మద్దతుదారులతో కలసి సంబరాల్లో పాల్గొన్న జైరామ్ ఠాకూర్
సిమ్లా: మంచుకొండలతో కనువిందు చేసే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా జైరాం ఠాకూర్‌ను బీజేపీ శాసనసభాపక్షం ఆదివారం ఎన్నుకుంది. పార్టీలోని ప్రముఖులను కాదని ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జైరాం ఠాకూర్‌ను సీఎం పీఠం వరించింది. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు గత సోమవారం వెలువడటం, బీజేపీ భారీ విజయాన్ని సాధించడం తెలిసిందే. మొత్తం 68 స్థానాలకుగాను బీజేపీకి 44, కాంగ్రెస్‌కు 21 సీట్లు వచ్చాయి. అయితే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌కుమార్ ధూమల్ ఎన్నికల్లో ఓడిపోవడంతో సీఎం ఎవరనే దానిపై ఇన్నాళ్లు ఉత్కంఠ నెలకొంది.
జైరాం ఠాకూర్‌తోపాటు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ధూమల్ సహా పలువురి పేర్లు సీఎం రేసులో వినిపించాయి. చివరకు పార్టీ కేంద్ర కమిటీ నుంచి వచ్చిన పర్యవేక్షకులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్‌ల అధ్యక్షతన బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఆదివారం సిమ్లాలో జరిగింది. రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా జైరాం ఠాకూర్ పేరును ఎమ్మెల్యేలు సురేశ్ భరద్వాజ్, మహేంద్ర సింగ్‌లు ప్రతిపాదించగా మిగిలినవారు బలపరిచారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని జైరాం కోరారు. గవర్నర్ పచ్చజెండా ఊపడంతో ఈ నెల 27న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతారని సీనియర్ నేతలు చెప్పారు.
మండీ నుంచి తొలి ముఖ్యమంత్రి
రాజ్‌పుత్ కులానికి చెందిన 52 ఏళ్ల ఠాకూర్ గతంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పనిచేశారు. నిరాడంబరుడిగా పేరుతెచ్చుకున్న ఆయన 2007 ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. హిమాచల్‌లో ఇతర పార్టీలతో పొత్తులు లేకుండా బీజేపీని సొంతంగా అధికారంలోకి తీసుకొచ్చింది ఠాకూరే. ప్రస్తుతం ఆయన మండీ జిల్లాలోని సిరాజ్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయంగా, సీట్ల సంఖ్య పరంగా అత్యంత ప్రధానమైన మండీ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి కాబోతున్న తొలి నాయకుడు ఈయనే. తాజా ఎన్నికల్లో బీజేపీ అక్కడ 9 స్థానాల్లో గెలుపొందింది. జైరాం చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసి అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఆరెస్సెస్, ఏబీవీపీతో మంచి సంబంధాలు ఉండేవి. తొలిసారిగా 1993 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 1998 నుంచి సిరాజ్ నుంచి ప్రతి ఎన్నికలోనూ గెలుస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment