న్యూఢిల్లీ : బీజేపీ జాతీయాధ్యక్షడు అమిత్ షా అనారోగ్యాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు బీకే హరిప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరిప్రసాద్‌ను పార్టీ జనరల్ సెక్రటరీ హోదా నుంచి తొలగించాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ హరిప్రసాద్‌ను తొలగించకపోతే ఈ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కూడా మద్దతిస్తున్నట్లు భావించాల్సి వస్తుందని తెలిపారు.
ఈ విషయం గురించి బీజేపీ అధికార ప్రతినిధి జీవిఎల్ నర్సింహ్మ రావు మాట్లాడుతూ.. ‘రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిండం కాంగ్రెస్ స్వభావం. ఒక వైపు రాహుల్ గాంధీ జైట్లీ అనారోగ్యం గురించి విచారం వ్యక్తం చేస్తూంటే.. మరో వైపు హరి ప్రసాద్ లాంటి వాళ్లు ఇలా విషం కక్కుతారు. వీరి గురించి జనాలకు బాగా తెలుసు. ఒక వేళ వారు(రాహుల్) నిజంగానే హరిప్రసాద్ వ్యాఖ్యల్ని సమర్థించకపోతే.. అతని చేత అమిత్ షాకు బహిరంగ క్షమాపణలు చెప్పించాల’ని డిమాండ్ చేశారు.
అమిత్ షా స్వైన్ ఫ్లూతో బాధపడుతూ.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు హరిప్రసాద్.. కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిని చీల్చడానికి ప్రయత్నించడం వల్లే అమిత్ షా అనారోగ్యం పాలయ్యారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment