
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్టీఆర్ కట్టిన కోటలో నాడు చంద్రబాబు రూపంలో మొలిచిన ఒక గంజాయి మొక్క ఇప్పుడు వటవృక్షమై రాష్ట్రాన్ని దహించివేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం, విజయనగరం రీజనల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాసంక్షేమం కాకుండా కేవలం ధనవంతులు, పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని తుదముట్టించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబు పాలన చూసి విసిగి వేసారిపోయిన ప్రజలు మళ్లీ రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నారని చెప్పారు.
శ్రీకాకుళంలోని ఆనందమయి కన్వెన్షన్ హాల్‌లో వైఎస్సార్‌సీపీ బూత్ కన్వీనర్ల శిక్షణ తరగతుల్లో భాగంగా మంగళవారం శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాలకు చెందినవారికి నిర్వహించారు. ‘వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం, పార్టీ భావజాలం, రాజన్న పాలన’ అంశంపై భూమన ఉద్వేగంగా ప్రసంగించారు. చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలోనూ కరువు, కాటకాలే గాక అవినీతి, ఆశ్రిత బంధుప్రీతితో ప్రజలు అనేక కష్టాలు అనుభవించారన్నారు.
అలాంటి పరిస్థితుల్లో రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి ప్రజల్లో భరోసా నింపారన్నారు. ఆ పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన వైఎస్సార్ తన పాలనలో ప్రతిక్షణం ప్రజారంజక పాలన కోసమే తపించారని తెలిపారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచానికే స్ఫూర్తిదాయంగా నిలిచిందన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి అకాల మరణంతో నిర్వీర్యమైపోయిన ఆయన ఆశయాలే ఊపిరిగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిందని వివరించారు. నాడు తన తండ్రి రగిల్చిన స్ఫూర్తిని గుండెనిండా నింపుకుని, ఆయన మిగిల్చిన ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు మూడువేల కిలోమీటర్ల పాదయాత్రకు సంకల్పించారని తెలిపారు. చైనాలో మావోసేటుంగ్ చేపట్టిన పాదయాత్ర తర్వాత ప్రపంచంలో ప్రజల సంక్షేమంకోసం సాగుతున్న గొప్పయాత్ర జగన్ ప్రజాసంకల్పయాత్ర అని అభివర్ణించారు.
వైఎస్సార్ సాకారం చేసి చూపించిన సంక్షేమ రాజ్యస్థాపనకోసం ఆయన కుమారుడిగా జగన్ ప్రజాక్షేత్రంలో నిరంతర పోరు సాగిస్తున్నారని చెప్పారు. జగనన్న ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వచ్చే ఎన్నికల్లో వారి ఆశీర్వాదంతో పార్టీని విజయతీరాలకు చేర్చాలని భూమన పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.పార్థసారధి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పార్టీ పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన వేణు, కుంభా రవిబాబు, రెడ్డి శాంతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment