నిమ్మరసం తీసుకొని దీక్ష విరమిస్తున్న బండి సంజయ్, మోత్కుపల్లి, పెద్దిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొం టున్న సమస్యలను పరిష్కరించాలని, గిట్టుబాటు ధరలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఒక రోజు ఉపవాస దీక్షను చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు బీజేపీ కార్యాలయంలో దీక్షను నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన తన దీక్ష ప్రారంభించారు.«ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందుకు, నిరసనగా రైతులకు మద్దతుగా ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్న రైతుల విషయం, కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లపై కనీసం కేబినెట్‌లో చర్చించకపోవడం దారుణమన్నారు.
తాము సూచనలు చేసినా, సలహాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. లాక్ డౌన్ కాలంలో ఐకేపీకి తెచ్చిన ధాన్యం తిరిగి తీసుకెళ్లాలంటే రైతు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.ఎక్కడా ఎలక్ట్రానిక్ కాంటాలు లేవన్నారు. కొన్ని చోట్ల కొనుగోళ్లు ప్రారంభించనే లేదన్నారు. ఈ పరిస్థితులతో రైతులు లాభాలు ఆశించడం లేదని, పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అంటున్నారని, గిట్టుబాటు లేక వారు కన్నీరు పెడుతున్నారన్నారు. రూ. 30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అంటున్న ప్రభుత్వం ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతు సమన్వయ సమితులు,అధికారులు, మిల్లర్లకు కొమ్ము కాస్తున్నారని, బ్రోకరిజం చేస్తున్నారని ఆరోపించారు.
అందుకే అన్ని జిల్లాల్లో బీజేపీ నేతలు ఒక్క రోజు ఉప వాస దీక్షలో పాల్గొన్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతు సమస్యలు పరిష్కరించాలన్నారు. రాజకీయ నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని మాట్లాడు తున్నారని, మోనార్క్ పాలన సాగుతోందన్నారు. సమస్యలు పరిష్కరించమంటే విమర్శలు చేస్తున్నారని, రైతులు ఆందోళన చెందవద్దని, బీజేపీ అండగా ఉంటుందన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ ఎవరి చేతిలో అధికారం ఉండకూడదో వారి చేతిలోకి వెళ్లిందన్నారు. ప్రతీ గింజ కొంటా అన్న కేసీఆర్ క్షేత్రస్థాయి పరిస్థితి ఏందో చూడాలన్నారు. ఈ దీక్షలో మాజీ మంత్రులు విజయ రామారావు, పెద్దిరెడ్డి, బీజేపీ నేతలు పేరాల శేఖర్‌రావు, జి.ప్రేమేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment