
ఢిల్లీ: నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అబద్ధాల చిట్టా చెప్పారని ఏపీ బీజేపీ సెక్రటరీ భాను ప్రకాశ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో భాను ప్రకాశ్ విలేకరులతో మాట్లాడుతూ..40 ఏళ్లుగా ఏ తప్పు చేయలేదంటూ చంద్రబాబు నాయుడు చెబుతున్నారు..బాబుకి దమ్మూ ధైర్యం ఉంటే కాణిపాకం దేవుడిపై ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. చంద్రబాబు సక్రమంగా పరిపాలన చేస్తే బీజేపీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
నాలుగు సంవత్సరాలుగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, మోదీని పొగిడిన విషయాన్ని గుర్తు చేశారు. 2019లో ఏపీ టీడీపీ సైకిల్ చక్రాలు ఊడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. గవర్నర్‌కు ఎలాంటి అధికారాలు ఉంటాయో చదివి తెలుసుకోవాలని బాబుకు, టీడీపీ నేతలకు హితవు పలికారు. గవర్నర్‌కు ఏ అధికారితో నైనా మాట్లాడే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏపీ ప్రజల డబ్బుతో ఢిల్లీకి వస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పెట్టే ఖర్చులు, విమాన ఛార్జీలపై ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment