ఆనం జయకుమార్‌రెడ్డితో మాట్లాడుతున్న బీద రవిచంద్ర
సాక్షి, నెల్లూరు: ‘మా కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉంది. ఎన్నో రాజకీయ పదవుల్లో పనిచేశాం. జిల్లాలో ఎందరికో రాజకీయ జీవితం కల్పించాం. అలాంటి కుటుంబాన్ని టీడీపీ టార్గెట్ చేసింది. నేనేమీ అడగకపోయినా అదిగో ఇదిగో పదవులు అంటూ అడుగడుగునా మోసం చేసింది. నన్ను నమ్ముకున్న వారికి నేనేమి సమాధానం చెప్పాలి’ అంటూ తన నివాసానికి వచ్చిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నేత ఆనం జయకుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బీద రవిచంద్ర ఆనం జయకుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఆ సందర్భంగా ఆనం జయ ఆవేశంగా తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చాడు.
గతంలో సీఎం చంద్రబాబునాయుడు తన సోదరుడు ఆనం వివేకానందరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని ఆశ కల్పించి పార్టీలోకి ఆహ్వానించారని, ఎమ్మెల్సీ కాదు కదా.. కనీస గుర్తింపు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఆ క్షోభతోనే తన సోదరుడు మృతిచెందాడని వాపోయారు. అలాగే తనను మోసం చేశారని, రెండుసార్లు తాను అడగక ముందే పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తున్నట్లు ప్రకటించి చివరిలో విరమించుకున్నారని మండిపడ్డారు. అలాగే నెల్లూరు రూరల్ టికెట్ నీదేనంటూ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మంత్రి నారాయణలు ఇద్దరూ హామీ ఇచ్చారని, తాను నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ఒక్క మాట కూడా తనతో చెప్పకుండా రూరల్ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి ప్రకటించుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆనం జయకుమయార్‌రెడ్డి ప్రశ్నలకు బీద సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. తన ఆవేదనలో వాస్తవం ఉందని, ఇదీ పార్టీ తప్పిదమేనని బీద ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13న సీఎం చంద్రబాబును కలిసి ఈ విషయంపై తప్పక చర్చిస్తానని చెప్పినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment