సాక్షి, న్యూఢిల్లీ : ‘జబ్ తక్ రహేగా సమోసా మే ఆలు, తబ్ తక్ రహేగా బీహార్ మే లాలూ’ గత బిహార్ ఎన్నికల సందర్బంగా ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇచ్చిన నినాదం ఇది. ఈ నినాదం ప్రభావం ఏమేరకు ఉందో చెప్పలేంగానీ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ పార్టీలు ‘మహా కూటమి’గా ఏర్పాటై విజయం సాధించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతకుముందు, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 22 సీట్లను, మిత్రపక్షాలతో కలుపుకొని 40కి 31 సీట్లను గెలుచుకుంది. అలాంటి పరిస్థితుల్లో ఏడాదిలోనే జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విశేషమే.
అయితే ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి రాంరాం పలికిన జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ బీజేపీతో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. తన ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు 29 ఏళ్ల తేజశ్వి యాదవ్ జోక్యం పెరిగిన కారణంగా తాను బీజేపీతో చేతులు కలపాల్సి వచ్చిందని నితీష్ కుమార్ చెబుతూ వచ్చారు. కానీ ఒకప్పుడు విలువల ప్రాతిపదిక బీజేపీతో తెగతెంపులు చేసుకొని, ప్రధాని అభ్యర్థిగా అన్ని విధాల తగిన వ్యక్తంటూ పేరుతెచ్చుకున్న వ్యక్తి, బీజేపీతో చేతులు కలపడం ద్వారా పేరును కాస్త చెడగొట్టుకున్నారు. ఒకప్పటిలాగా రాజకీయ చక్రం తిప్పేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ అందుబాటులో లేరు. ఆయన పశుదాణా కేసులో శిక్షపడి జైల్లో ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి దూరమయ్యారు. అఫ్‌కోర్స్, శిక్ష పడిన వ్యక్తులు ఎన్నికల ప్రచారం చేయరాదు.. అదే వేరే విషయం.
‘అంతబాగా మాట్లాడేవారు ఎవరూ లేరు. అంత శక్తి సామర్థ్యాలు కూడా ఎవరికి లేవు. ఆయన్ని మిస్సవుతున్నాం. ఆయనకు కావాలనే బెయిల్ ఇవ్వడం లేదు. ఆయన, నేను ఎన్నికల పనులను పంచుకొని ప్రచారం చేసినట్లయితే పూర్తిగా ఊడ్చేసేవాళ్లం’ అని తేజశ్వి యాదవ్ మీడియాతో వ్యాఖ్యానించారు. ఇప్పుడు కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి స్టార్ ప్రచారకార్త తేజశ్వియే. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ సీట్లు ఉండడం వల్ల మీడియా తన దృష్టిని అంతా అక్కడనే కేంద్రీకరిస్తోంది. కానీ 40 సీట్లు కలిగిన బిహార్‌పైన కూడా దృష్టిని పెట్టాల్సి ఉంది. లాలూ లేకపోయినా తేజశ్వి నాయకత్వంలో 30 సీట్లను సాధిస్తామని కూటమి వర్గాలు ఆశిస్తున్నాయి. ‘జబ్ తక్ రహేగా సమోసా మే ఆలు, తబ్ తక్ రహేగా బిహార్‌పై లాలూ కా బేఠా’ అని వారు సరికొత్తగా నినదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment