ఔను.. ఊహించిందే జరుగుతోంది. భీమిలి ప్రజ ‘సబ్బు’ం రుద్దుడును అంగీకరించడం లేదని స్పష్టమైపోతోంది. 2014 నుంచి ఐదేళ్లుగా భూబకాసురులు, అక్రమార్కుల అరాచకాలతో వేగలేకపోయిన అక్కడి ప్రజలు.. ఇప్పుడు దౌర్జన్యాలు, అడ్డగోలు పంచాయితీలకు ట్రేడ్‌మార్క్ అయిన టీడీపీ అభ్యర్థి సబ్బం హరిని ఏ మాత్రం భరించే పరిస్థితి లేదని తేలిపోయింది. అందుకే ఆయనగారి ప్రచారపర్వమే అభాసుపాలవుతోంది. సాధారణ ప్రజలే కాదు. భీమిలి టీడీపీ శ్రేణులు కూడా హరిని మోయడం మా వల్ల కాదంటూ కాడి కింద పడేసి.. ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. ఇంకొందరూ ఏకంగా పార్టీనే వీడిపోయారు. ఏమిటీ ఈ విషయంలో ఏమైనా అనుమానాలున్నాయా?.. అయితే రండి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
సబ్బం హరి.. నమ్మకద్రోహానికి నిలువెత్తు రూపం.. విశ్వాస ఘాతుకానికి అసలు సిసలు నిర్వచనం.. ఇదేంటి ఒక నేతను అన్నేసి మాటలు అంటారా.. అని అనుకుంటున్నారా.. అయితే ఆయనగారి చిట్టా విప్పాల్సిందే..
సబ్బం హరి పేరు చెబితేనే.. విశాఖ నగరంలో అడ్డగోలు పంచాయితీలు, భరించలేని హావభావ విన్యాసాలు, కాళ్లకు పొర్లు దండాలు గుర్తుకు వస్తాయి. బియ్యం బిజినెస్ పేరిట దందాలు చేసుకుంటూ 1995లో అనూహ్యంగా విశాఖ నగరపాలక సంస్థ మేయర్ అయ్యాడు. గౌరవప్రదమైన మేయర్ పదవిలో ఉండగానే ఓసారి కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన ఉదంతంలో బుక్కయ్యారు. అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఆనాటి పోలీస్ కమిషనర్ ఆర్‌పి మీనా, డీఎస్పీ రామచంద్రరాజులు ఇచ్చిన ‘కోటింగ్’ హరి మాటేమోగానీ.. మేయర్ పదవికే మచ్చ తెచ్చింది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన మేయర్‌గా ఉన్న ఆయనే సీతమ్మధారలో ప్రభుత్వ పార్కు స్థలాన్ని కబ్జా చేసి బహుళ అంతస్తుల భవనం నిర్మించుకున్నాడు. ఒక్క దఫా మేయర్‌గా పని చేసి.. చెరిగిపోని మరకలు అంటించుకున్న సబ్బం హరిని కాంగ్రెస్ పార్టీయే కాదు.. నగర ప్రజలు కూడా దూరంగా పెట్టేశారు. అందుకే 1999 ఎన్నికల్లో విశాఖ–1 నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే దారుణ పరాభవం రుచిచూపించారు.
బిల్డప్ బాబును భరించలేం..
టీడీపీలో తాను ఆశించిన టికెట్ తెచ్చుకోగలనని బిల్డప్ ఇచ్చిన సబ్బం హరికి చివరికి చంద్రబాబు ఎవరూ వద్దన్న భీమిలి టికెట్ పడేశారు. మాడుగుల, ఉత్తర అసెంబ్లీ లేదా విశాఖ ఎంపీ టికెట్ ఆశించిన హరి.. చివరాఖరుకు గతి ఏక భీమిలిలో పోటీకి దిగారు. అయితే సబ్బం అభ్యర్ధిత్వాన్ని భీమిలి ప్రజల మాట అటుంచి టీడీపీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. హరి రాకను నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు, వందలాది మంది కార్యకర్తలు టీడీపీకి రాజీనామా చేశారు. మొదట్లో వెల్లువెత్తిన వ్యతిరేకత తర్వాత సర్దుకుంటుందని అందరూ భావించారు. కానీ నియోజకవర్గంలో ఇప్పటికీ టీడీపీ కార్యాలయాలు సైతం తెరుచుకోకపోవడంతో పార్టీ పరిశీలకుడు కర్రోతు సత్యనారాయణ వచ్చి ఇక్కడి పరిస్థితిని పార్టీ అధిష్టానానికి నివేదించారు. ఇక పద్మనాభం మండలానికి చెందిన మాజీ మంత్రి ఆర్.ఎస్.డి.పి.అప్పలనరసింహరాజు, సమన్వయ కమిటీ సభ్యులైతే సబ్బం హరికి పనిచేయలేమని కుండబద్దలు కొట్టేశారు.
ఇలా సొంత పార్టీ నేతలే సబ్బం హరికి దూరంగా ఉంటుండగా, అక్కడి ప్రజలైతే మండే ఎండలకంటే ముందు.. ప్రచారంలో సబ్బం హరి హావభావ విన్యాసాలు, ‘తాను భీమిలి నుంచి పోటీ చేస్తున్నానంటే అది ఈ ప్రాంతానికే గొప్ప’ అంటూ ప్రదర్శిస్తున్న అతిశయాలు భరించలేక అల్లాడిపోతున్నారు.
మారిన మనిషినంటూ.. మళ్లీ మోసం
అటు తర్వాత మారిన మనిషినని నమ్మించి మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా తెరపైకి వచ్చాడు. ఓ దఫా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణతో అప్పటి విశాఖ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి సదరు సబ్బం హరిని సస్పెండ్ కూడా చేయించారు. అప్పుడు కూడా వైఎస్ పెద్దమనసుతో మన్నించి నేదురుమల్లిని ఒప్పించి తిరిగి హరిని పార్టీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2009లో వైఎస్ దగ్గరుండి అనకాపల్లి లోక్‌సభ సీటు ఇప్పించి గెలిపించారు. మహానేత హఠాన్మరణం తర్వాత సబ్బం ఆ కుటుంబం పట్ల ఎంత కృతజ్ఞత చూపించారో అందరికీ తెలుసు.
విశ్వాస ఘాతుకం
2014 ఎన్నికల్లో విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా విషప్రచారాలకు పాల్పడ్డాడు. సమైక్యాంధ్ర చివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున విశాఖ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి.. చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించి బీజేపీ అభ్యర్ధి హరిబాబుకు ఓటేయాలని పిలుపునిచ్చాడు. మొదట అటు కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి పార్టీ ఫండ్‌గా డబ్బులు తీసుకుని.. చివర్లో ఇటు హరిబాబు వద్ద కూడా ముడుపులు పొందారన్న అపకీర్తి గడించాడు. ఆనక ఐదేళ్లు బయటకు మొహం చూపించలేని దుస్థితి దాపురించింది. అప్పుడప్పుడు బయటికొచ్చి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు భజన చేసి మళ్ళీ తెర వెనక్కి వెళ్ళిపోయేవాడు. ఎన్నికలొస్తే తాను కోరుకున్న పార్టీ నుంచి, కోరుకున్న నియోజకవర్గం నుంచి పోటీ చేయగలనని బీరాలు పోయాడు. సరిగ్గా ఎన్నికల సమయం వచ్చేసరికి టికెట్ కోసం చంద్రబాబు కాళ్ళావేళ్లా పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment