ఈ నెల 22న వేడుకలను ప్రారంభిస్తారు : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతి..ఏకత్వాన్ని సమున్నతంగా ఆవిష్కరించే ద్వైవార్షిక సాంస్కృతిక మహోత్సవమైన ‘లోక్‌మంథన్’కు భారత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము హాజరవుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బేగంపేటలోని పర్యాటక భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజ్ఞాభారతి అఖిల భారత కన్వీనర్ నందకుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. నవంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు శిల్పకళావేదిక, శిల్పారామంలో ఈ వేడుకలు జరుగుతాయన్నారు. 22వ తేదీ ఉదయం 9.30 గంటలకు ‘లోక్‌మంథన్ వేడుకలను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రారంభిస్తారని చెప్పారు.
అంతకంటే ముందు 21వ తేదీన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శిల్పకళావేదికలో ఎగ్జిబిషన్, సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభిస్తారన్నారు. వసుదైక కుటుంబమని ప్రపంచానికి చాటిచెప్పిన భారతీయ సాంస్కృతిక విశిష్టతను ఈ వేడుకల్లో వీక్షించొచ్చని పేర్కొన్నారు. జాతీయవాద ఆలోచనాపరులు, ఆచరణీయులు, కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు ఈ వేడుకల్లో భాగస్వాములవుతారని కిషన్‌రెడ్డి చెప్పారు. నందకుమార్ మాట్లాడుతూ దేశవిదేశాల నుంచి 2,500 మందికి పైగా ప్రతినిధులు తరిలిరానున్నట్టు చెప్పారు.
లిథువేనియా, ఆర్మేనియా, ఇండోనేసియా తదితర దేశాలకు చెందిన విశిష్ట కళారూపాలను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారన్నారు. లోక్‌మాత నాటకంతోపాటు కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన మహారాణి రుద్రమదేవి నాటక ప్రదర్శన కూడా ఉంటుందన్నారు. ముగింపు ఉత్సవాలకు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, నిర్మలాసీతారామన్‌లు పాల్గొంటారని చెప్పారు.
⇒ ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకలు ఇప్పటివరకు భోపాల్, రాంచీ, గువాహటిల్లో జరిగాయి.‘లోక్–అవలోకన్, లోక్ విచార్–లోక్ వ్యవహార్’అనే ప్రధాన థీమ్‌తో ఈసారి లోక్‌మంథన్–2024 వేడుకలను నిర్వహిస్తున్నారు.
⇒ ఈ వేడుకల్లో ప్రదర్శనలు వీక్షించేందుకు ప్రతి రోజూ లక్ష మందికి పైగా సందర్శకులు తరలిరానున్నట్టు అంచనా.1,500 మందికి పైగా కళాకారులు సుమారు వెయ్యి కళారూపాలను ప్రదర్శించనున్నారు.
⇒ఫొటో జర్నలిస్ట్ అంధేకర్ సతీలాల్ వనవాసీ సంస్కృతి, జీవనశైలిపైన తీసిన ఫొటో ఎగ్జిబిషన్‌తోపాటు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కళారూపాలను ప్రదర్శిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment