సాక్షి, అమరావతి బ్యూరో: సీఎం చంద్రబాబు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తాననడంలో దుర్మార్గపు, స్వార్థపరమైన ఆలోచన, కుట్ర దాగి ఉన్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 124వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించిందని, పార్లమెంటు ఉభయసభలు దీనిని ఆమోదించాయని తెలిపారు. రాష్ట్రాలు ఈ రాజ్యాంగ సవరణను ఆమోదించాలని, సగం రాష్ట్రాలు ఆమోదిస్తే చాలని అన్నారు. ఈ తరుణంలో చంద్రబాబు వివాదానికి తెరలేపుతున్నారని, బిల్లు విత్ ఇన్ ది బిల్ పేరుతో రాష్ట్రంలో ఒక బిల్లు చొప్పించి, కాపులకు రిజర్వేషన్లు ఈబీసీల కోటాలో కేటాయిస్తాననడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
కేంద్రం ఇస్తున్న ఈబీసీ రిజర్వేషన్లను బాబు రాజకీయ ప్రయోజనాల కోసం, కాపులను మోసగించడానికి వాడుకుంటున్నారని చెప్పారు. ఈబీసీ 10 శాతం కోటాలో 5 శాతం కాపులకు ఇస్తామంటూ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు అలవాటేనని, ఎస్సీ వర్గీకరణ పేరుతోనూ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టారని వివరించారు. వాస్తవానికి ఈబీసీ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్లు అనేవి చంద్రబాబు చేతుల్లో లేవని స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ విషయంలో రాష్ట్రాలు కేవలం ఆమోదించిందీ లేనిదీ మాత్రమే వెల్లడించాల్సి ఉందన్నారు. సవరణ ప్రతిపాదించే హక్కు మాత్రం లేదన్నారు. పార్లమెంటు జరుగుతున్నప్పుడే దాన్ని పొందుపరచమని అడగొచ్చని, బాబు అలా చేయలేదని వివరించారు.
టీడీపీ ముసుగు తొలిగింది
పార్లమెంట్‌లో తెలంగాణ ఎంపీలు ముస్లింమైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు పొందుపర్చాలని కోరారని, అయితే ఆ రిజర్వేషన్‌లు ఓబీసీలకేనని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. పార్లమెంట్‌లో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వండని టీడీపీ సభ్యులెవరూ నోరుమెదపలేదని తెలిపారు. గత పార్లమెంటు సమావేశాల్లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ‘ఏపీ నుంచి కాపు రిజర్వేషన్ ప్రతిపాదన వచ్చింది.. అది ఎంతవరకొచ్చింది’ అని ప్రశ్నించగా, సాక్షుత్తు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ ‘ఏపీ నుంచి అటువంటి ప్రతిపాదన రాలేదు.. అలాంటప్పుడు అలాంటి ప్రశ్న ఉత్పన్నం కాదు’ అని చెప్పడంతోనే టీడీపీ ముసుగు తొలగిందన్నారు. కాపు సామాజికవర్గాన్ని మభ్యపెట్టినందుకు బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్‌ల ప్రతిపాదనను ఆహ్వానిస్తూ కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు సీఎంకు అభినందనలు తెలిపారని, ఈ రిజర్వేషన్లు సాధ్యం కావని తెలిసి కూడా ఇలా చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పుడు ఈబీసీలకు, కాపులకు మధ్య గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు తనవేనని చెప్పబోతున్న చంద్రబాబు
ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌కు వచ్చిన ప్రజా స్పందన చూసి మతిభ్రమించిన బాబు.. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఏం చేయాలో తెలియక ఇప్పటికే కొన్ని నవరత్నాలను దొంగలించారని ఎద్దేవా చేశారు. రత్నాల దొంగలు రాజకీయాల్లోకి వస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. 2017లో జగన్ గుంటూరు ప్లీనరీ సభల్లోనే పింఛన్లు రూ.2 వేలకు పెంచుతామని చెప్పారని, ఇప్పుడు బాబు నిద్ర లేచి తాను కొత్తగా ఇచ్చినట్టు చెబుతున్నారని విమర్శించారు. రైతురక్ష పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రకటించిన నవరత్నాలను దొంగలించి.. అవి తనవేనని బాబు చెప్పబోతున్నారని చెప్పారు. కోల్‌కతాలో చంద్రబాబు కర్ణాటకలో ఫిరాయింపులపై మాట్లాడటంపై అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించి.. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల పేర్లు ఇప్పటికీ అసెంబ్లీ గెజిట్‌లో వైఎస్సార్‌సీపీ జాబితాలోనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.1252 కోట్లు బకాయిలున్నాయని, దీంతో విద్యార్థుల చదువులు ముగిసినా కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌లు నిలిచిపోయాయని, ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్లు లేక ఇబ్బంది పడుతున్నా.. ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్‌పై హత్యాయత్నంలో టీడీపీ నాయకత్వ ప్రమేయం
వైఎస్ జగన్‌పై హత్యాయత్నంలో టీడీపీ నాయకత్వ ప్రమేయం, కుట్ర కోణం దాగి ఉన్నాయని ఉమ్మారెడ్డి అన్నారు. లేకుంటే ఎన్‌ఐఏ దర్యాప్తునకు సహకరించకపోగా ఎందుకు ఉలిక్కిపడుతున్నారని, హైకోర్టులో స్టే కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ ప్రమేయం లేదంటే ఎన్‌ఐఏకు సహకరించి రికార్డులు అప్పగించాలని సూచించారు. పొత్తుల కోసం ఆరాటపడేది టీడీపీయేనని.. వైఎస్ జగన్ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఉమ్మారెడ్డి వివరించారు.
కాపు రిజర్వేషన్ల పేరుతో బాబు కుట్ర
Published Thu, Jan 24 2019 2:46 AM | Last Updated on Thu, Jan 24 2019 2:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment