సాక్షి, అమరావతి : ఇప్పటికే శాఖపరంగా పలు విమర్శలు ఎదుర్కొంటున్న పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి అఖిలప్రియ.. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలతో కంగుతిన్నట్లు సమాచారం. కృష్ణానది పవిత్ర సంగమం వద్ద టూరిజం బోటు ప్రమాదంపై ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే 22 మంది చనిపోయారన్న ముఖ్యమంత్రి... గతంలో శాఖపరమైన వైఫల్యాలకు మంత్రులు రాజీనామాలు చేసేవారని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆ దుర్ఘటనకు మంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా అంటూ మంత్రి అఖిలప్రియను ఉద్దేశించి చంద్రబాబు అనడంతో ఆమె ఒక్కసారిగా కంగుతిన్నారు. అంతేకాకుండా సహచర మంత్రులు, అధికారుల సమక్షంలోనే చంద్రబాబు ఈ సూచనలు చేయడం గమనార్హం. అఖిలప్రియను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చర్చకు దారి తీసింది. అంతేకాకుండా అఖిల ప్రియను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు సైతం మొదలయ్యాయని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఓ వైపు బోటు ప్రమాద ఘటనపై పార్టీలో బ్లేమ్ గేమ్ జరుగుతోంది. ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు న్యాయం చేయకుండా... టీడీపీలో తాపీగా తప్పొప్పులపై వాదనలు జరుగుతున్నాయి. 22 మంది చనిపోవడంతో పాటు, బినామీ పేర్లతో ఇద్దరు మంత్రులకు బోట్లు ఉన్నాయన్న వార్తలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా, టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి మూడేళ్ల పాటు టూరిజం శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఆయన హయాంలోనే బోట్లకు అనుమతి ఇవ్వడం జరిగింది. తన నుంచి దృష్టి మరల్చడానికే మంత్రిపై నెపం నెట్టేసే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోతే ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోని విషయం తెలిసిందే.
కాగా కృష్ణానదిలో పడవ బోల్తా దుర్ఘటనకు పర్యాటక శాఖ మంత్రే బాధ్యత వహించాలని టీడీపీలో ఓ వర్గం వాదిస్తుంటే... మరోవైపు ఇరిగేషన్ శాఖే బాధ్యత వహించాలని మంత్రి అఖిలప్రియ వర్గం వాదిస్తోంది. బెదిరించి, ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్న అధినేత తమను పట్టించుకోవట్లేదని భూమా వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా ఏమాత్రం విలువ లేని శాఖను అఖిలప్రియకు ఇచ్చారని, పార్టీలో చేరేముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, ఆ అసంతృప్తితోనే అఖిలప్రియ బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేకపోతున్నారని చెబుతోంది. ఏరు దాటాక తెప్ప తగలెస్తారా అంటూ అఖిల వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.
ఇక ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశాలకు అడపాదడపా హాజరవడం తప్పితే, పనులను ఏమాత్రం పట్టించుకోవట్లేదని మంత్రి అఖిలప్రియపై విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు పార్టీలో సీనియర్ నాయకులను సైతం ఏమాత్రం గౌరవించట్లేదని, మంత్రి పదవి చేపట్టాక జిల్లా సీనియర్ నాయకులను మర్యాద పూర్వకంగానైనా కలవకపోవడం పట్ల పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షల్లోను మంత్రి పనితీరుకు మైనస్ మార్కులు పడినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment