విలేకరులతో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజలకు నష్టం కలిగించే ఎలాంటి అంశం సీఏఏలో లేదని రాజకీయ నాయకులకు, పార్టీలకు కేంద్రం పదే పదే చెబుతున్నా వాస్తవాలను గ్రహించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు సీఏఏపై వక్ర భాష్యం చెబుతూ విష ప్రచారం చేస్తున్నాయన్నారు. రాజకీయంగా వ్యక్తిగతంగా మోదీ ప్రభుత్వంపై, బీజేపీపై మాట్లాడితే అభ్యంతరం లేదని, సీఏఏపై లేని అంశాలను జోడించి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, ఇది దేశానికి మంచిది కాదన్నారు. హింసను ప్రేరేపించేలా కొన్ని రాజకీయ పార్టీలు ఓ పథకం ప్రకారం ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
మైనారిటీలకు తాను మళ్లీ చెబుతున్నానని, సీఏఏలో ఏ ఒక్క భారతీయునికి, మైనారిటీ వర్గానికి వ్యతిరేకంగా, వారికి నష్టం కలిగించే అంశాలు లేవన్నారు. ఇక్కడి ప్రజలను పాకిస్తాన్‌కు పంపిస్తారు.. బంగ్లాదేశ్‌కు పంపిస్తారని చెబుతూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాము వ్యతిరేకిస్తున్నామని, తీర్మానం చేస్తామని చెబుతున్న రాజకీయ పార్టీలు సీఏఏలో దేశ ప్రజలకు వ్యతిరేక అంశాలు ఎక్కడున్నాయో చూపించాలని సవాల్ విసిరారు. రాజకీయ పార్టీలు చేసే తప్పుడు మాటలను నమ్మవద్దని, వాస్తవాలను గ్రహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. సెన్సెస్ కోసం సిబ్బంది ఇంటింటికి తిరిగితే దాడులు చేస్తామని, ఎలా తిరుగుతారో చూస్తామని ఎంఐఎం నేతలు చెబుతున్నారన్నారు. అది మోదీ వ్యక్తిగత కార్యక్రమం కాదని, రాజ్యాంగబద్ధ కార్యక్రమమని వారు తెలుసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment