సాక్షి, హైదరాబాద్ : కేంద్రం తీసుకు వచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై రాహుల్ గాంధీ చర్చకు రావాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నార్సీ, సీఏఏ వల్ల ఎవరికీ నష్టమో చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ జనాభాకోసం సెన్సెస్ ని ఉపయోగిస్తున్నామని, పార్లమెంట్, అసెంబ్లీ విభజనకు సెన్సెస్ డేటా ఉపయోగపడుతుందని అన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తన స్థాయి ఏంటో తెలుసుకోవాలని, హైదరాబాద్ పాత బస్తీలో ఎన్ని బస్తీలు ఖాళీ అవ్వలేదని సూటీగా నిలదీశారు. తెలంగాణలో ఒకే రోజు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. సర్వేను సరైన విధంగా ఉపయోగించలేదని దుయ్యబట్టారు. సెన్సెస్ ద్వారా ప్రతి కుటుంబం డేటా పూర్తి భద్రతతో ఉంటుందని, ఎన్పీఆర్‌లో కచ్చితంగా డాక్యుమెంట్ ఇవ్వాలనే నిబంధన లేదన్నారు. సీఆర్‌ఎస్‌ని పక్కాగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. (సీఏఏను అమలు చేసి తీరుతాం)
ఈ చట్టం వల్ల ఏ ఒక్క భారతీయుణ్ణి దేశం నుంచి పంపించే అవకాశం ఉండదని కిషన్‌రెడ్డి అన్నారు. భారతీయులను విదేశాలకు పంపించే హక్కు కేంద్రానికి లేదని, అంబేద్కర్ రాజ్యాంగం పై కేంద్రానికి పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఈ చట్టంపై ప్రతిపక్షాలు బాధ్యతరహితంగా మాట్లాడుతున్నాయని ధ్వజమెత్తారు. ఏ ఒక్క మతాన్ని టార్గెట్ చేసే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. ఏ మతం హక్కును తొలగించడానికి కేంద్రానికి హక్కు లేదని అన్నారు. 1947 లోనే పాకిస్తాన్ నుంచి హిందూ, సిక్కులు, జైనులు వస్తే భారత్‌కు హక్కులు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. దీనిపై 2003 లో మన్మోహన్ సింగ్ రాజ్యసభలో మాట్లాడారని మంత్రి ప్రస్తవించారు.
ఎన్నార్సీ అనేది కొత్త బిల్లు కాదని 2015లోనే లోక్‌సభలో ఆమోదం పొందిందని తెలిపారు. రాహుల్ గాంధీకి ఎన్పీఆర్ కు ఎన్నార్సీకి కూడా తేడా తెలియదని ఎద్దేవా చేశారు. సీఏఏ.. జీఎస్టీని కలిపి కలిపి రాహుల్ మాట్లాడుతున్నారని, ఎన్పీఆర్ అంటే పేదలపై టాక్స్ అని రాహుల్ అంటున్నారు. ఎన్పీఆర్ అంటే తెలియని వ్యక్తులు ఇవాళ మాట్లాడటం విచారకరమన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఏ రకమైన చట్టం బీజేపీ తేలేదని.. భవిష్యత్‌లో కూడా తేదని అన్నారు. ఇండియాకు ఎవరైనా రాజమార్గంలో వచ్చి ఉండవచ్చని. దొడ్డి దారిన రాహుల్ ఇంటికి ఎవరైనా వస్తే అంగీకరిస్తారా అంటూ రహుల్‌పై మంత్రి కిషన్‌రెడ్డి చురకలంటించారు.
Comments
Please login to add a commentAdd a comment