సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న స్కీంలన్నీ స్కామ్‌లని రాష్ట్ర బీజేపీ నేతలు వల్లె వేస్తుంటే.. కేంద్రం నుంచి వచ్చే బీజేపీ మంత్రులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ పథకాలు బాగున్నాయని, దేశమంతా అమలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో అమలవుతోన్న మిషన్ భగీరథ పథకం అతిపెద్ద స్కాం అని మీరు నిందిస్తుంటే.. కేంద్రమంత్రి షెకావత్ మాత్రం ఆ పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని చెబుతున్నారన్నారు. అంటే అతి పెద్ద స్కామ్ పథకాలను దేశంలో అమలు చేయాలని బీజేపీ అనుకుంటుందేమో చెప్పాలని రాష్ట్ర బీజేపీ నేతలను ప్రశ్నించారు.
మంగళవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో విలేకరులతో భట్టి మాట్లాడుతూ.. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన ఏంటో చెప్పాలని అన్నారు. రెండు పార్టీలు కలసి రాష్ట్ర ప్రజలను తప్పు దో వ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మిషన్ భగీరథ పథకం రూ.50 వేల కోట్లను నిలువు దోపిడీ చేసిన అతిపెద్ద కుంభకోణమని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్కాంల కోస మే స్కీంలు తయారు చేస్తున్నట్లు కనిపిస్తోంది తప్ప ప్రజ ల ఉపయోగం కోసం చేసినట్టు లేదని ఎద్దేవా చేశారు.
రెవెన్యూతో చర్చించే సమయం లేదా..
రాష్ట్రంలో తుగ్లక్ పాలనతో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయని, వారం రోజులుగా రెవెన్యూ అధికారులు సమ్మె చేస్తూ తహసీల్దార్ కార్యాలయాలు మూసేస్తే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని భట్టి ప్రశ్నించారు. ఓ తహసీల్దార్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన తర్వాత రెవెన్యూ ఉద్యోగులతో చర్చలకు సమయం లేని సీఎంకు.. కేంద్రం నుంచి వచ్చే మంత్రులతో కూర్చుని ప్రెజెంటేషన్లు ఇచ్చేందుకు సమయం ఉందా అని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment