
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలను కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలని చూస్తోందని బీజేపీ మండిపడింది. గణతంత్ర వేడుకల సందర్భంగా రాహుల్ గాంధీకి ఆరో వరుసలో సీటు ఎందుకిచ్చారు, మొదటివరుసలో ఎందుకివ్వలేదంటే కాంగ్రెస్ రచ్చ చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.
ప్రజాస్వామ్య నిబంధనలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తుంది కానీ, వ్యక్తుల ఆధారంగా కాదని ఆయన అన్నారు. ఇంత చిన్న విషయం 133ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు ఎందుకు అర్థం కావట్లేదని ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్ హయాంలో ఎమెర్జెన్సీ విధించారని విమర్శించారు. మీరు అధికారంలో ఉన్న సమయంలో మా పార్టీ జాతీయ అధ్యక్షులకు ఎక్కడ స్థానం కల్పించారని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలను కాంగ్రెస్ అర్థం చేసుకోవాలని, రాహుల్ గాంధీ తానో సూపర్ వీవీఐపీ అనుకోవడం సరికాదని హితవు పలికారు. ఈ విషయంలో చేసిన రాద్ధాంతానికి కాంగ్రెస్ పార్టీ తక్షణమే క్షమాపణ చెప్పాలని అన్నారు.