Beeda Ravichandra
-
కోడుమూరు టిక్కెట్ ఎంతకు అమ్ముకున్నారు?
కర్నూలు: కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై వ్యతిరేకం భగ్గుమంటోంది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వర్గంగా ముద్ర పడిన వారంతా టీడీపీ జోనల్–5 కోఆర్డినేటర్ బీద రవిచంద్రపై తిరుగుబాటు చేశారు. బొగ్గుల దస్తగిరి అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కోట్ల వర్గం రెండు రోజుల క్రితం నగరంలోని భూపాల్ కాంప్లెక్స్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆకెపోగు ప్రభాకర్‌ను రెబల్ అభ్యర్థిగా బరిలో నిలపాలని తీర్మానించారు. విషయం తెలుసుకున్న ముగ్గురు జిల్లా ఇన్చార్జి నాయకులు రాజీ కుదిర్చేందుకు కర్నూలుకు చేరుకున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కోడుమూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల ముఖ్య నేతలతో మంగళవారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కోడుమూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఎంతకు అమ్ముకున్నారు... ఒక్కనాడు కూడా పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదు. అధిష్టానం ఏకపక్ష నిర్ణయంతో బొగ్గుల దస్తగిరిని ప్రకటించారంటూ జోనల్ కోఆర్డినేటర్ బీద రవిచంద్రపై తిరుగుబాటు చేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాక సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలో ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి, కర్నూలు పార్లమెంటు అధ్యక్షులు బీటీ నాయుడు, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల పరిశీలకులు డాక్టర్ శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు. దస్తగిరి అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలించాలని, లేకుంటే ఆకెపోగు ప్రభాకర్‌ను రెబల్ అభ్యర్థిగా బరిలోకి దింపి తమ తడాఖా ఏంటో చూపిస్తామంటూ కోట్ల వర్గీయులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని బీద రవిచంద్ర నాయకులకు హామీ ఇచ్చి సమావేశాన్ని ముగించారు. -
కావలిని రాజకీయ భవిష్యత్ అడ్డాగా మార్చుకున్న బీద
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలు సమీపించే సరికి టీడీపీ కొత్త డ్రామాలకు తెరతీస్తోంది. కావలి టికెట్ ఆశవహుడు మాలెపాటి సుబ్బానాయుడు ఏకంగా జనంతో పాటు లోకేశ్ దృష్టిలో పడేందుకు ఛీప్ ట్రిక్స్ ప్రయోగిస్తున్నాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో మాలెపాటి తన అనుచరగణంతో రభస సృష్టిస్తున్నాడు. టీడీపీ అధినేత కొడుకు లోకేశ్ యువగళం యాత్ర జిల్లాలోకి ప్రవేశించిన నేపథ్యంలో కావలిలో తన ఉనికిని చాటుకునేందుకు మాలెపాటి వ్యవహర తీరు హద్దులు దాతుతోంది. ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొరబడి అధికారులను నిర్బంధించి ఉక్కిరిబిక్కిరి చేయడం ద్వారా ప్రచారంలో రావాలనే ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ అభిజ్ఞ వర్గాల బోగట్టా. కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా క్షేత్రస్థాయిలో నామ మాత్రపు ఉనికికే పరిమితమైంది. టీడీపీ అసెంబ్లీ అభ్యరి్థత్వం కోసం ఆ పార్టీ నేతలు ఎవరికి వారు తమదైన శైలిలో పైరవీలు చేసుకుంటూ పోతున్నట్లు కనిపిస్తోంది. దశాబ్దన్నర కాలంగా బీద రవిచంద్ర టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా, ఆ పార్టీ నామినేటెడ్ ఎమ్మెల్సీగా కావలి నియోజకవర్గంలో పెత్తనం చేస్తూ తన గుపెట్లో పెట్టుకున్నాడు. పార్టీ అధికారంలో ఉండగా గ్రావెల్, మట్టి పేరుతో వందల రూ.కోట్లు దోచేసిన బీద ఇప్పటికీ తన పెత్తనంలో ఉంచుకున్నాడు. టీడీపీ అధికారం కోల్పోవడంతో పార్టీని నడిపించేందుకు ఆర్థికంగా బలవంతుడైన పంచాయతీ స్థాయి లీడర్‌ను తీసుకువచ్చి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించి నడిపించారు. ఎన్నికలు సమీపించే సరికి.. సార్వత్రిక ఎన్నికలు సమీపించే సరికి కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల కావలికి చెందిన ఓ బడాబాబుకే టికెట్ ఖరారు అయినట్లు ప్రచారం సాగింది. చివరికి ఎవరికి టికెట్ దక్కుతుందో తెలియదు కానీ.. అటు బీద, ఇటు ఆ బడాబాబు మౌనంగా ఉంటే ఈ నాలుగేళ్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న మాలెపాటి మాత్రం టికెట్ రేసులో ముండుండాలని అడ్డదారుల్లో పరుగులు పెడుతున్నారు. ఏకంగా టీడీపీ అధినేత కొడుకు లోకేశ్ దృష్టిలో పడాలనే తాపత్రయంతో చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సదరు మాలెపాటి అండ్ కో, బీద కావలి నియోజకవర్గంలో గ్రావెల్, మట్టిని ఊడ్చిపారేశారు. ఇప్పుడొచ్చి అధికార పార్టీ ఎమ్మెల్యే గ్రావెల్ దోపిడీ చేస్తున్నాడంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. సాదాసీదా ఆందోళన అయితే ప్రచారం రాదని, ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొరబడి ప్రజాస్వామ్యబద్ధానికి వ్యతిరేకంగా నిరంకుశ పోకడలతో ఆందోళనకు తెర తీశాడు. ప్రభుత్వ కార్యాలయంలో వంటావార్పు అంటూ చేసిన నిరసన ప్రజల్లోనూ అసహ్యం అనిపించింది. పోలీస్ కేసులు ఉన్న వారికే ప్రాధాన్యత పోలీసు కేసులు ఎక్కువ ఉన్న వారికి పారీ్టలో ప్రాధాన్యత ఉంటుందని ఇటీవల తరచూ లోకేశ్ చేస్తున్న ప్రచారాన్ని అందిపుచ్చుకున్న మాలెపాటి సుబ్బానాయుడు ప్రభుత్వ కార్యాలయాల్లో అలజడులు సృష్టిస్తున్నాడు. ఆ విధంగా తనపై పోలీసు కేసులు నమోదయ్యేలా ఛీప్ ట్రిక్స్ అనుసరిస్తున్నాడు. మాలేపాటి తనకే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కావలి టికెట్ అని బాహాటంగా ప్రకటించుకుంటున్నారు. తెరపైకి కావ్య, పసుపులేటి బీద రవిచంద్రతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా అసలు ఏ పారీ్టలో ఉన్నడో కూడా తెలియని దగుమాటి వెంకట కృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి) తనకే కావలి టీడీపీ టికెట్ అని చాపకింద నీరులా ప్రచారం సాగిస్తున్నాడు. ఏరోజు ఏ పార్టీలో ఉంటాడో కూడా తెలియని పసుపులేటి సుధాకర్ కూడా కావలి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానిక టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఏనాడు కావలి టీడీపీ బాగోగులు పట్టించుకోని బీద కనుసన్నల్లోనే స్థానిక టీడీపీ నాయకులు ఉండాలని సాక్షాత్తూ పార్టీ అగ్రజుడు చంద్రబాబు, లోకేశ్ స్పష్టత ఇవ్వడంతో స్థానిక పార్టీ క్యాడర్ రుసరుసలాడుతోంది. అయితే ఎన్నికల నాటికి బీద రవిచంద్ర ఈ టికెట్ తన్నుకుపోతాడనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. బీద మాత్రం సైలెంట్‌గా తనకు లైన్ క్లియర్ చేసుకుంటుంటే.. మధ్యలో మాలెపాటి, కావ్య, పసుపులేటి టికెట్ కోసం కుయుక్తులు పన్నుతున్నారు. -
మీలా రాజకీయ వ్యాపారిని కాను..
సాక్షి, కావలి: ‘కర్ణాటకలో నిర్మాణ రంగంలో వ్యాపారం చేసుకుంటూ.. ఆర్థికంగా స్థిరపడ్డాక నేను పుట్టి పెరిగిన కావలి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను.. మీలా రాజకీయాలతో వ్యాపారం చేసే వ్యక్తిని కాను’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లుగా మీ చెప్పు చేతల్లో ఉన్న పచ్చ మీడియాలో నీచమైన రాతలు, ప్రచారాలు చేయించిన బీద రవిచంద్ర ఇప్పుడు కూడా అదే సంస్కృతిని కొనసాగిస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగతంగా తనపై కావలి నియోజకవర్గ ప్రజలకు అన్ని విషయాలు తెలుసునని, అందుకే తనను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తుచేశారు. తాను ఏ లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చానో.. వాటిని సాధించాలనే పట్టుదలతో ఉన్నానని పేర్కొన్నారు. (అస్తిత్వాన్ని చాటుకునేందుకే చంద్రబాబు తంటాలు) అన్ని రంగాల్లో వెనుకబడిన కావలి నియోజకవర్గంలో సాగు, తాగునీరు, రామాయపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్, పారిశ్రామికవాడ, విమానాశ్రయంతో పాటు రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగు, ప్రభుత్వ వైద్యం నాణ్యతగా ప్రజలకు అందేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. రాజకీయ వ్యాపారైన బీద రవిచంద్ర నిత్యం రాజకీయాలు మాత్రమే చేస్తూ, అందర్నీ ఆ ఊబిలోకి లాగేందుకు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తాను సాధించాలనుకున్న కావలి అభివృద్ధి లక్ష్యాన్ని నీరుగార్చేందుకు బీద రవిచంద్ర రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగతంగా తాను వీటిని పట్టించుకోనని, అయితే సందర్భం వచ్చినప్పుడు ప్రజలకు అన్ని విషయాలను తెలియజేస్తానన్నారు. అక్రమార్జనపై సీబీఐ, సీబీసీఐడీ, అఖిలపక్ష కమిటీ ద్వారా విచారణకు సిద్ధపడాలని బీద రవిచంద్రకు సూచించారు. -
ఆ ఎమ్మెల్సీతో మాట్లాడితే రూ.10వేల జరిమానా
కావలి : ఆ ఎమ్మెల్సీతో నేరుగా మాట్లాడితే రూ.10వేలు.. ఫోన్లో మాట్లాడితే రూ.3వేల జరిమానా విధించాలని అక్కడి గ్రామస్తులు కట్టుబాటు విధించారు. తమ గ్రామాన్ని ఉద్దేశించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలకలం రేపిన ఈ ఉదంతం వివరాల్లోకి వెళ్తే.. కావలి నియోజకవర్గం అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో శివాలయాన్ని పునర్నిర్మాణంలో భాగంగా మంగళ, బుధ, గురువారాలు ప్రత్యేక కార్యక్రమాలను తలపెట్టారు. తొలిరోజు స్థానిక ఎమ్మెల్సీ బీద రవిచంద్ర హాజరయ్యారు. ఈ గ్రామం సమీపంలోని ఇస్కపల్లిపాలేనికి చెందిన మత్స్యకారులూ తరలివచ్చారు. ఇంతలో.. ‘ఇలాంటి దరిద్రపు ఊరు జిల్లాలో లేదు’.. అంటూ రవిచంద్ర తన స్వగ్రామం ఇస్కపల్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాక.. మత్స్యకార మహిళల వద్ద మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మహిళలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ‘మేం దరిద్రపు వాళ్లమా, 30 ఏళ్లుగా మా గ్రామాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయంగా రాష్ట్రస్థాయికి ఎదిగి, మమ్మల్ని దూషిస్తావా’.. అంటూ మండిపడ్డారు. కలశాల్లో సముద్రపు నీరు ఇవ్వబోమని, అక్కడ నుంచి వెళ్లిపోవాలని వారు హెచ్చరించారు. అనంతరం ఇస్కపల్లిపాలెంలో మత్స్యకారులంతా సమావేశమయ్యారు. బీద రవిచంద్రతో మాట్లాడితే రూ.10,000, ఫోన్లో మాట్లాడితే రూ.3,000 జరిమానా చెల్లించాలని మత్స్యకారులు కట్టుబాటు పెట్టుకున్నారు. -
వీళ్లు ఎవరికీ చిక్కరు.. దొరకరు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: బీద క్యాంపులో ఆర్థిక అలజడికి తెరలేచింది. వారం రోజులుగా బీద క్యాంపు చుట్టూ అధికార పార్టీ అభ్యర్థులు చక్కర్లు కొడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆర్థిక వ్యవహారం అంతా బీద బ్రదర్స్ చూసుకుంటారని జిల్లాకు వచ్చినప్పుడు అభ్యర్థులకు చెప్పి వెళ్లారు. అయితే ఇప్పటివరకూ రూపాయి కూడా విదల్చలేదని కొందరు అభ్యర్థులు బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు. మరికొందరైతే డబ్బులు ఇవ్వకుండానే పెత్తనం చేస్తున్నారని కినుకు వహిస్తున్నారు. దీనికితోడు వైఎస్సార్సీపీలోకి నేతలు పెద్ద ఎత్తున వలసల బాట పట్టడంతో అధికార పార్టీకి చెందిన క్యాంపు సతమతమవుతోది. ఇక అందర్నీ సమన్వయం చేయాల్సిన జిల్లా అధ్యక్షుడు, బీద మస్తాన్‌రావు సోదరుడు రవిచంద్ర చిక్కడు.. దొరకడు తరహాలో తప్పించుకుని తిరుగుతుండడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అధికార పార్టీ నుంచి అభ్యర్థులుగా దిగిన వారిలో ఒకరు ఇద్దరు మినహా అందరూ బడాబాబులే. దీంతో పెద్ద ఖర్చు లేకుండా ఎన్నికల బరిలో తలపడవచ్చన్న బీద బ్రదర్స్‌కు అభ్యర్థులు చుక్కలు చూపిస్తున్నారు. జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థులను విడతల వారీగా ప్రకటించారు. చివరకు నెల్లూరు రూరల్, కావలికి అభ్యర్థి దొరక్క మొదట తిరస్కరించిన నేతలకే టికెట్లు ఇచ్చారు. దీంతో మొదట భారీగా ఖర్చు పెడతామని ప్రచారం చేసుకున్న నేతలు అంతా సర్దుకున్నారు. అసలే పార్టీ పరిస్థితి చూస్తే మెరుగ్గా లేకపోవడం, రూ.కోట్లు ఖర్చు చేసినా గెలిచే పరిస్థితి లేదని అర్థమైన నేతలు భారీగా ఖర్చు చేయడానికి ముందుకు రావడం లేదు. ఏదో బీద ఇస్తే ఖర్చు చేయాలనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ పరిస్థితి అర్థమైన బీద పార్లమెంట్ స్థానానికి పోటీ చేయనని మొండికేసిన బీద మస్తాన్‌రావు ఎట్టకేలకు పార్టీ అధినేత ఒత్తిడితో ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి ఎంత సర్దుబాటు చేయాలనే దానిపై బీద బ్రదర్స్ తలలు పట్టుకుని కుర్చోన్నారు. ఎవరెవరికి ఎంత ఇవ్వాలనేది ముందుగానే చంద్రబాబు ఫైనల్ చేసి నేతలకు చెప్పి వెళ్లినట్లు సమాచారం. అయితే గత వారం నుంచి మినీబైపాస్ రోడ్డులోని బీద క్యాంపుల్లో మాత్రం రోజు అభ్యర్థులు ఆర్థిక మంతనాలు చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా కావలి అభ్యర్థిగా కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిని బీద సోదరుల మద్దతుతో టికెట్ ఇచ్చారు. ఆయన ఖర్చు మొత్తం కూడా తామే చూసుకుంటామని చెప్పారు. నామినేషన్ ఘట్టం, స్క్రూటినీ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఒక్క రూపాయి ఇవ్వకపోవడంతో విష్ణువర్ధన్‌రెడ్డి కినుక వహించినట్లు సమాచారం. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు రెండో సారి టికెట్ ఇచ్చారు. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి లేక చేతులెత్తేసిన క్రమంలో ఎంపీ అభ్యర్థి చూసుకుంటాడని చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు ఆర్థిక వ్యవహరాలు కూడా మాట్లాడుకున్నారు. కానీ డబ్బులు మాత్రం చేతికి అందలేని బొల్లినేని నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ తన పని తన ఓటు మాత్రమే తాను చూసుకుంటున్నట్లు సమాచారం. ఇక నెల్లూరు రూరల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నగర మేయర్ అబ్దుల్ అజీజ్‌ది మాత్రం విచిత్ర పరిస్థితి. గతంలో నెల్లూరు రూరల్ లేదంటే సిటీ టికెట్ కోసం బలంగా ప్రయత్నాలు చేసిన అజీజ్ భంగపడ్డారు. నెల్లూరు పార్లమెంట్ టికెట్ అయినా తనకు ఇస్తే గట్టిగానే ఖర్చు పెట్టుకుంటానని సీఎంకు మొర పెట్టుకున్నాడు. అయితే చివరి నిమిషంలో నెల్లూరు రూరల్ టికెట్ దక్కడంతో ఆర్థికంగా పూర్తిగా చేతులెత్తేసి మీరే అంతా చూసుకోవాలని చెప్పినట్లు సమాచారం. దీంతో నగర అభ్యర్థిగా బరిలో ఉన్న మంత్రి నారాయణ, ఎంపీ అభ్యర్థి నుంచి సహకారం ఉంటుందని చెప్పారు. అయితే మంత్రి నారాయణ సహకారం మొదలయింది కానీ పెత్తనం అంతా నారాయణ క్యాంప్దే కావడంతో మేయర్ వర్గంలో తీవ్ర అలజడి రేగింది. కేవలం ఎన్నికల ప్రచారంలో నమస్కారం పెట్టుకుంటూ తిరగడానికే మేయర్ పరిమతం అయినట్లు సమాచారం. ఇక రాత్రి వ్యవహారాలన్ని నారాయణ క్యాంపు నుంచి ఆయన సన్నిహితుడు తన సొంత టీమ్‌తో నడుపుతుండటంతో అజీజ్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక మరో అసెంబ్లీ అభ్యర్థికి ఆ నియోజకవర్గంలో భారీ వలసలు షాక్‌ను ఇచ్చాయి. దీంతో సదరు అభ్యర్థి కుటుంబ సభ్యులు ఎంత ఖర్చు చేసినా గెలవలేము.. కాబట్టి డబ్బు ఖర్చు చేయొద్దని సదరు అభ్యర్థి కుమారుడు గట్టిగా చెప్పటంతో అక్కడ గందరగోళం రేగింది. దీంతో అప్పటి దాక ఎంపీ అభ్యర్థి నుంచి ఆర్థిక సహకారం వద్దన్న సదరు అభ్యర్థి రెండు రోజుల నుంచి అభ్యర్థి క్యాంపు చుట్లూ చక్కర్లు కొడుతున్నాడు. మొత్తం మీద ఒక్క అభ్యర్థికి కూడా చెప్పినది ఇవ్వకుండా ఇంకా బాబు గారి నుంచి అనుమతి రాలేదంటూ కాలం గడుపుతుండటం పార్టీలో చర్చనీయాశంగా మారింది. -
ఐటీ గ్రిడ్స్ స్కాం: నెల్లూరులో అలజడి
సాక్షి, నెల్లూరు : ఏపీ ప్రజల డేటా చోరీకి పాల్పడిన ఐటీ గ్రిడ్స్ సంస్థ వ్యవహారం తాజాగా నెల్లూరు జిల్లాలో అలజడి రేపుతోంది. ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డాకవరం అశోక్ స్వస్థలం నెల్లూరు జిల్లా అల్లూరు. కాగా జిల్లాకు చెందిన బీదా సోదరులకు అశోక్ అత్యంత సన్నిహితుడు. టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సహకారంతోనే అశోక్ ...మంత్రి నారా లోకేష్ వద్ద చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కోసమే అశోక్... ఐటీ గ్రిడ్స్ సంస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ టీడీపీకి చెందిన అధికారిక ‘సేవామిత్ర’ యాప్‌ను రూపొందించింది. ఇందుకోసం విశాఖపట్నంలోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ అవసరమైన సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది. చదవండి.... (ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్!) మరోవైపు పరారీలో ఉన్న దాకవరం అశోక్ కోసం సైబరాబాద్ క్రైం పోలీసులు గాలింపు విస్తృతం చేశారు. ఇందుకోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అశోక్ ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. డేటా చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ సీఆర్పీసీ 161 సెక్షన్ కింద ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన నిన్న కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో దాకవరం అశోక్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇక ఐటీ గ్రిడ్స్ సంస్థపై హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో సోమవారం మరో కేసు నమోదు అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేశారంటూ దశరధరామిరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో అశోక్‌పై ఐపీసీ 420, 419, 467, 468, 120 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాక్షులను విచారిస్తున్నారు. -
మా కుటుంబాన్నే టార్గెట్ చేశారు
సాక్షి, నెల్లూరు: ‘మా కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉంది. ఎన్నో రాజకీయ పదవుల్లో పనిచేశాం. జిల్లాలో ఎందరికో రాజకీయ జీవితం కల్పించాం. అలాంటి కుటుంబాన్ని టీడీపీ టార్గెట్ చేసింది. నేనేమీ అడగకపోయినా అదిగో ఇదిగో పదవులు అంటూ అడుగడుగునా మోసం చేసింది. నన్ను నమ్ముకున్న వారికి నేనేమి సమాధానం చెప్పాలి’ అంటూ తన నివాసానికి వచ్చిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నేత ఆనం జయకుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బీద రవిచంద్ర ఆనం జయకుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఆ సందర్భంగా ఆనం జయ ఆవేశంగా తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చాడు. గతంలో సీఎం చంద్రబాబునాయుడు తన సోదరుడు ఆనం వివేకానందరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని ఆశ కల్పించి పార్టీలోకి ఆహ్వానించారని, ఎమ్మెల్సీ కాదు కదా.. కనీస గుర్తింపు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఆ క్షోభతోనే తన సోదరుడు మృతిచెందాడని వాపోయారు. అలాగే తనను మోసం చేశారని, రెండుసార్లు తాను అడగక ముందే పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తున్నట్లు ప్రకటించి చివరిలో విరమించుకున్నారని మండిపడ్డారు. అలాగే నెల్లూరు రూరల్ టికెట్ నీదేనంటూ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మంత్రి నారాయణలు ఇద్దరూ హామీ ఇచ్చారని, తాను నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ఒక్క మాట కూడా తనతో చెప్పకుండా రూరల్ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి ప్రకటించుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆనం జయకుమయార్‌రెడ్డి ప్రశ్నలకు బీద సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. తన ఆవేదనలో వాస్తవం ఉందని, ఇదీ పార్టీ తప్పిదమేనని బీద ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13న సీఎం చంద్రబాబును కలిసి ఈ విషయంపై తప్పక చర్చిస్తానని చెప్పినట్లు సమాచారం. -
బీఎమ్ఆర్ కార్యాలయాల్లో సోదాలు
-
టీడీపీ నేత ‘బీద’ సంస్థలపై ఐటీ దాడులు
కావలి: అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు, రాజధాని నిర్మాణ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సోదరుడు బీద మస్తాన్‌రావు ఇల్లు, వ్యాపార సంస్థలపై ఆదాయ పన్నుల శాఖ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు చేశారు. చెన్నైలోని ఆయన నివాసగృహం, కార్పొరేట్ కార్యాలయం, నెల్లూరులోని కార్యాలయం, కావలి సమీపంలో విమానాశ్రయ భూముల వద్ద ఉన్న (దామవరం) రొయ్యల మేత ఫ్యాక్టరీ, రొయ్యలు విదేశాలకు ఎగుమతి చేసే ప్రాసెసింగ్ ప్లాంట్లపై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామానికి చెందిన బీద మస్తాన్‌రావు రొయ్య పిల్లల గుంతల వద్ద సాధారణ గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించి, అంతర్జాతీయ స్థాయి రొయ్యల ఎగుమతిదారుడిగా ఎదిగారు. చెన్నై, పాండిచ్చేరి, వైజాగ్‌తో పాటు నెల్లూరు జిల్లాలో విడవలూరు మండలం రామతీర్థం, అల్లూరు మండలం ఇస్కపల్లిలో ఉన్న రొయ్య పిల్లల ఉత్పత్తి ( హేచరీస్) కేంద్రాల ద్వారా ఏడాదికి 250 మిలియన్ల రొయ్య పిల్లలను విక్రయిస్తుంటారు. వీటి అమ్మకాల ద్వారా ఏడాదికి రూ.1,500 కోట్ల వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రొయ్య పిల్లలు అమ్మకాలు చేసే ప్రక్రియకు బిల్లులు ఉండవు. అలాగే బీద మస్తాన్‌రావు ఇస్కపల్లిలో వందలాది ఎకరాల్లో రొయ్యల చెరువులు సాగు చేస్తుంటారు. ఆక్వా రైతుల నుంచి కొనుగోలు చేసిన రొయ్యలతో పాటు, తన సొంత చెరువుల ద్వారా సాగు చేసిన రొయ్యలను దామవరంలో ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి వివిధ దశల్లో శుభ్రపరచి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అలాగే దామవరంలోని రొయ్యలు మేత ఫ్యాక్టరీ నుంచి వేల టన్నుల రొయ్యల మేత రాష్ట్రంలోని కోస్తా జిల్లాల మార్కెట్‌కు తరలిస్తారు. రొయ్య పిల్లలు, రొయ్యలు, రొయ్యల మేత దేశ, అంతర్జాతీయ మార్కెట్ ద్వారా ఏడాదికి రూ. 5,000 కోట్ల టర్నోవర్ ఉంటుందని భావిస్తున్నారు. బీద మస్తాన్‌రావుకు బినామీ పేర్లతో దేశ వ్యాప్తంగా ఉన్న గొలుసు మొబైల్ షాపుల్లో వాటా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో రియల్ఎస్టేట్, నిర్మాణ రంగ వ్యాపారాలు, తమిళ సినిమా నిర్మాణాలు తదితర వ్యాపారాలున్నాయని తెలుస్తోంది. ‘బీఎంఆర్’ గ్రూప్ పేరుతో బీద మస్తాన్‌రావు వ్యాపారాలు చేస్తుంటారు. అజ్ఞాతంలోకి.. కాగా బీద మస్తాన్‌రావుతో పాటు ఆయన సోదరుడైన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఐటీ దాడుల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాప్ చేసుకున్నారు. అలాగే బీద మస్తాన్‌రావు వ్యాపార సంస్థల్లో కీలక విభాగాల ఇన్చార్జులు కూడా మొబైల్ ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. -
నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్!
సాక్షి, నెల్లూరు : ఐటీ దాడులతో నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతలకు షాక్ తగిలింది. టీడీపీ నేత బీద రవిచంద్ర, ఆయన సోదరుడు మస్తాన్ రావు కంపెనీలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం దామవరం, ఇసుకపల్లిలోని బీఎంఆర్ కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరిపారు. చెన్నైలోని బీఎంఆర్ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రికార్డులు, కంప్యూటర్ డేటాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. విదేశాల్లో రొయ్యల వ్యాపార లావాదేవీలపై బీద సోదరులను ఆరా తీసినట్లు సమాచారం. -
టీడీపీలో గ్రూప్ వార్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తీరుతో మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి అసంతృప్తికి గురయ్యారు. అది కూడా మంత్రి నారాయణ సమక్షంలో ఆయన క్యాంప్ కార్యాలయంలో ఈ వ్యవహారం జరగటంతో పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి అపాయింట్మెంట్ ఆదాల కోరితే ఆయన కంటే ముందుగానే బీద రవిచంద్ర కుదరదని చెప్పటం, అది కూడా పార్టీ కార్యకర్తలు అందరి సమక్షంలో చెప్పటం, దీనికి మంత్రి మౌనం వహించటంతో ఆదాల కినుకు వహించారు. వెంటనే పార్టీ రాష్ట్ర అ«ధ్యక్షునికి దీనిపై ఆదాల ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇది కూడా సీఎం పర్యటన నేపథ్యంలో జరగటంతో పార్టీలో హాట్ టాపిక్ అయింది. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఇద్దరు గురుశిష్యులు. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. కొంత కాలంగా పార్లమెంట్ పరిధిలో కార్యక్రమాల్లో పార్లమెంట్ ఇన్చార్జి హోదాలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో శనివారం నగరంలో తెలుగుదేశం పార్టీ దళిత తేజం బహిరంగ సభ కార్యక్రమం జరగనుంది. ఈ సభకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లు, ఆర్థిక వ్యవహారాలు, ఇతర అంశాలపై చర్చించటానికి మంత్రి పి.నారాయణ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో పాటు నగర నేతలు పలువురు పాల్గొన్నారు. సమావేశం ముగిశాక మాజీ మంత్రి ఆదాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ములుమూడిలో అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి నారాయణను ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా కోరారు. గడిచిన నాలుగేళ్లలో రూరల్ నియోజకవర్గంలో కార్యక్రమాలకు పెద్దగా రాలేదు. తప్పనిసరిగా రావాలని కోరారు. దీనికి మంత్రి నారాయణ బదులివ్వటానికి ముందే ఎమ్మెల్సీ బీద రవిచంద్ర జోక్యం చేసుకోని మంత్రి నారాయణ ఎలా వస్తారు. సీఎం కార్యక్రమంహడావుడిలో ఉంటారు. పొద్దునే ఏర్పాట్లు చూసుకోవాలి. ఆయన రావటం కుదరదని ఖరాఖండిగా చెప్పాడు. అది నగర నేతలు, డివిజన్ కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తల సమక్షంలో చెప్పటంతో ఆదాల తీవ్ర అసంతృప్తికి లోనై అక్కడి నుంచి వెంటనే వెనుదిరిగారు. మంత్రి నారాయణ కనీసం ఒక్కమాటకు కూడా మాట్లాడలేదు. దీంతో పార్టీలో తనకి ప్రాధాన్యం ఇవ్వటం లేదని, తాను కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నా నేతలు తీరు సరిగాలేదని ఆదాల తన అనుచరుల వద్ద ఆక్రోశం వెళ్లగక్కారు. మరోవైపు వెంటనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు ఫోన్ చేసి బీద రవిచంద్ర తీరుపై ఫిర్యాదు చేశారు. నగరంలో ఫ్లైక్సీల హడావుడి శనివారం నగరంలో జరిగే దళిత తేజం కార్యక్రమం ఫైక్సీల హడావుడి కూడా పార్టీలో తీవ్ర చర్చకు దారీతీసింది. కొందరు దళిత నేతలు కూడా దీనిపై పార్టీ ముఖ్యుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నగరం అంతా దళిత తేజం ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు కానీ దానికి భిన్నంగా ఒక సామాజికవర్గం నేతలు ఫ్లెక్సీలు హడావుడి చేయటం అందులోనూ దళిత నేతలకు చోట లేకపోవటం గమనార్హం. ముఖ్యంగా గత 15 రోజులుగా దళిత తేజం విజయవంతం చేయండని పార్టీ దళిత నేతలుగా ఉన్న ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, మాజీ మంత్రులు బల్లి దుర్గాప్రసాద్, పరసా రత్నం, పార్టీ నేతలు నెలవల సుబ్రమణ్యం, జోత్స్నలత తదితరులు అన్ని నియోజకవర్గాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో నగరంలో భారీగా ఏర్పాటు చేసిన ఫ్లైక్సీల్లో దళిత నేతలు కల్పించలేదు. దీనికి భిన్నంగా నగరంలో ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి పట్టాభి, తాళ్లపాక అనురాధ తదితర నేతలు భారీగా ఫ్లైక్సీలు ఏర్పాటు చేయటం పార్టీ అలంకరణ కమిటీకి తలనొప్పిగా మారింది. పరసా హడావుడి మరోవైపు సీఎం పర్యటన పేరుతో పరసా రత్నం హడావుడి చేశారు. శుక్రవారం పెళ్లకూరులో సమావేశం నిర్వహించి జనసమీకరణ బాధ్యత అధికారులకు అప్పగించారు. ఏపీఎం పద్మ, ఉఫాధి హామీ ఏపీఓ జ్ఞాన ప్రకాష్‌తో కలిసి ఆయన సమావేశం నిర్వహించి పొదుపు సంఘాల మహిళలు, ఉపాధి హమీ కూలీలతో మాట్లాడి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసీ జనాలను తరలించాలని ఆదేశాలు జారీ చేయటం చర్చనీయాంశం అయింది. -
నరికేస్తా..
- చైర్ పర్సన్సమక్షంలోనే సొంత పార్టీ కౌన్సిలర్లపై కురుగొండ్ల చిందులు - రాజీనామా యోచనలో చైర్పర్సన్, పలువురు కౌన్సిలర్లు - ఎమ్మెల్యే వ్యవహార తీరుపై బీదకు ఫిర్యాదు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తన మాట తీరు, వ్యవహార తీరుతో తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శుక్రవారం మరో వివాదంలో ఇరుక్కున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద సమక్షంలోనే కౌన్సిలర్లను ‘‘నరికేస్తా నా కొ...రా ఏ మనుకున్నారు’’ అని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేయడం వెంకటగిరి టీడీపీలో కొత్త వివాదానికి ఆజ్యం పోసింది. ఎమ్మెల్యే తీరుతో తీవ్ర ఆందోళనకు గురైన చైర్‌పర్సన్‌తో పాటు కొందరు కౌన్సిలర్లు పదవులు, పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. మున్సిపల్ చైర్ పర్సన్ దొంతు శారదతో పాటు సుమారు 15 మంది కౌన్సిలర్లు కొంత కాలంగా ఎమ్మెల్యే రామకృష్ణ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మున్సిపాలిటీలో ప్రతి పనిలో తల దూర్చడం, తాను చెప్పినట్లే చేయాలని అధికారులను బెదిరిస్తుండటంతో చైర్ పర్సన్ ఇప్పటికే రెండు, మూడు సార్లు ఈ వ్యవహారం గురించి మంత్రి నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఫిర్యాదు చేశారు. ఎప్పటికప్పుడు వారు ఆమెను బుజ్జగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే రామకృష్ణ మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి పనుల సమీక్ష కోసం కౌన్సిలర్లు, అధికారులతో సమావేశమయ్యారు. కమీషన్ల గోల మున్సిపాలిటీలో తమ వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు తమకు కావాల్సిన వారికి దక్కడం లేదనీ, పనులకు సంబంధించి తమకు 6 శాతం కమీషన్ ఇస్తూ 14 శాతం ఇతరులకు సమర్పించుకుంటుండటం పట్ల కౌన్సిలర్లు కోపంతో ఉన్నారు. అయితే ఈ వ్యవహారమంతా ఎమ్మెల్యే రామకృష్ణకు తెలిసే జరుగుతుండటంతో ఇదేమని ప్రశ్నించే ధైర్యం చేయలేక పోతున్నారు. ఇదే విషయం గురించి వారం రోజుల కిందట 22వ వార్డు కౌన్సిలర్ విశ్వనాథం కమిషనర్ మధ్య మున్సిపల్ కార్యాలయంలోనే మాటల యుద్ధం జరిగింది. తమ వార్డుల్లో జరిగే పనులకు ఇతరులకెందుకు కమీషన్లు ఇవ్వాలని కౌన్సిలర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక దశలో ఇద్దరూ ఒరేయ్ పోరా అనుకునేంత వరకు పోయారు. కమిషనర్ ఈ విషయం ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీలో తనకు వ్యతిరేకంగా స్థానిక నేతలు గళం విప్పడం జీర్ణించుకోలేని రామకృష్ణ సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. అభివృద్ధి పనుల విషయం గురించి చర్చించడం కోసం శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్, టీడీపీ కౌన్సిలర్లు, అధికారులతో సమావేశమయ్యారు. టెండర్లు, పనుల విషయం గురించి చర్చ వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఒక్కసారిగా చెలరేగి పోయారు. ఎదురుగా ఉన్నది సొంత పార్టీ కౌన్సిలర్లే అనే విషయం కూడా మరచి పోయి ‘‘నా కొడకల్లారా ఏ మనుకుంటున్నారు. నరికేస్తా.’’ అని గతంలో తాను చేసిన కొన్ని విషయాల గురించి చెప్పి కౌన్సిలర్లను భయపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో తొలుత భయపడ్డ కొందరు కౌన్సిలర్లు ఆ తర్వాత తేరుకుని తమకు జరిగిన అవమానం గురించి ఆవేదనకు లోనయ్యారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే మద్దతుదారుడైన ఒక కౌన్సిలర్ తన వార్డులో బోరు వేయించుకోవడానికి లెటర్ ఇస్తే చైర్ పర్సన్ సంతకం చేయలేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే చైర్ పర్సన్‌ను ఉద్దేశించి ‘‘నా వర్గీయుడికి సంతకం చేయవా? సంతకం పెట్టాల్సిందే’’ అని ఆగ్రహంగా హెచ్చరికలు జారీ చేశారు. కౌన్సిలర్ల సాక్షిగా తనకు జరిగిన అవమానానికి చైర్ పర్సన్ చిన్నబుచ్చుకున్నారు. తన మద్దతుదారులైన కౌన్సిలర్లతో కలిసి జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. వీరంతా నెల్లూరుకు బయల్దేరే సమయంలో కావేరి పాకం రమేష్ తమ రాజీనామా విషయం గురించి రాజా కుటుంబీకుడు సాయికృష్ణ యాచేంద్ర సలహా తీసుకోవడానికి వెళ్లారు. ఆయన సూచన మేరకు కౌన్సిలర్లు వెంకటగిరిలోనే ఆగిపోయి చైర్ పర్సన్ ఆమె భర్త దొంతు బాలకృష్ణ నెల్లూరు వెళ్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు రవిచంద్రను కలసి ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదు చేశారు. తాను పార్టీకి పదవికి రాజీనామా చేస్తాననీ, కురుగొండ్లతో తాము పడలేకున్నామని చైర్ పర్సన్‌తో పాటు ఆమె భర్త కూడా బీద రవిచంద్రకు విన్నవించారు. వారం రోజుల్లో ఈ సంగతి తేలుస్తాననీ, పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని రవిచంద్ర వారిని బుజ్జగించి పంపారు. అయితే తాజా సంఘటన వెంకటగిరి టీడీపీలో ముసలం పుట్టించిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. -
సోమిరెడ్డి చివరి ప్రయత్నం
► మంత్రి పదవిపై సోమిరెడ్డి వర్గంలో ధీమా ► అన్నీ రెడ్డి సామాజిక వర్గానికేనా అని హై కమాండ్ వద్ద వాదన వినిపించిన బీద ► సోమిరెడ్డిని మండలి చైర్మన్ చేసి బీదను మంత్రిని చేద్దామని బాబుకు నారాయణ ప్రతిపాదన ► జిల్లా టీడీపీలో వేడెక్కిన రాజకీయం సాక్షి ప్రతినిధి – నెల్లూరు : మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందనే వార్తలు రావడంతో జిల్లా తెలుగుదేశం పార్టీలో హడావుడి మొదలైంది. మంత్రి వర్గంలో స్థానం కోసం ఇంత కాలం ఎదురు చూసిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చివరి ప్రయత్నం ముమ్మరం చేశారు. బీసీ కోటాలో తనకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తన వాదన గట్టిగా వినిపించేందుకు సిద్ధమయ్యారు.జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నారాయణ అటు పాలనా యంత్రాం గం మీద, ఇటు పార్టీ శ్రేణుల మీద పట్టు సాధించలేక పోయారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2019ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జరిపే మంత్రి వర్గ విస్తరణలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అవకా శం కల్పించొచ్చనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తూ వచ్చా యి. దశాబ్దం తర్వాత వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో సోమిరెడ్డి తన వ్యవహార శైలి మార్చుకుని అందరితో స్నేహంగా మెలుగుతూ వస్తున్నారు. అటు చంద్రబాబుతోపాటు ఇటుచినబాబు లోకేష్ వద్దకూడా ఆయన ఆర్నెల్ల నుంచి పదవీ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.విస్తరణ జరిగి తే సోమిరెడ్డికి బెర్త్ ఖాయం అనే వాతావరణం ఏర్పరిచారు. ఈ నేపథ్యంలోనే బీద రవిచంద్ర సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు. మంత్రి నారాయణ మద్దతు కూడగట్టి జిల్లాలో బీసీలకు అవకాశం కల్పించాలనే వాదన లేవదీశారు. జిల్లాలో పదవులన్నీ రెడ్డి సామాజిక వర్గానికే ఉన్నాయనీ, టీడీపీకి ఎప్పటి నుంచో బలమైన మద్దతు దారులుగా ఉన్న బీసీలను కూడా గుర్తించాలని ఆయన కోరుతున్నారు. జిల్లా రాజకీయ సమీకరణల్లో భాగంగా మంత్రి నారాయణ ఒక దశలో సోమిరెడ్డిని శాసన మండలి చైర్మన్ చేసి రవిచంద్రకు మంత్రిగా అవకాశం కల్పించాలని కూడా చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఊహించిన విధంగానే ఏప్రిల్ 2వ తేదీ మంత్రి వర్గ విస్తరణ, మార్పులు,చేర్పులు ఉంటాయనే విష యం బయట కొచ్చింది. దీంతో జిల్లా టీడీపీ రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. సోమిరెడ్డి వర్గీయులు మాత్రం తమ నాయకుడికి ప దవి రావడం ఖాయమని ధీమాగా ఉ న్నారు. రవి చంద్ర మద్దతు దారులు మాత్రం తమ వాద న వినిపించామని, మంత్రి పదవి కాక పోతే మరో కీలకపదవైనా రావడం ఖాయమని చెబుతున్నారు. -
టీడీపీ బలోపేతానికి కృషి చేయండి
నెల్లూరు(వేదాయపాళెం): టీడీపీ బలోపేతానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పేర్కొన్నారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన నెల్లూరు నగర, సర్వేపల్లి నియోజకవర్గాల పార్టీ సర్వసభ్య సమావేశాల్లో ఆయన మాట్లాడారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి జరిగే జన చైతన్యయాత్రలు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియను నవంబర్ ఐదో తేదీలోపు పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ప్రతి కార్యకర్తా, నాయకులు ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని టీడీపీ నాయకులు తిప్పికొట్టాలని కోరారు. పార్టీ పరిశీలకులు నరసింహయ్య, నాయకులు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, రమేష్‌రెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్, కిలారి వెంకటస్వామినాయుడు, చాట్ల నరసింహరావు, దేవరాల సుబ్రహ్మణ్యం, ఆనం జయకుమార్‌రెడ్డి, శివప్రసాద్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పత్రికలకెక్కితే తీవ్ర పరిణామాలు
అభివృద్ధి పనులు ఇన్చార్జిల ద్వారానే జరగాలి టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం తీర్మానం నెల్లూరు : గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరిగే ప్రతి అభివృద్ధి పనీ ఆ నియోజకవర్గాల ఇన్చార్జిలకు తెలిసే జరగాలని తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయించింది. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి శిద్దా రాఘవరావు నేతృత్వంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో పార్టీలో అంతర్గత కలహాలు తీవ్రమైతే తీవ్రంగా నష్టపోతామని ఇన్చార్జి మంత్రి పార్టీ నాయకులకు హితవు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్ ఇటీవల చేసుకున్న పరస్పర ఆరోపణలు పార్టీకి నష్టం కలిగించేవిలా ఉన్నాయని సీఎం అసహనంగా ఉన్నారని ఇన్చార్జి మంత్రి చెప్పారు. అలాగే వెంకటగిరి ఎమ్మెల్యేకి మున్సిపల్ చైర్‌పర్సన్‌కు జరుగుతున్న అంతర్గత గొడవల విషయం మీద కూడా చర్చించారు. ఎమ్మెల్యే ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకోరాదనీ, అలాగే చైర్పర్సన్ కూడా ఎమ్మెల్యేతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో వార్డు, డివిజన్ ఇన్చార్జిలు ప్రతిపాదించే పనులను అలాగే మంజూరు చేయకుండా సంబంధిత పార్టీ ఇన్చార్జిలతో చర్చించి వారి సిఫారసు మేరకే మంజూరు చేయాలని ఇన్చార్జి మంత్రి చెప్పారు. అన్ని శాఖల అధికారులకు కూడా ఇదే ఆదేశాలు జారీ చేస్తామనీ, పార్టీ వర్గాలు సమన్వయం తో పనులు చేయించాలని సూచించారు. ఇన్చార్జిలు చెప్పిన పనులే చేసుకుంటూ పోతే ఇక తామెందుకు ఉన్నట్లు అని ఒక ప్రజాప్రతినిధి సమావేశంలోనే తన అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది. తాము కూడా ప్రజలు ఎన్నుకుంటేనే పదవుల్లో ఉన్నామనీ, తాము కూడా రాజకీయాల్లో పైకి ఎదగాలనుకుంటున్నామనీ, అలాంటప్పుడు అన్నీ ఇన్చార్జిలకు చెప్పే చేయాలంటే ఎలా కుదురుతుందని నిలదీశారని తెలిసింది. అభ్యంతరాలు ఉంటే తన దృష్టికో, జిల్లా మంత్రి నారాయణ దృష్టికో తెచ్చి సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప పత్రికలకెక్కితే మాత్రం తీవ్ర చర్యలు ఉంటాయని శిద్దా రాఘవరావు హెచ్చరించారు. మంత్రి నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, పార్టీ ఇన్చార్జిలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ముంగమూరు శ్రీదర్‌కృష్ణారెడ్డి, డాక్టర్ జ్యోత్స్నలత, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌తో పాటు పలువురు నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీలుగా టీడీపీ నేతల ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి గవర్నర్ కోటలో ఎంపికైన నలుగురు టీడీపీ నేతలు గురువారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ నేతలు టిడి జనార్దన్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, జి.శ్రీనివాసులు చేత శాసనమండలి చైర్మన్ చక్రపాణి ప్రమాణ స్వీకారం చేయించారు.అంతకుముందు వీరంతా దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్నారు. అనంతరం ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత శాసనమండలికి చేరుకున్నారు. కృష్ణా జిల్లా నుంచి టిడి జనార్దన్, నెల్లూరు జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్తోపాటు జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర యాదవ్, చిత్తూరు జిల్లాలోని సీనియర్ నేత జి.శ్రీనివాసులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. -
సీఎం చంద్రబాబుపై కుట్రలు ఆపాలి
నెల్లూరు(టౌన్) : తెలంగాణలో టీడీపీ నాయకులపై కేసీఆర్ వేధింపులు పరాకాష్టకు చేరుకున్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అన్నారు. బుధవారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ సొంత మీడియా ద్వారా ముందుగా లీకులు ఇచ్చి అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. ఓటుకు నోటుపై కేసులు పెట్టే అధికారం ఏసీబీకి లేదని చెప్పారు. సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులను కేసీఆర్ ఇబ్బందులు పెడుతున్నా, ఇతర పార్టీలు విమర్శించకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. టీడీపీని భూస్థాపితం చేయాలనుకుంటున్న కేసీఆర్‌కు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపాక అనురాధ, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, నూనె మల్లిఖార్జునయాదవ్, జెడ్పీటీసీ సభ్యురాలు భారతి, తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీలుగా సోమిరెడ్డి, బీద
ఆమోదం తెలిపిన గవర్నర్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఎమ్మెల్సీలుగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర పేర్లను గవర్నర్ ఆమోదించారు. గవర్నర్ ఆమోదంతో పాటు ఎన్నికల సంఘం సైతం పచ్చజెండా ఊపడంతో జిల్లా నుంచి ఇద్దరు టీడీపీ నాయకులు ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా ఇద్దర్ని ఎమ్మెల్సీలుగా ప్రకటించడం విశేషం. శాసనమండలి చైర్మన్ సమక్షంలో రెండు, మూడు రోజుల్లో సోమిరెడ్డి, బీద మండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రెడ్డి, బీసీ సామాజికవర్గాలకు చెందిన ఇద్దరు నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం రావడం ఇదే మొదటి సారి. జిల్లా నుంచి ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం రావడం టీడీపీ శ్రేణులు, నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. గత ఎన్నికల్లో ఓటమిపాలైనా పార్టీ అధినేత ఇచ్చిన హామీ మేరకు ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. దీంతో మొదటిసారిగా ఆయన శాసనమండలికి వెళ్లనున్నారు. 20 ఏళ్లుగా టీడీపీలో విస్తృత సేవలందించిన బీద రవిచంద్ర మొట్టమొదటిసారిగా పెద్దల సభకు ఎంపికయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ కోసం యత్నించినా, ఆయనకు అవకాశం దక్కలేదు. బీద సేవలను గుర్తించి మొదటిసారిగా చట్టసభలకు ఎంపిక చేయడంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
'ఆ నలుగురు' పేర్లు ఖరారు
-
'ఆ నలుగురు' పేర్లు ఖరారు చేసిన చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను టీడీపీ అధిష్టానం శనివారం ప్రకటించింది. కృష్ణా జిల్లాకు చెందిన టీడీ జనార్ధన్, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు విజయవాడ మాజీ మేయర్, టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని అధిష్టానం భావించింది. కానీ ఆఖరి నిముషంలో నలుగురి పేర్లలో అనురాధ పేరును తొలగించి.. బీద రవిచంద్ర పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడంలో బీద రవిచంద్రయాదవ్ చివరినిమిషంలో కృతార్థులయ్యారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఈ నలుగురు ఆరెళ్ల పాటు ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతారు.