విలేకరులతో మాట్లాడుతున్న జీవీఎల్ నరసింహారావు
సాక్షి, విజయవాడ: బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అధికార పార్టీ టీడీపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీతో పొత్తు వల్లే బీజేపీకి గ్రహణం పట్టిందని ఆరోపించారు. ప్రస్తుతం తమ పార్టీకి పట్టిన చంద్ర గ్రహణం వీడిందని ఎద్దేవా చేశారు. పచ్చ పార్టీ నాయకులు బీజేపీ నాయకుల అంతు చూస్తామని సోషల్ మీడియాలో భయపెడుతున్నారని పేర్కొన్నారు. అధికారం ఉందని భయపెడితే తాము భయపడబోమన్నారు. ప్రతి ***కు బీజేపీని భయపెట్టడం అలవాటుగా మారిందని పరుష పదజాలంతో దుయ్యబట్టారు.
ప్యాకేజీకి బాబు ఒప్పుకున్నారు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారని జీవీఎల్ వెల్లడించారు. స్పెషల్ ప్యాకేజీ కింద 5 ప్రాజెక్టులకు రూ.12,572 కోట్ల పనులు జరుగుతాయని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని తెలిపారు. మరో 7 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, వాటి విలువ రూ. 17,236 కోట్లు అని అందులో పేర్కొన్నట్లు జీవీఎల్ వెల్లడించారు. ఇలా చంద్రబాబు కోట్ల రూపాయలు ఖర్చు చేసి బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
బాబు దొంగ దీక్షలు చేస్తున్నారు
ఓ పక్క కేంద్రం ఇస్తున్న నిధులు తీసుకుంటూ మరోపక్క బాబు కేంద్రంపై దొంగ దీక్షలు చేస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. దొంగ దీక్షలు చేస్తున్న చంద్రబాబు.. ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ ఇస్తామని చెబుతుంటే.. బాబు దొంగ దీక్షలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరానికి కేంద్రం నిధులు ఇస్తుంటే.. బాబు మాత్రం రోజుకో శంకుస్థాపన చేస్తున్నారని, రాష్ట్రానికి పోలవరం మోదీ ఇచ్చిన వరమని ఆయన అన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అవినీతిలో మొదటి స్థానంలో ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment