సాక్షి, భీమవరం: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై బీజేపీ సీనియర్ నేత, సినీనటుడు కృష్ణంరాజు విరుచుకుపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం భీమవరం వచ్చారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ..రెండు లక్షలపైనే జిల్లాలో పార్టీ సభ్యత్వాలు నమోదు అవుతాయని అన్నారు. ఇతర పార్టీల నుంచి కూడా బీజేపీలోకి చేరేందుకు చాలామంది వస్తున్నారన్నారు.
‘చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు. పాము చచ్చిపోయాక ఇక కర్ర ఎందుకు’ అంటూ చంద్రబాబును ఉద్దేశించి కృష్ణంరాజు పరోక్షంగా విమర్శించారు. కేంద్రం అభివృద్ధి చేసిన పనిని తనదిగా చెప్పుకుని ఇంకెన్నాళ్లు జనాన్ని మోసం చేస్తారన‍్న కృష్ణంరాజు... ప్రజలు తెలివైన వారు కాబట్టే బాబుకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఎన్నికలకు రెండు వారాల ముందు తనను కేంద్రం జైలులో పెడుతుందేమో అని చంద్రబాబు అన్నారని...ఎన్నికల్లో సింపతి కోసం అలా అన్నా, ఇప్పుడు అది నిజం కాబోతోందని.. తప్పు చేసినవాడు జైలుకు వెళతారని కృష్ణంరాజు అన్నారు. అమ్మయినా అడగకపోతే అన్నం పెట్టదని, కేంద్ర ప్రభుత్వం అమ్మ కాకపోయినా...కేంద్రంలో స్నేహపూరితంగా ఉంటే బాగుండేదన్నారు. తెలుగు ప్రజలందరికీ న్యాయం జరగాలన్నదే తన అభిలాష అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment