ముషీరాబాద్ (హైదరాబాద్): గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్‌లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో శనివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహదీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంత్‌రావు, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాములు, తెలంగాణ జనసమితి నగర అధ్యక్షులు ఎం.నర్సయ్యలతో పాటు వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులు దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ...గత 14 ఏళ్లుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్‌లను ప్రభుత్వం తొలగించడం అనైతికమని, ఏ కారణం చేత వారిని తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. జీతాలు పెంచాలని సమ్మె చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు చేసే 7,500 మంది ఉద్యోగులలో 7,450 మంది అంటే 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందినవారని ఆయన గుర్తుచేశారు. ఈ అక్రమ తొలగింపుపై జాతీయ బీసీ,ఎస్సీ, ఎస్టీ కమిషన్లు జోక్యం చేసుకుని వారికి న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు సత్యాగ్రహదీక్షలో పాల్గొన్నారు. దీక్షకు జాతీయ బీసీ సేన అధ్యక్షులు బర్క కృష్ణతో పాటు ఇతర బీసీ నాయకులు మద్దతు తెలిపారు.
బీసీ భవన్‌లో సత్యాగ్రహ దీక్ష చేస్తున్న ఆర్.కృష్ణయ్య. పక్కన చాడ వెంకట్‌రెడ్డి, ఎల్.రమణ తదితరులు
Comments
Please login to add a commentAdd a comment