సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీని కొన్ని దశాబ్దాల క్రితం ‘బ్రాహ్మణ్–బనియన్’ పార్టీగా అభివర్ణించేవారు. ఈ ముద్రను చెరిపేసుకొని హిందూ మతంలోని అన్ని కులాలు, ముఖ్యంగా దళితుల సంక్షేమం కోరుకునే పార్టీగా పేరు సంపాదిస్తే తప్ప ఎన్నికల్లో రాణించలేమని గ్రహించిన బీజేపీ ఆ దిశగా ప్రయత్నించింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను నిజమైన స్వాతంత్య్ర యోధుడుగా అభివర్ణిస్తూ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా దళితులను ఆకర్షించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2014 ఎన్నికల్లో బీజేపీ అన్ని కులాల ఓటర్ల సంఖ్య 12 శాతం పెరగ్గా, అగ్రవర్ణాల ఓట్ల శాతం 18, ఓబీసీల ఓట్ల శాతం 12, ఎస్సీల ఓట్ల శాతం 12, ఎస్టీల ఓట్ల శాతం 14 పెరిగింది.
ముఖ్యంగా మోదీ ప్రచారం 2014లో జరిగిన ఉత్తరప్రదేశ్ లోక్‌సభ, గతేడాది అసెంబ్లీ ఎన్నికలపై ఎంతో ప్రభావం చూపింది. లోక్‌సభ ఎన్నికల్లో దళితులు 21 శాతం మంది ఓటు వేసిన కారణంగానే ఆ రాష్ట్రంలో 80 స్థానాలకుగాను బీజేపీ 40 స్థానాలను గెలుచుకోగలిగింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 24 శాతం దళితుల ఓట్లను సాధించడం ద్వారా అధికారంలోకి రాగలిగింది. 85 రిజర్వ్‌డ్ సీట్లలో 69 సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది. అలాంటి యూపీలోనే బీజేపీకి చెందిన దళిత ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. దేశంలోని దళితుల పట్ల పార్టీ అనుసరిస్తున్న వైఖరిని వారు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఏప్రిల్ రెండవ తేదీన దళితులు జరిపిన భారత్ బంద్ హింసాత్మకంగా మారడం, పది మంది దళితులు చనిపోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు.
వారిలో అందరికన్నా ముందుగా పార్టీ ఎంపీ సావిత్రి భాయ్ ఫూలే ఏప్రిల్ ఒకటవ తేదీనే లక్నోలో ‘రాజ్యాంగాన్ని రక్షించండి! రిజర్వేషన్లను రక్షించండి’ అంటూ దళితులతో కలసి నిరసన ప్రదర్శన జరిపారు. దళితులపట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. ఆ తర్వాత ఏప్రిల్ రెండవ తేదీన పార్టీ దళిత ఎంపీ డాక్టర్ యశ్వంత్ సింగ్, ఏప్రిల్ ఐదవ తేదీన ఛోటేలాల్ ఖర్వార్, అశోక్ దోహ్రే నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకే లేఖలు రాశారు. నాలుగేళ్ల ఆయన పాలనలో దళితులకు ఎలాంటి మేలు జరగలేదని ఆరోపించారు. దళితులపై హింస నిరోధక చట్టాన్ని సుప్రీం కోర్టు నీరుకార్చడాన్ని విమర్శించారు. మరో బీజేపీ ఎంపీ ఉదిత్ రాయ్ రాష్ట్రంలో యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా విమర్శించారు.
ఇటు పార్టీలోనే కాకుండా అటు బయట కూడా దళితుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతోంది. దళిత నాయకుల చొరవ లేకుండా లక్షలాది మంది దళితులు ఏప్రిల్ 2వ తేదీన వీధుల్లోకి వచ్చి భారత్ బంద్‌ను నిర్వహించడమే అందుకు కారణం. ఈ విషయాన్ని గ్రహించిన నరేంద్ర మోదీ కనిపించిన అంబేడ్కర్ విగ్రహానికల్లా శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఏప్రిల్ 14వ తేదీన అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు బీజేపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో నిజంగా దళితులకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు ఉండాలే తప్ప, ప్రచార కార్యక్రమాలు మాత్రమే ఉంటే మరోసారి నమ్మి మోసపోయే పరిస్థితుల్లో దళితులు లేరు.
Comments
Please login to add a commentAdd a comment