రాష్ట్రానికి వచ్చేదెంత.. కంపెనీలకు ఇచ్చేదెంత? | BJP AP President Kanna Laxmi Narayana Slams AP CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి వచ్చేదెంత..రాష్ట్రం కంపెనీలకు ఇచ్చేదెంత?

Published Wed, Nov 7 2018 11:55 AM | Last Updated on Wed, Nov 7 2018 11:59 AM

BJP AP President Kanna Laxmi Narayana Slams AP CM Chandrababu Naidu - Sakshi

కన్నా లక్ష్మీనారాయణ, చంద్రబాబు నాయుడు

గుంటూరు: బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మరో సారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి లేఖాస్త్రం సంధించారు. ఈ దఫా మరో 8 ప్రశ్నలు వేశారు. ఇలా ప్రశ్నలు పంపడం ఇది 19వ సారి. 18
సార్లు ఐదు ప్రశ్నల చొప్పున పంపిన వాటికి ఇంతవరకూ సీఎం చంద్రబాబు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అయినప్పటికీ కన్నా తన ప్రశ్నల పరంపరను సాగిస్తూనే ఉన్నారు.

ప్రశ్న నెంబర్‌ 93: రాష్ట్రానికి బ్రహ్మాండంగా పెట్టుబడులు తెస్తున్నామని చెప్పేందుకు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కంపెనీలకు మీరు ఇస్తున్న రాయితీలు రాష్ట్రానికి నష్టం కలిగించడం లేదని
చెప్పగలరా? 12 సంవత్సరాలలో రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన హెచ్‌సీఎల్‌ కంపెనీకి మీరు ఇచ్చిన రాయితీలు రూ.2,223.9 కోట్లు. ముఖ్యంగా వారికి కేటాయించిన 49.86 ఎకరాల
విలువే సుమారు రూ.700 కోట్లు. వీటన్నింటిలో ముడుపులు అందలేదని చెప్పగలరా? గొప్ప ఆర్ధిక వేత్తను అని చెప్పుకునే మీరు ‘ రాష్ట్రానికి వచ్చేది ఎంత- రాష్ట్రం ఈ కంపెనీలకు ఇచ్చేది ఎంత’ అని బేరీజు
వేసుకోవాల్సిన అవసరం లేదా?
ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు సిద్ధమా?

ప్రశ్న నెంబర్‌ 94: నెల్లూరు జిల్లాలోని కిసాన్‌ సెజ్‌లో భూకేటాయింపులు, భూములను కేటాయించిన సంస్థలు పరిశ్రమలను ప్రారంభించకపోవడం, ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు పలుమార్లు మీ
ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాట నిజం కాదా? ఇందులో కోదండ రామస్వామి దేవాలయానికి సంబంధించిన 1000 ఎకరాలు ఉన్న మాట వాస్తవం కాదా? దేవుడి భూములు అనే భయం, భక్తి
కూడా మీకు, మీ ప్రభుత్వానికి ? దేవాలయానికి సంబంధించిన ఈ భూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా, అమ్మోనియా యూరియా ప్లాంట్‌కు కేటాయించిన ఈ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం
ఎలా చేస్తున్నదని చీఫ్‌ జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌, ఎస్‌వీ భట్‌ల హైకోర్టు ధర్మాసనం వ్యాక్యానించలేదా? ఎకరం రూ.13 వేల రూపాయలకు ఈ భూములన్నీ కేటాయిస్తే, వాటిని ఎకరం రూ.50 లక్షలకు అమ్మిన
మాట వాస్తవం కాదా? ఈ మొత్తం వ్యవహారంలో మీకు, మీ పార్టీ వారికి ఎలాంటి ముడుపులు అందలేదని ప్రకటించగలరా? దీనిపై సీబీఐ విచారణకు సిద్ధమా?
సంక్రాంతి, క్రిస్మస్‌, రంజాన్‌ పండుగలకు
చంద్రన్న కానుకల పేరిట ఇస్తున్న సరుకుల సరఫరా బాధ్యత మీ వందిమాగదులకు అప్పగించి, నాసిరకం సరుకులు ప్రశ్నించలేని పేదలకు పంపిణీ చేసి జేబులు నింపుకుంటున్న విషయం వాస్తవం కాదా?
పేదలకు, పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు నిర్దేశించబడిన సంక్షేమ పథకాలు వారికి అందించే విషయంలో విఫలమైన  మీ అవినీతి పాలన ఇంకా కావాలా ప్రజలకు?

ప్రశ్న నెంబర్‌ 95: మీ అసమర్థ, అవినీతి పాలన వల్ల రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లబ్దిదారులకు సక్రమంగా చేరకపోవడం వల్ల రూ.వేల కోట్లు దుర్వినియోగం అయిన మాట వాస్తవం కాదా? సాక్షాత్తూ ప్రభుత్వ
విజిలెన్సు అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తన 791 నివేదికలలో రూ.10,773 కోట్ల మేరకు సంక్షేమ పథకాలలో నష్టం వాటిల్లిందని, ఇది కూడా ప్రభుత్వ వైఫల్యం వల్లనే జరిగిందని పేర్కొనలేదా? పేదలకు
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తోన్న బియ్యం వారికి చేరకుండా తిరిగి ప్రభుత్వ ఖజానాకే జమ అవుతోన్న తీరుతో ప్రభుత్వమే పేద ప్రజల పొట్టకొడుతున్న మాట నిజం కాదా? ఈ పాస్‌ విధానం
ప్రవేశపెట్టాక 2015 నుంచి ఇప్పటివరకు రేషన్‌ బియ్యం తీసుకోని కారణంగా ప్రభుత్వానికి రూ.1800 కోట్ల విలువైన బియ్యం ఆదా చేసుకున్న విషయం వాస్తవం కాదా? ఆ రేషన్‌ బియ్యం అంతా కూడా
రెక్కాడితే గానీ డొక్కాడని వలస కూలీలకు సంబంధించినవి కాదా?
వారి పొట్టగొట్టడానికి మీకు మనసెలా వచ్చింది?

ప్రశ్న నెంబర్‌ 96: మొత్తం రాష్ట్రం ఆస్తులన్నీ ఎడాపెడా ఎందుకు తాకట్టులు పెడుతున్నారో ప్రజలకి ఒకసారి వివరిస్తారా? ఇష్టా రాజ్యంగా ఒకవైపు దుబారా ఖర్చులు చేయడం, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను
తప్పించుకోవడానికి సీఆర్‌డీఏ, ఇతర ప్రభుత్వ విభాగాల చేత అప్పులు చేయించడం, దానికి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ గ్యారంటీ ఇవ్వడం, మొత్తానికి చాలా గొప్ప స్కెచ్‌ వేశారు.
రాష్ట్రాన్ని ప్రభుత్వ విభాగాలను
అప్పులపాలు చేసి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. సుమారు రూ.11 వేల కోట్లు అప్పులు చేసేందుకు ఏర్పాట్లు జరిగిన మాట వాస్తవం కాదా? ఈ అస్తవ్యస్త ప్రణాళికల ద్వారా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గందరగోళంలోకి
నెట్టేస్తున్న మాట నిజం కాదా? ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకి సిద్ధమా?

ప్రశ్న నెంబర్‌ 97: అవినీతిలో మీ అనుచరులు మిమ్మల్నే మించిపోయారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించే దానికి వచ్చే రైతులకు, ఇతర సందర్శకులకు అల్పాహారం, భోజనం ఏర్పాటు చేసినందుకు
ఒక్కొక్కరికి రూ.275 చెల్లిస్తున్నారు. మీరు నియమించిన అడ్వోకేట్‌ జనరల్‌ బంధువు నిర్వహిస్తున్న ఈ భోజనశాలలో 10 మంది వచ్చినా బస్సు నిండా వచ్చినట్లు రికార్డుల్లో రాసుకుని ఇందులో కూడా
అవినీతి చేయగలిగిన మీ అనుచరులను మెచ్చుకోవాల్సిందే
.

ప్రశ్న నెంబర్‌ 98: దళితులను అవమానించడం, మోసగించడం తప్ప మీకు మీప్రభుత్వానికి వేరే పని లేదా? భోగాపురం విమానాశ్రయానికి సేకరించిన దళితుల భూముల విషయంలో వారికిచ్చే పరిహారంలో
మోసపూరిత వేలిముద్రలు వేయించుకోవటమా? ప్రభుత్వం ఇంత అన్యాయం చేయటమా? మీ అన్యాయాన్ని తెలుసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్ర రావు మీ ప్రభుత్వానికి
అక్షింతలు వేసి, దళితులకు కూడా మిగిలిన వారి వలె ఎకరానికి రూ.28 లక్షలు చెల్లించామని ఆదేశించలేదా?
తప్పుడు వేలిముద్రలు వేయించుకున్నందుకు మీ ప్రభుత్వం మీద చీటింగ్‌ కేసు పెట్టనక్కరేలా?

ప్రశ్న నెంబర్‌ 99:  పేద ప్రజలకు అత్యంత ప్రధానమైన వైద్య, ఆరోగ్య రంగాలను మీ ప్రభుత్వం సర్వనాశనం చేయలేదని చెప్పగలరా? ఆదివాసీలకు, గిరిజనులకు, బలహీనవర్గాల ప్రజల కోసం ఉండే ప్రాధమిక
ఆరోగ్య కేంద్రాలను కునారిల్లే విధంగా చేసేశారు. వైద్య ఆరోగ్య సర్వీసులన్నీ ప్రైవేటీకరించి, అవినీతికి తెరతీయలేదా? జాతీయ హెల్త్‌ మిషన్‌ నిధులు వినియోగించకుండా బ్యాంకుల్లో ఎందుకు ఉంచాల్సి
వచ్చిందో చెప్పగలరా?  దేశంలో వినూత్న ప్రయోగం అని ఆర్భాటం చేసిన విశాఖపట్నం మెడిటెక్‌లో జరుగుతున్న అవకతవకలకు ప్రజలకు సమాధానం చెప్పరా? సీఈఓగా నియమితులైన జితేంద్ర కుమార్‌ శర్మ ఆధ్వర్యంలో, మీ కుమారుని కనుసన్నలలో జరుగుతున్న భూ కుంభకోణం, బినామీలకు చెల్లింపులు, వీటన్నింటి మీద సీబీఐ విచారణకు సిద్ధమా?

ప్రశ్న నెంబర్‌ 100 : రాష్ట్రంలో పంటకుంటల తవ్వకంలో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణంపై మీకు సమాచారం లేదా? కేంద్ర ప్రభుత్వం అందించిన ఉపాధి హామీ నిధులలో ఒక్క అనంతపురం జిల్లాలోనే
61,729 కుంటలను తవ్వినట్లు తప్పుడు లెక్కలు చూపించి కోట్లాది రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులను మింగిన మాట వాస్తవం కాదా?
దీనిపై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement