సోమిరెడ్డి చివరి ప్రయత్నం
► మంత్రి పదవిపై సోమిరెడ్డి వర్గంలో ధీమా
► అన్నీ రెడ్డి సామాజిక వర్గానికేనా అని హై కమాండ్ వద్ద వాదన వినిపించిన బీద
► సోమిరెడ్డిని మండలి చైర్మన్ చేసి బీదను మంత్రిని చేద్దామని బాబుకు నారాయణ ప్రతిపాదన
► జిల్లా టీడీపీలో వేడెక్కిన రాజకీయం
సాక్షి ప్రతినిధి – నెల్లూరు : మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందనే వార్తలు రావడంతో జిల్లా తెలుగుదేశం పార్టీలో హడావుడి మొదలైంది. మంత్రి వర్గంలో స్థానం కోసం ఇంత కాలం ఎదురు చూసిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చివరి ప్రయత్నం ముమ్మరం చేశారు. బీసీ కోటాలో తనకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తన వాదన గట్టిగా వినిపించేందుకు సిద్ధమయ్యారు.జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నారాయణ అటు పాలనా యంత్రాం గం మీద, ఇటు పార్టీ శ్రేణుల మీద పట్టు సాధించలేక పోయారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2019ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జరిపే మంత్రి వర్గ విస్తరణలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అవకా శం కల్పించొచ్చనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తూ వచ్చా యి. దశాబ్దం తర్వాత వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో సోమిరెడ్డి తన వ్యవహార శైలి మార్చుకుని అందరితో స్నేహంగా మెలుగుతూ వస్తున్నారు. అటు చంద్రబాబుతోపాటు ఇటుచినబాబు లోకేష్ వద్దకూడా ఆయన ఆర్నెల్ల నుంచి పదవీ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.విస్తరణ జరిగి తే సోమిరెడ్డికి బెర్త్ ఖాయం అనే వాతావరణం ఏర్పరిచారు. ఈ నేపథ్యంలోనే బీద రవిచంద్ర సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు.
మంత్రి నారాయణ మద్దతు కూడగట్టి జిల్లాలో బీసీలకు అవకాశం కల్పించాలనే వాదన లేవదీశారు. జిల్లాలో పదవులన్నీ రెడ్డి సామాజిక వర్గానికే ఉన్నాయనీ, టీడీపీకి ఎప్పటి నుంచో బలమైన మద్దతు దారులుగా ఉన్న బీసీలను కూడా గుర్తించాలని ఆయన కోరుతున్నారు. జిల్లా రాజకీయ సమీకరణల్లో భాగంగా మంత్రి నారాయణ ఒక దశలో సోమిరెడ్డిని శాసన మండలి చైర్మన్ చేసి రవిచంద్రకు మంత్రిగా అవకాశం కల్పించాలని కూడా చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఊహించిన విధంగానే ఏప్రిల్ 2వ తేదీ మంత్రి వర్గ విస్తరణ, మార్పులు,చేర్పులు ఉంటాయనే విష యం బయట కొచ్చింది. దీంతో జిల్లా టీడీపీ రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. సోమిరెడ్డి వర్గీయులు మాత్రం తమ నాయకుడికి ప దవి రావడం ఖాయమని ధీమాగా ఉ న్నారు. రవి చంద్ర మద్దతు దారులు మాత్రం తమ వాద న వినిపించామని, మంత్రి పదవి కాక పోతే మరో కీలకపదవైనా రావడం ఖాయమని చెబుతున్నారు.