నిజాం నిరంకుశ పదఘట్టనలు.. వెట్టిచాకిరి బతుకులు.. బాంచెన్ దొర.. నీ కాల్మొక్త దొర అంటూ.. తలదించుకుని.. బతికే కాలం.. మట్టి మనుషుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన అగ్నికణం.. బద్దం ఎల్లారెడ్డి. తాడిత, పీడిత ప్రజలను ఏకం చేసి వ్యవసాయ పని ముట్లను ఆయుధంగా మలిచి బానిసత్వం తిరుగుబాటు బావుటా ఎల్లారెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి నిఖార్సయిన పోరాట యోధుడు.
1951లో జరిగిన తొలి ఎన్నికల్లోనే పీడీఎఫ్ అభ్యర్థిగా కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బద్దం ఎల్లారెడ్డి విజయం సాధించారు.
సొంత భూమిని పేదలకు పంచిన మానవతావాది. ఒక్కసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బద్దం ఎల్లారెడ్డి తుదిశ్వాస విడిచేవరకు అట్టడుగువర్గాల మేలుకోరిన ప్రజానేత.
యువ కెరటం.. అరుణ పతాకం..
గాలిపెల్లికి చెందిన బద్దం హన్మంతరెడ్డి–లచ్చవ్వల రెండో సంతానంగా 1906లో జన్మించిన బద్దం ఎల్లారెడ్డి యుక్త వయసులోనే కమ్యూనిజం భావజాలాన్ని ఒంట బట్టించుకున్న ఆయన మట్టిమనుషుల కోసం.. వెట్టిచాకిరి విముక్తికోసం ఎర్రజెండా నీడలో సాయుధపోరాటానికి బాటలు వేశాడు. నాటి హైదరాబాద్ సంస్థానం రాజులు, ఆయన తాబేదార్ల నియంత పాలనకు వ్యతిరేకంగా ఉరకలెత్తే యువకెరటం ఎల్లారెడ్డి. ఆయనతో కలిసిన జనవాహినిని అక్కున చేర్చుకొని నిజాం గుండెల్లో కత్తులు దించిన విప్లవోద్యమ కడలి తరంగం. నిజాం పిశాచానికి ముచ్చెమటలు పట్టించిన వీరుడు బద్దం ఎల్లారెడ్డి. అజ్ఞాతవాసంతో చరిత్రాత్మక పోరాటాన్ని సాగించారు.
సాయుధ పోరాటానికి సై.. అంటూ..
తెలంగాణ విముక్తి ఉద్యమం చురుగ్గా సాగుతున్న దశలో 1935 డిసెంబర్‌లో సిరిసిల్లలో నాల్గో ఆంధ్ర మహాసభ మాడపాటి హన్మంతరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో బద్దం ఎల్లారెడ్డి అగ్రభాగాన ఉన్నారు. ఇక్కడ తీసుకున్న కీలక నిర్ణయాలతో విముక్తి పోరాటం ఉవ్వెత్తున ఎగిసింది. ఉద్యమ స్వరూపాన్నే మార్చింది. సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నర్సింహారావు, కె.వి.రంగారెడ్డి లాంటి వారితో జిల్లాలోని పలువురు నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. గెరిల్లా దళాలకు మానాల క్యాంపులో శిక్షణ ఇస్తూ.. పోరాటానికి బాటలు వేశారు. 1948 మార్చి 12న ఇల్లంతకుంట పోలీసు క్యాంపుపై సాయుధ ఉద్యమకారులు దాడి చేసి ఎస్సైతో సహా ఆరుగురు పోలీసులను హతమార్చారు. ఈ దాడితో గెరిల్లా తరహాదాడులకు తెలంగాణ ఉద్యమకారులు తెగించి తెగువను చాటుకున్నారు. గాలిపెల్లిలో బద్దం ఎల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. నిజాం తాబేదార్లు దేశాయిలు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, పటేల్, పట్వారీలు ప్రజలను శ్రమదోపిడీ చేస్తూ.. పెత్తనం చలాయించేవారు. వీటిపై ఎల్లారెడ్డి తిరుగుబాటు చేశారు. పేదల అప్పు పత్రాలను పెత్తందార్ల నుంచి తెచ్చి ప్రజల సమక్షంలో కాల్చివేశారు. ఇది జీర్ణించుకోలేని నిజాం పోలీసులు ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతూ నిర్బంధాన్ని అమలు చేశారు. గాలిపెల్లిలో పోలీసులు కాల్పులు జరపగా పదకొండు మంది ఒకేరోజు అమరులయ్యారు. నిజాం సాగించిన మారణహోమానికి గాలిపెల్లి నేల రక్తంతో తడిసి బలిపీఠమైంది. శ్రమదోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఎల్లారెడ్డి ముఖ్యభూమికను పోషించారు.
సొంత భూములు పంచిన దానశీలి..
గాలిపెల్లిలో తన సొంత భూములను బీదలకు పంచడంతో పాటు.. సిరిసిల్ల ప్రాంతాల్లో దున్నేవాడిదే భూమి అంటూ.. ఉద్యమాన్ని రగిలించారు. నిజాయితీగా ఉంటూ.. అంతే నిబద్ధతతో పనిచేశారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఎల్లారెడ్డి మద్రాసులో అరెస్ట్ అయి మూడు నెలల జైలుశిక్షను అనుభవించారు. జైలు నుంచి వచ్చిన ఎల్లారెడ్డి కరీంనగర్ జిల్లాలో విముక్తి పోరాటాన్ని సాగించారు.
తొలి ఎన్నికల్లోనే...
1951లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో నాటి సోషలిస్ట్ పార్టీ సభ్యుడు జువ్వాడి గౌతంరావును రెండవ స్థానంలో, కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన పి.వి.నర్సింహారావును 3 వ స్థానంలో నిలిపి ఎన్నికల్లో తొలి విజయాన్ని సాధించారు ఎల్లారెడ్డి. అప్పుడు ప్రత్యర్థి అయిన పి.వి.నర్సింహారావు ఆ తరువాత భారత ప్రధానిగా పని చేశారు. ఎల్లారెడ్డి 1956లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పని చేశారు. 1958లో బుగ్గారం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. రెండోసారి 1972లో ఇందుర్తి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఒక్కసారి ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బద్దం ఎల్లారెడ్డి నిజాయితీ గల నేతగా.. ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. బస్సులోనే ప్రయాణిస్తూ.. సామాన్యులతో కలిసిపోయేవారు.
ఆయన స్ఫూర్తిగా..
బద్దం ఎల్లారెడ్డి స్ఫూర్తిగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బి.వై.నగర్ పేరుతో కార్మిక క్షేత్రం ఉంది. కరీంనగర్‌లో బద్దం ఎల్లారెడ్డి భవన్ ఉంది. 1979లో ఎల్లారెడ్డి తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కొడుకులు రాంరెడ్డి, లక్ష్మారెడ్డి, ఒక కూతురు విజయ ఉన్నారు. ప్రజాజీవనంలో నేటి తరం నేతలకు బద్దం ఎల్లారెడ్డి స్ఫూర్తిగా నిలుస్తారు. - వూరడి మల్లికార్జున్, సాక్షి–సిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment