తెలంగాణలో టీడీపీ నాయకులపై కేసీఆర్ వేధింపులు పరాకాష్టకు చేరుకున్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ
నెల్లూరు(టౌన్) : తెలంగాణలో టీడీపీ నాయకులపై కేసీఆర్ వేధింపులు పరాకాష్టకు చేరుకున్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అన్నారు. బుధవారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ సొంత మీడియా ద్వారా ముందుగా లీకులు ఇచ్చి అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. ఓటుకు నోటుపై కేసులు పెట్టే అధికారం ఏసీబీకి లేదని చెప్పారు. సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులను కేసీఆర్ ఇబ్బందులు పెడుతున్నా, ఇతర పార్టీలు విమర్శించకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
టీడీపీని భూస్థాపితం చేయాలనుకుంటున్న కేసీఆర్‌కు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపాక అనురాధ, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, నూనె మల్లిఖార్జునయాదవ్, జెడ్పీటీసీ సభ్యురాలు భారతి, తదితరులు పాల్గొన్నారు.