బిహార్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒసామా బిన్ లాడెన్ ప్రచారం చేసేవాడు. ఈసారి ఎన్నికల్లో అతను ఎక్కడా కనిపించడం లేదు. ఒసామా బిన్ లాడెన్ ఏంటి...ఎన్నికల ప్రచారం చేయడమేమిటని ఆశ్చర్యపోతున్నారా...ఇతను కూడా బిన్ లాడెనే..అయితే ఆల్ ఖాయిదా నేత లాడెన్ కాదు. అచ్చు ఆ లాడెన్‌లా ఉండే బిహారీ.ఇతని పేరు మెరాజ్ ఖలీద్ నూర్. చూడటానికి అచ్చు అల్ ఖాయిదా నేతలాగే ఉండటంతో అంతా ఇతనని ఒసామా బిన్ లాడెన్ అని పిలిచేవారు.2004,2005 ఎన్నికల సమయంలో నూర్‌కు మంచి డిమాండ్ ఉండేది. రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఎల్‌జేపీ నేత రాం విలాస్ పాశ్వాన్‌లకు నూర్ అంటే ఎంతో ఇష్టం.2004 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పాశ్వాన్ తరఫున ప్రచారం చేశారు. 2005 అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ కోసం రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారు.
పాశ్వాన్ టికెట్ ఇస్తారన్న ఆశతో ఆయన వెంట తిరిగాడు. ఆ ఆశ నెరవేరకపోవడంతో లాలూ పంచన చేరాడు.అప్పట్లో నూర్‌కు రాజకీయంగా మంచి డిమాండు ఉండేది. పెద్ద పెద్ద నాయకులు ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికి నూర్‌ను తమతో పాటు ప్రచారానికి తీసుకెళ్లేవారు. హెలికాప్టర్‌లో చోటు లేకపోతే మరో సీనియర్‌నేతను దించేసి ఆ స్థానంలో నూర్‌ను తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.2014లో వారణాసిలో మోదీపై పోటీ చేయడానికి సిద్ధపడటంతో నూర్ వార్తల్లోకెక్కాడు.అయితే అతని నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. మోదీ తరచూ పాకిస్తాన్‌పైన, తీవ్రవాదంపైన నిప్పులు చెరుగుతుండటంతో నూర్‌కు డిమాండు పడిపోయింది. నూర్ తండ్రి అహ్మద్ జార్జిఫెర్నాండెజ్‌కు సన్నిహితుడట.ప్రస్తుతం డిమాండు లేకపోవడంతో నూరు తన వ్యాపారంలో నిమగ్నమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment