
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే మాటలు కోటలు దాటతాయి కానీ చేతలు మాత్రం ప్రగతి భవన్ దాటవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. నాలుగేళ్లలో సచివాలయంలోకి ఒక్కసారి కూడా అడుపెట్టని ఏకైక సీఎం కేసీఆర్ అని విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మహిళామోర్చా రాష్ట్ర వర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లలో కేసీఆర్ అందరిని మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్.. వాళ్ల ఇంట్లో వాళ్లకి మాత్రమే ఐదు ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. ఈ నెల 23 నుంచి బస్సుయాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు.
ప్రజాచైతన్యయాత్ర పేరుతో చేసే ఈ బస్సుయాత్ర 15 రోజుల పాటు సాగుతుందని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం అన్ని జిల్లాలు మండలాల్లో సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 24000 పోలింగ్ బూత్ కమిటీలు వేశామన్నారు. దేశంలో బీజేపీ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్నింటా గెలుస్తోందని వ్యాఖ్యానించారు. ప్రపంచం మెచ్చుకునే రీతిలో నరేంద్ర మోదీ పాలన సాగుతోందని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment