సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు ఇచ్చిన తీర్పు వెల్లడి కావడానికి ఇంకా 24 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఓవైపు ఈవీఎంలలో నిక్షిప్తమైన తీర్పు ఏమై ఉంటుందా అంటూ దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. మరో వైపు హస్తినలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మంగళవారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఉత్సాహంతో విందు సమావేశం జరపగా.. విపక్షాల కూటమి ఈవీఎంల అం శంపై ఆందోళన భేటీలు నిర్వహించింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనుకూలంగా ఉండటంతో ఎన్డీయేలో జోష్ కనిపిస్తుండగా.. విపక్షాల్లో మాత్రం నైరాశ్యం అలముకుంది. 2014 కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయంటూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనా వేయడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం రాత్రి ఇక్కడి అశోకా హోటల్‌లో ఎన్డీయేలోని కేంద్ర మంత్రి మండలి సభ్యులకు, ఎన్డీయే పక్షాల నేతలకు విందు ఏర్పాటు చేశారు. తాము తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితాలు అద్దం పడు తున్నాయని ఈ సందర్భంగా విశ్లేషించుకున్నారు. అలాగే, ఫలి తాల వెల్లడి తర్వాత అనుసరించాల్సిన వ్యూహాల్ని చర్చించేం దుకు ఈ విందు సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు. ఒకవేళ వాస్తవ ఫలితాల్లో తమకు సంఖ్యాబలం తగ్గిన పక్షంలో విపక్ష కూటమిలోని పార్టీలను గానీ.. ఎన్డీయేతర, యూపీయేతర పార్టీలను గానీ ఆహ్వానించేందుకు బీజేపీ సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతకుముందు ప్రధాని మోదీ తన కేబినెట్ సహచరులతో భేటీ అయ్యారు. ఈ రెండు సమావేశాల్లోనూ ఆయన చాలా ఉత్సాహంగా కనిపించినట్టు సమాచారం. ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజం అవుతాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం.
డీలాపడిన విపక్షాల కూటమి...
యూపీయే కూటమి 130 స్థానాలకు మాత్రమే పరిమితమవు తుందని, ఈ కూటమితో భావసారూప్యం ఉన్న పార్టీల బలం కూడా 40 సీట్లకు మించదని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించ డంతో కేంద్రంలో ఎన్డీయేతర
ప్రభుత్వం రావడం అసాధ్యమన్న వాదనలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో 22 పార్టీల విపక్ష కూటమి నైరాశ్యంలో మునిగిపోయింది. ఈవీఎంల అంశంపై మంగళవారం ఢిల్లీలో జరిగిన విపక్షాల సమావేశానికి ప్రధాన పార్టీల అధినేతల నుంచి స్పందన కరువు కావడమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు డీఎంకే అధినేత స్టాలిన్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వంటి ప్రధాన నేతలు ఈ భేటీకి హాజరు కాలేదు. ఎన్నికల సంఘంతో భేటీ అనంతరం మరోసారి కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఎన్నికల ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా చర్చించాయి. అయితే, ఇంతటి కీలక సమావేశానికి ప్రధాన పార్టీల అధినేతలు రాకపోవడంతో విపక్షాల శిబిరం డీలాపడినట్టు స్పష్టంగా కనిపించింది.
కలిసొస్తారా.. ‘చే’జారుతారా?
ఎన్డీయేకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు విపక్ష కూటమిలోని పలు పార్టీల నేతలను పునరాలోచనలతో పడేశాయి. ముఖ్యంగా వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షలు ఉన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌లు విపక్ష కూటమితో కలిసొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్డీయేతర ప్రభుత్వానికి సారథ్యం వహించాలన్న ఆకాంక్షతో ఉన్న మాయావతి.. ఎగ్జిట్ పోల్ ఫలితాలతో తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి ఫలితాలు విపక్షాల వైపు మొగ్గు చూపినా మాయావతి సారథ్యాన్ని కాంగ్రెస్ అంగీకరించే పరిస్థితి లేదని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మాయావతి సారథ్యానికి మద్దతు ఇస్తున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ కనిపిస్తున్నా.. లోపల మాత్రం వారి ఆలోచన వేరుగా ఉందని అంటున్నారు.
బీఎస్పీ గానీ మాయావతి గానీ బలోపేతమయ్యే పరిస్థితి వస్తే తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని ఎస్పీ నేతలు భావిస్తున్నారు. అందువల్ల వారి మొగ్గు విపక్ష కూటమి వైపు కంటే ఎన్డీయే వైపే ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌లకు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిందన్న వార్తలతో సమాజ్‌వాదీ పార్టీ కూడా విపక్ష కూటమితోపాటు ఉండే అవకాశం కష్టమనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఎస్పీ, బీఎస్పీల్లో ఏదో ఒక పార్టీ విపక్ష కూటమితో కొనసాగే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు ఏ కూటమి చేరువలో ఉంటే ఆ కూటమివైపే ఇతర పార్టీలు చేరువ కావడానికి మొగ్గు చూపిస్తాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలన్నీ తమ రాష్ట్రాల ప్రయోజనాల మేరకు షరతులతో కూడిన మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటుంది.
ములాయం, అఖిలేష్‌కు క్లీన్‌చిట్‌పై అనుమానాలు...
ములాయంసింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించాయి. ఫలితాల తర్వాత వారి అవసరం ఉంటుందేమోనని భావించే ఎన్డీయే తెరవెనక రాజకీయం నడిపి ఉంటుందని ఆయా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో వివిధ పార్టీల బలబలాలను ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఒక్కో సంస్థ ఒక్కో రకంగా చూపడాన్ని కూడా విపక్షాలు ప్రస్తావిస్తున్నాయి. దీనివెనుక ఏదో మతలబు ఉందని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే విపక్ష కూటమి ఆశలను సజీవంగా ఉంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఈవీఎం ఓట్లకు, వీవీప్యాట్ స్లిప్పులకు మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు సంబంధిత నియోజకవర్గంలో మొత్తం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చాలని డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌ను మంగళవారం ఈసీ ముందుంచింది. తమ డిమాండ్‌ను ఈసీ పరిష్కరించని పక్షంలో బుధవారం ఈసీ కార్యాలయం ముందు ధర్నా చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. గురువారం ఓట్ల లెక్కింపు కావడంతో ఈ పరిణామాలన్నీ ఉత్కంఠ రేపుతున్నాయి.
త్యాగానికి కాంగ్రెస్ సిద్ధం?
ఫలితాల్లో ఎన్డీయేకి కొన్ని సీట్లు తక్కువైతే ఎస్పీ, బీఎస్పీల్లో ఒక పార్టీ ఎన్డీయేవైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు విశ్లే షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ మళ్లీ అధికారంలోకి రాకూడ దని కాంగ్రెస్ భావిస్తే ఎలాంటి త్యాగానికైనా ఆ పార్టీ సిద్ధపడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కర్ణాటకలో తక్కువ సంఖ్యలో సీట్లు సాధించినప్పటికీ, జేడీఎస్‌కు ప్రభుత్వ సారథ్య బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. కేంద్రంలో కూడా అదే పరిస్థితి వస్తే మాయావతి లేదా మమత రేసులో ముందుండే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎన్డీయే అధికారంలోకి రాకుండా చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్ రాజ్యసభ పక్ష నేత ఆజాద్ పలు పార్టీల నేతలతో సంప్ర దింపులు జరుపుతున్నట్టు సమాచారం. కేసీఆర్ సహా ఫెడరల్ ఫ్రంట్ నేతలతోనూ ఆయన చర్చలు జరుపుతున్నారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment