సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మలుపు. రాత్రికి రాత్రే సమీకరణాలు మారిపోయాయి. తెల్లారి లేచి చూచేసరికి మరాఠ రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటామన్న శివసేన కలలను బీజేపీ, ఎన్సీపీ భగ్నం చేశాయి. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి సీటులో కూర్చోవడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ మళ్లీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. బీజేపీ, ఎన్సీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేశాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది.
ముంబై నగర మేయర్ పదవిని ఏకగ్రీవంగా దక్కించుకున్నామని మురిసిపోతున్న శివసేనను.. బీజేపీ-ఎన్సీపీ కలిసి ఏకంగా రాష్ట్రంలో అధికారానికి దూరం చేశాయి. శివసేన-ఎన్సీపీ పొత్తును విమర్శించిన బీజేపీ తెల్లారేసరికి ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం మహా విశేషం. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా అమిత్ షా, నరేంద్ర మోదీ మరోసారి తమ ప్రత్యేకత చాటుకున్నారు. వీరిద్దరి ముందు శివసేన, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని ఎత్తులు వేసినా పారలేదు.
రెండు రోజుల క్రితం ప్రధాని మోదీని ఢిల్లీలో శరద్ పవార్ కలిసినప్పుడే మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ఖాయమని వచ్చిన వార్తలు నేడు నిజమయ్యాయి. అదే సమయంలో శరద్ పవార్‌కు ప్రధాని మోదీ.. రాష్ట్రపతి పదవిని ఇవ్వజూపారని శివసేన ఆరోపించింది. అయితే ఈ వార్తలను శరద్ పవార్ తోసిపుచ్చారు. కాంగ్రెస్, శివసేన చర్చలు జరుపుతూనే పవార్ చాణిక్యం ప్రదర్శించడం విశేషం. అయితే తాజా పరిణామం పవార్‌కు తెలియకుండా జరిగిందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి శివసేన, కాంగ్రెస్ పార్టీలకు ఊహించని షాకివ్వడం ద్వారా మోదీ-షా ద్వయం సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించింది. (చదవండి: బిగ్ ట్విస్ట్: సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం)
Comments
Please login to add a commentAdd a comment