baddam yellareddy
-
వెట్టి విముక్తి ప్రదాత
నిజాం నిరంకుశ పదఘట్టనలు.. వెట్టిచాకిరి బతుకులు.. బాంచెన్ దొర.. నీ కాల్మొక్త దొర అంటూ.. తలదించుకుని.. బతికే కాలం.. మట్టి మనుషుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన అగ్నికణం.. బద్దం ఎల్లారెడ్డి. తాడిత, పీడిత ప్రజలను ఏకం చేసి వ్యవసాయ పని ముట్లను ఆయుధంగా మలిచి బానిసత్వం తిరుగుబాటు బావుటా ఎల్లారెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి నిఖార్సయిన పోరాట యోధుడు. 1951లో జరిగిన తొలి ఎన్నికల్లోనే పీడీఎఫ్ అభ్యర్థిగా కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బద్దం ఎల్లారెడ్డి విజయం సాధించారు. సొంత భూమిని పేదలకు పంచిన మానవతావాది. ఒక్కసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బద్దం ఎల్లారెడ్డి తుదిశ్వాస విడిచేవరకు అట్టడుగువర్గాల మేలుకోరిన ప్రజానేత. యువ కెరటం.. అరుణ పతాకం.. గాలిపెల్లికి చెందిన బద్దం హన్మంతరెడ్డి–లచ్చవ్వల రెండో సంతానంగా 1906లో జన్మించిన బద్దం ఎల్లారెడ్డి యుక్త వయసులోనే కమ్యూనిజం భావజాలాన్ని ఒంట బట్టించుకున్న ఆయన మట్టిమనుషుల కోసం.. వెట్టిచాకిరి విముక్తికోసం ఎర్రజెండా నీడలో సాయుధపోరాటానికి బాటలు వేశాడు. నాటి హైదరాబాద్ సంస్థానం రాజులు, ఆయన తాబేదార్ల నియంత పాలనకు వ్యతిరేకంగా ఉరకలెత్తే యువకెరటం ఎల్లారెడ్డి. ఆయనతో కలిసిన జనవాహినిని అక్కున చేర్చుకొని నిజాం గుండెల్లో కత్తులు దించిన విప్లవోద్యమ కడలి తరంగం. నిజాం పిశాచానికి ముచ్చెమటలు పట్టించిన వీరుడు బద్దం ఎల్లారెడ్డి. అజ్ఞాతవాసంతో చరిత్రాత్మక పోరాటాన్ని సాగించారు. సాయుధ పోరాటానికి సై.. అంటూ.. తెలంగాణ విముక్తి ఉద్యమం చురుగ్గా సాగుతున్న దశలో 1935 డిసెంబర్లో సిరిసిల్లలో నాల్గో ఆంధ్ర మహాసభ మాడపాటి హన్మంతరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో బద్దం ఎల్లారెడ్డి అగ్రభాగాన ఉన్నారు. ఇక్కడ తీసుకున్న కీలక నిర్ణయాలతో విముక్తి పోరాటం ఉవ్వెత్తున ఎగిసింది. ఉద్యమ స్వరూపాన్నే మార్చింది. సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నర్సింహారావు, కె.వి.రంగారెడ్డి లాంటి వారితో జిల్లాలోని పలువురు నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. గెరిల్లా దళాలకు మానాల క్యాంపులో శిక్షణ ఇస్తూ.. పోరాటానికి బాటలు వేశారు. 1948 మార్చి 12న ఇల్లంతకుంట పోలీసు క్యాంపుపై సాయుధ ఉద్యమకారులు దాడి చేసి ఎస్సైతో సహా ఆరుగురు పోలీసులను హతమార్చారు. ఈ దాడితో గెరిల్లా తరహాదాడులకు తెలంగాణ ఉద్యమకారులు తెగించి తెగువను చాటుకున్నారు. గాలిపెల్లిలో బద్దం ఎల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. నిజాం తాబేదార్లు దేశాయిలు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, పటేల్, పట్వారీలు ప్రజలను శ్రమదోపిడీ చేస్తూ.. పెత్తనం చలాయించేవారు. వీటిపై ఎల్లారెడ్డి తిరుగుబాటు చేశారు. పేదల అప్పు పత్రాలను పెత్తందార్ల నుంచి తెచ్చి ప్రజల సమక్షంలో కాల్చివేశారు. ఇది జీర్ణించుకోలేని నిజాం పోలీసులు ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతూ నిర్బంధాన్ని అమలు చేశారు. గాలిపెల్లిలో పోలీసులు కాల్పులు జరపగా పదకొండు మంది ఒకేరోజు అమరులయ్యారు. నిజాం సాగించిన మారణహోమానికి గాలిపెల్లి నేల రక్తంతో తడిసి బలిపీఠమైంది. శ్రమదోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఎల్లారెడ్డి ముఖ్యభూమికను పోషించారు. సొంత భూములు పంచిన దానశీలి.. గాలిపెల్లిలో తన సొంత భూములను బీదలకు పంచడంతో పాటు.. సిరిసిల్ల ప్రాంతాల్లో దున్నేవాడిదే భూమి అంటూ.. ఉద్యమాన్ని రగిలించారు. నిజాయితీగా ఉంటూ.. అంతే నిబద్ధతతో పనిచేశారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఎల్లారెడ్డి మద్రాసులో అరెస్ట్ అయి మూడు నెలల జైలుశిక్షను అనుభవించారు. జైలు నుంచి వచ్చిన ఎల్లారెడ్డి కరీంనగర్ జిల్లాలో విముక్తి పోరాటాన్ని సాగించారు. తొలి ఎన్నికల్లోనే... 1951లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో నాటి సోషలిస్ట్ పార్టీ సభ్యుడు జువ్వాడి గౌతంరావును రెండవ స్థానంలో, కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన పి.వి.నర్సింహారావును 3 వ స్థానంలో నిలిపి ఎన్నికల్లో తొలి విజయాన్ని సాధించారు ఎల్లారెడ్డి. అప్పుడు ప్రత్యర్థి అయిన పి.వి.నర్సింహారావు ఆ తరువాత భారత ప్రధానిగా పని చేశారు. ఎల్లారెడ్డి 1956లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పని చేశారు. 1958లో బుగ్గారం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. రెండోసారి 1972లో ఇందుర్తి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఒక్కసారి ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బద్దం ఎల్లారెడ్డి నిజాయితీ గల నేతగా.. ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. బస్సులోనే ప్రయాణిస్తూ.. సామాన్యులతో కలిసిపోయేవారు. ఆయన స్ఫూర్తిగా.. బద్దం ఎల్లారెడ్డి స్ఫూర్తిగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బి.వై.నగర్ పేరుతో కార్మిక క్షేత్రం ఉంది. కరీంనగర్లో బద్దం ఎల్లారెడ్డి భవన్ ఉంది. 1979లో ఎల్లారెడ్డి తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కొడుకులు రాంరెడ్డి, లక్ష్మారెడ్డి, ఒక కూతురు విజయ ఉన్నారు. ప్రజాజీవనంలో నేటి తరం నేతలకు బద్దం ఎల్లారెడ్డి స్ఫూర్తిగా నిలుస్తారు. - వూరడి మల్లికార్జున్, సాక్షి–సిరిసిల్ల -
ఆ విప్లవ గాథను విస్మరించొద్దు
1946, జులై 4న జరిగిన దొడ్డి కొమరయ్య ప్రాణ త్యాగంతో కమ్యూనిస్టుల తిరుగుబాటు ప్రారంభమైందని చెప్పినా, రావి నారాయణరెడ్డి (ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు), బద్దం ఎల్లారెడ్డి (తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి), మగ్దూం మొహియుద్దీన్ (అఖిల హైదరాబాద్ రాష్ట్ర కార్మిక సంఘ అధ్యక్షుడు) ఇచ్చిన పిలుపుతో 1947, సెప్టెంబర్ 11న సాయుధ పోరు ప్రారంభమైందని అంటారు. తరతరాలుగా ప్రజలను బానిసలుగా చూస్తూ ఆధిపత్యం చెలాయిస్తున్న దొరలను, దొర గడీల వ్యవస్థను కూల్చిన సాయుధ పోరాటం తెలంగాణ నేలపై జరిగింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించి దేశమంతా ఉత్సవాలు జరుపుకుంటుంటే తెలంగాణలో ఆ ఛాయలు లేవు. తమ బతుకులను మార్చు కునేందుకు ‘దున్నేవానిదే భూమి’ నినాదం తో తెలంగాణలో పోరాటం జరిగింది. 1947 సెప్టెంబర్ 11వ తేదీన మొదలైన ఆ పోరాటం 1948 సెప్టెంబర్ 17 వరకు కొనసాగింది. ఖాసిం రజ్వీ సైన్యం తెలంగాణను గాయపరి చింది. కారం పొట్లాలు, రోకలి బండలు, బరి సెలు, వడిసెల రాళ్లతో మొదలైన పోరాటం అంతిమంగా సాయుధమైంది. బందగీ త్యాగంతో మొదలైన భూపోరాటం, ఐలమ్మ బువ్వగింజల పోరుగా, దొరగడీని కూల్చి వేసిన దొడ్డి కొమరయ్య మహాప్రస్థానంగా సాగింది. స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపు కోవలసిన తెలంగాణ ఎందుకు తుపాకి పట్టి నెత్తురు ముద్దగా మారిందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఉక్కు మనిషిగా మారిపోయింది. సోషలిస్టు తరహా ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తానని హామీలు ఇచ్చి న నేతలు కూడా ఒక్క మాటైనా చెప్పకుండా సైనిక చర్యకు ఉపక్రమించారు. ఫలితంగా 4,000 మంది అమరులయ్యారు. ఆ అమ రుల నెత్తురు నుంచే దేశంలో భూసంస్కరణల అమలు చట్టాలు ప్రభవించాయి. ఇది తెలంగాణ చరిత్ర. తెలంగాణ సాయుధ పోరుకు అంకురార్పణ జరిగి ఈ సెప్టెంబర్ 11కు 66 సంవ త్సరాలైంది. జులై 4, 1946న జరిగిన దొడ్డి కొమరయ్య ప్రాణత్యాగంతో కమ్యూనిస్టుల తిరుగుబాటు ప్రారంభమైందని చెప్పినా, రావి నారాయణరెడ్డి (ఆంధ్ర మహాసభ అధ్య క్షుడు), బద్దం ఎల్లారెడ్డి (తెలంగాణ కమ్యూ నిస్టు పార్టీ కార్యదర్శి), మగ్దూం మొహి యుద్దీన్ (అఖిల హైదరాబాద్ రాష్ట్ర కార్మిక సంఘ అధ్యక్షుడు) ఇచ్చిన పిలుపుతో 1947 సెప్టెంబర్ 11న సాయుధ పోరు ప్రారంభ మైందంటారు. ఈ త్యాగాల చరిత్రను కొత్త తరం రక్తంలోకి ఎక్కిస్తే మళ్లీ దండ కార ణ్యాలు భగ్గున మండుతాయనో ఏమో కానీ గ్రీన్‌హంట్ సిలబస్‌లు చెబుతున్నారు. 14వ నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు ప్రజలను కదిలించాయి. ఈ మహాసభల పునాదుల మీదే రైతాంగ పోరాటం రూపు దిద్దుకుంది. ఈ సాయుధ పోరాట స్ఫూర్తి నుంచి వచ్చిన కమ్యూనిస్టు నాయకులే ఆ తర్వాత అంతర్జాతీయంగా పేరు గడించారు. ఈ పోరాటం లేకపోతే దేవులపల్లి వెంకటేశ్వరరావు, పుచ్చ లపల్లి సుందరయ్య, చండ్రపుల్లారెడ్డి, తరి మెల నాగిరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, భీమి రెడ్డి నర్సింహారెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి లాంటి నేతలు ఉద్భవించేవారు కాదు. ఆ మహత్తర పోరాటాన్ని ప్రఖ్యాత చిత్రకా రుడు చిత్తప్రసాద్ తన చిత్రాలలో లిఖించారు. ఇప్పుడు తెలంగాణ తన చరిత్రను తాను రాసుకునేందుకు సిద్ధమైంది. ఇంత మహో జ్వల చరిత్రపైన ఎవరి నీలినీడలు కమ్ముకు న్నాయోగానీ, ఈ తరానికి తెలియకుండా చేస్తున్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతిబిడ్డా ఈ నేల కున్న గొప్పతనాన్ని తెలుసుకునేందుకు ఆనాటి సంస్కృతిని, సంప్రదాయాలను, ఆ పోరులో వాడిన ఆయుధాలను, ఆనాటి ప్రజల కట్టుబాట్లను ప్రతిబింబించే పురా వస్తు ప్రదర్శనశాలను నెలకొల్పాలి. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, బండి యాదగిరి, నల్లా నర్సింహులు లాంటి వేల మంది త్యాగ ధనుల స్ఫూర్తి ఆ మ్యూజియంలో కనిపిం చాలి. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు తెలం గాణలో సుమారు 15 వేల మందికి పైగా ఎర్రదారిలో నిలిచి అసువులు బాశారు. ఆ వీరుల స్మృతి చిహ్నంగా, ఈ నాటి మలిదశ పోరాటంలో అసువులు బాసిన వారి స్మృత్య ర్థం ఇండియాగేట్ మాదిరిగా తెలంగాణ గేట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలి. మాతృ భాషలో బోధన కోసం, మాతృ భాష కోసం ఆత్మగౌరవ పోరాటం తెలంగాణలోనే జరిగిం దన్న విషయాన్ని తెలియజేయాలి. ఆ చరి త్రను కొత్తతరం అధ్యయనం చేస్తే ఎందరెం దరో క్యాస్ట్రోలు, చేగువేరలు, భగత్‌సింగ్‌లు, సుభాష్ చంద్రబోస్‌లు అవతరిస్తారు. - జూలూరు గౌరీశంకర్ అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక (వీర తెలంగాణలో సాయుధ పోరాటం ప్రారంభమై నేటికి 66 సంవత్సరాలు)