![Babita Phogat Joins BJP - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/12/Babita-Phogat.jpg.webp?itok=X6w8K7O9)
న్యూఢిల్లీ: ప్రముఖ రెజ్లర్ బబితా ఫొగాట్, ఆమె తండ్రి మహావీర్ సింగ్ ఫొగాట్ సోమవారం బీజేపీలో చేరారు. కేంద్ర క్రీడల మంత్రి కిరెన్ రిజిజు సమక్షంలో ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ ఏడాది చివర్లో హరియాణా అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారులైన బబిత, మహావీర్ బీజేపీ గూటికి చేరారు.
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్ నుంచి అందమైన వధువులను తెచ్చుకోవచ్చంటూ హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బబితా రెండో రోజుల కిందట సమర్థించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ ఆమె గత కొన్ని రోజులుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరుణాన్ని చూసే అదృష్టం నాకు లేకపోయింది. కానీ, ఆర్టికల్ 370, 35ఏల రద్దుతో కశ్మీర్ స్వాతంత్ర్యం పొందడాన్ని చూసే అదృష్టం దక్కినందుకు ఆనందంగా ఉంది’ అని బబిత ట్వీట్ చేశారు. అయితే, క్రీడాకారులకు హరియాణా బీజేపీ సర్కారు అందించే నగదు ప్రోత్సాహకాలు సరిగ్గా లేవంటూ ఆమె గతంలో పలుసార్లు విమర్శలు చేశారు. 2014, 2018 కామన్‌వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన బబిత ప్రస్తుతం ‘నాచ్ బలియే’ డ్యాన్స్ షోలో పాల్గొంటున్నారు. త్వరలో ఆమెను పెళ్లి చేసుకోనున్న సహ రెజ్లర్ వివేక్ సుహాగ్ ఈ షోలో ఆమెకు జోడీగా వ్యవహరిస్తున్నారు. మహావీర్‌సింగ్ ఫొగాట్, ఆయన కూతుళ్ల జీవితకథ ఆధారంగా ఆమిర్ ఖాన్ 2016లో ‘దంగల్’ సినిమా తీసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment