ఆరో విడత బీజేపీకి పెద్ద సవాలే..! | BJP Face Tough Fight In Next Face Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

ఆరో విడత బీజేపీకి పెద్ద సవాలే..!

Published Wed, May 8 2019 5:18 PM | Last Updated on Wed, May 8 2019 5:26 PM

BJP Face Tough Fight In Next Face Lok Sabha Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఆరో విడత లోక్‌సభ ఎన్నికలు జరిగే స్థానాల్లో అధికార బీజేపీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 12న దేశ వ్యాప్తంగా గల 59 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌  జరుగనుంది. జాతీయ రాజధాని ఢిల్లీలోని ఏడు స్థానాలతో పాటు, యూపీ, బిహార్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే గత ఎన్నికల్లో ఈ స్థానాల్లో సునాయాసంగా విజయం సాధించిన కమళదళం ఈసారి అనేక సవాళ్లను ఎదర్కొవల్సి వస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అవే ఫలితాలను పునరావృత్తం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. కానీ అదంత సులువైన విషయంలా కనిపించట్లేదు. ఆప్‌, కాంగ్రెస్‌ నుంబి బీజేపీ అభ్యర్థులు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. విజయంపై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. దీంతో దేశ రాజధానిలో త్రిముఖపోటీ నెలకొంది.

2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన యూపీలో  పోటీ తీవ్రంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి. నయా చరిత్రను సృష్టించింది. కానీ ఆ విజయం తాలూకు సంబరాలు  ఎంతోకాలం నిలువలేదు. సీఎం, డిప్యూటీ సీఎం ఖాళీ చేసిన స్థానాల్లో  విపక్షాలు విజయం సాధించి సంచలనం సృష్టించాయి. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమి బీజేపీని దీటుగా ఎదుర్కొగలిగాయి. ఇదిలావుండగా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో చిరకాల ప్రత్యుర్థులైన మాయావతి, అఖిలేష్‌ నేతృత్వంలోని పార్టీలు కూటమిగా ఏర్పడి విజయం కోసం ప్రయత్నిస్తున్నాయి. వారి కలయికతో యూపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించవచ్చని రాజకీయ వర్గాల విశ్లేషణ. దీంతో గత ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన 71 స్థానాలను నిలుపుకోవడం అంతలేలికకాదు.

యూపీలోని 14 స్థానాలకు మే 12న ఎన్నిక జరగనుంది. వీటిలో 12 సీట్లు బీజేపీ ఎంపీలకు చెందినవే. ఆయా స్థానాల్లో ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్డీ కూటమి నుంచి బీజేపీ తీవ్ర పోటీని  ఎదుర్కొంటోంది.  ఇదిలావుడంగా తానేమీ తక్కువ కాదంటూ కాంగ్రెస్‌ కూడా పోటాపోటీ ప్రచార సభలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్‌ తురుపు ముక్క ప్రియాంక గాంధీ ఇప్పటికే పలుమార్లు యూపీలో పర్యటించారు. వీలైనన్ని ఎక్కువ స్థానాలు సాధించి ప్రత్యర్థులకు చెక్‌ పెట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఉత్కంఠ పోటీకి బిహార్‌ వేదికైంది. గత ఎన్నికల్లో 30 స్థానాలకు పైగా విజయం సాధించిన బీజేపీ ఈసారి నితీష్‌ సారధ్యంలోని జేడీయూతో కలిసి ఎన్నికల రంగంలోకి దిగింది. 18 స్థానాలకు మే 12న పోలింగ్‌ జరుగనుంది. వీటిలో ఏడు స్థానాల్లో బీజేపీ సిట్టింగ్‌ ఎంపీలు ఉన్నారు. గత ఫలితాలనే మరోసారి పునరావృత్తం చేయాలని బీజేపీ భావిస్తుండగా.. కాంగ్రెస్‌, ఆర్జేడి కూటమి విజయంపై ధీమాతో ఉన్నాయి.


గత ఎన్నికల్లో మధ్య ప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదిహేనేళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్‌కు పట్టంకట్టారు మధ్యప్రదేశ్‌ ఓటర్లు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా అదే జోరు కొనసాగిస్తామని హస్తం పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు వాగ్ధానాలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పడితేనే న్యాయం జరుగుతుందని బీజేపీ ప్రచారం నిర్వహిస్తోంది. దీంతో మధ్యప్రదేశ్‌లో పోటీ హోరాహోరీగా సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement