సాక్షి, హైదరాబాద్ : తనకు భారతీయ జనతా పార్టీలో తలుపులు మూసుకుపోలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్రంలో ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్న టీఆర్ఎస్‌కు బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయమని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలు అడ్డంకిగా ఉన్న కారణంగానే బీజేపీలోకి చేరకుండా ఆగుతున్నానని, ఆ పార్టీలోకి ఎప్పుడు చేరేదీ త్వరలోనే చెబుతానని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటే తనకు ఎప్పటికీ అభిమానమేనని అందుకే తనకు జారీ చేసిన షోకాజ్‌కు సమాధానం ఇచ్చానన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రజలు 19 మందిని గెలిపించినా కేవలం నాయకత్వ లోపం వల్లే 12 మంది పార్టీని వీడారని ఆరోపించారు. తెలంగాణ పీసీసీ నాయకత్వ లోపాలను తాను మీడియా ముందు ఎత్తిచూపినందుకు, పార్టీకి భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పును ప్రస్తావించినందుకు తనకు షోకాజ్ నోటీసులు వచ్చాయన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పినా.. తన మాటను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీజేపీని, మోదీ పాలనను పొగిడిన విషయం వాస్తవమేనని అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment