లో ఇతర పార్టీలు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నేరుగా బరిలోకి దిగాలా.. లేక గట్టి అభ్యర్థులకు మద్దతిచ్చి ముందుకు నడిపించాలా అనే దానిపై పీసీసీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. 

అజారుద్దీన్‌ నేతృత్వంలో.. 
పాతబస్తీ రాజకీయాలను పూర్తిగా మార్చేయాలనుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ను తురుపుముక్కగా భావిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సూచన మేరకు హైదరాబాద్‌లోని ఎంఐఎం ప్రభావిత నియోజకవర్గాల పార్టీ బాధ్యతలను పూర్తిగా ఆయనకు అప్పగించే అవకాశాలున్నాయి. దీనిలో భాగంగానే పీసీసీ చేపట్టిన బస్సుయాత్రలోనూ అజర్‌కు తగిన ప్రాధాన్యమిస్తున్నారు. బస్సు యాత్ర ప్రారంభమైన చేవెళ్లలో జరిగిన తొలి బహిరంగసభలో అజారుద్దీన్‌తో మాట్లాడించడమే కాక.. రాహుల్‌ సూచన మేరకు ఈసారి అజర్‌ కీలకపాత్ర పోషిస్తారని బహిరంగంగా ప్రకటించారు. అజారుద్దీన్‌ పట్ల ఎంఐఎంకు మద్దతు పలికే వర్గాల్లోనూ సానుభూతి ఉంటుందని, ఆయనను హైదరాబాద్‌ పార్లమెంటు బరిలోకి దింపితే అసెంబ్లీ అభ్యర్థులకూ బలం చేకూరుతుందని కాంగ్రెస్‌ యోచిస్తోంది. త్వరలోనే అజర్‌తో పాతబస్తీలో కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్‌ చేస్తోంది. అయితే ఎంఐఎంను లక్ష్యంగా చేసుకోవాలనేది రాహుల్‌ నిర్ణయమేనని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం వైఖరి తమను దెబ్బతీసిందని ఏఐసీసీ పెద్దలు భావించారని, అందుకే ఎంఐఎంను ప్రత్యర్థిగా భావించాలని రాహుల్‌ డైరెక్షన్‌ ఇచ్చినట్టు పీసీసీ నేతలు చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement