సాక్షి, ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 27మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవలసి వచ్చిందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకుని ఉంటే లోక్‌సభలో ఈ సమస్యను ప్రస్థావించాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈ ఘటనపై లోక్‌సభలో తాము మాట్లాడిన వాటిని రికార్డుల నుంచి తొలగించాలని టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్‌ను కోరుతున్నారని విమర్శించారు. రాష్ట్రం సమస్యకు పరిష్కారం చూపకపోతే.. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కారం కోసం ప్రయత్నించకుండా ఏం చేయమంటారని నిలదీశారు. విద్యార్థుల సమస్యలపై స్పందించకుండా, నిశ్శబ్దంగా ఉండే పార్టీ బీజేపీ కాదని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ పార్టీ అరాచకాలను, అవినీతిని లోక్‌సభలో ప్రస్తావిస్తామని అన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో దేశం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇంత మంది విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని దేశ స్థాయిలో పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. తాము ఏ విధంగా మాట్లాడాలో టీఆర్ఎస్ పార్టీ సలహాలు సూచనలు ఇస్తే వాటిని పాటించేందుకు సిద్ధంగా లేమని అన్నారు.
27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలకు సిగ్గుపడకుండా.. దానికి సంబంధించి తాము మాట్లాడిన విషయాలను రికార్డుల నుంచి తొలగించాలని టీఆర్ఎస్ ఎంపీలు కోరడం విషయం రికార్డుల నుంచి తొలగించాలని టీఆర్ఎస్ ఎంపీలు కోరడం సిగ్గుచేటుగా ఉందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఘాటుగా విమర్శించారు. తెలంగాణలోని పలు సమస్యలను ఎత్తిచూపడాన్ని టీఆర్‌ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నదని అన్నారు. బీజేపీ అందరి పార్టీ అని, విద్యార్థుల సమస్యలను లేవనెత్తడానికి అవకాశం ఉన్న ఏ వేదికనైనా తాము ఉపయోగించుకుంటామని తెలిపారు. తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా? లేదా? అనేది ప్రశ్నగా మిగిలిందని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment