సాక్షి, మహబూబ్‌నగర్ : తెలంగాణలో ముప్పైఆరు లక్షల మందిని సభ్యులుగా చేర్చడమే లక్ష్యంగా సాగుతామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పష్టం చేశారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ రాజకీయ చరిత్రలో బీజేపీ మాత్రమే నిరంతర ప్రజా భాగస్వామ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తోందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ను ప్రణాళికబద్ధంగా ఎదుర్కొనే పార్టీ బీజీపీనే అన్నారు. తమ పార్టీ అన్ని కులాల, వర్గాల పార్టీ అన్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడలనుకునేవారు బీజేపీ వైపు చూస్తున్నారని మురళీధర్ రావు తెలిపారు.
పేదలందరికి ఇల్లు.. ప్రతి ఇంటికి కరెంట్, టాయిలెట్ కల్పించడమే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు మురళీధర్ రావు. 2022 నాటికి రక్షిత నీరు లేని కుటుంబం ఉండకూడదనేది మోదీ ఆకాంక్ష అన్నారు. రానున్న ఐదేళ్లలో రోడ్ల కోసం రూ. 100 లక్షల కోట్లు, రైల్వే లైన్ల కోసం రూ. 50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతిపక్షంగా ఫెయిల్ అయిన కాంగ్రెస్ పార్టీ.. చివరకూ టీఆర్‌ఎస్ జేబు పార్టీగా మారిందని ఆరోపించారు.
తెలంగాణ, ఏపీలకు కేంద్రం చేసింది శూన్యం అంటున్నారు.. మరి ఏడు శాతం జీడీపీ ఎలా సాధ్యమయ్యిందని మురళీధర్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో ఇంతవరకూ ఒక్క ఇంటికైనా పేదలకు తాళం చెవి ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. రైతులకు ఫసల్ బీమా యోజన ఎందుకు అమలు చేయడం లేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రగతి రిపోర్టుపై చర్చకు తాము సిద్ధమన్నారు మురళీధర్ రావు.
Comments
Please login to add a commentAdd a comment