సాక్షి, హైదరాబాద్ : పార్టీ మారడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని, ప్రస్తుతం తాను బీజేపీలోనే ఉన్నానని నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఉగాది అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుకుంటానని నాగం పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం తీరుపై తన అనుచరులు, కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల వాగ్దానాలను కేసీఆర్ అమలు చేయలేదని నాగం మండిపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి కుటుంబం కేసీఆర్‌దేనని ఆయన విమర్శించారు. సకాలంలో పంచాయితీ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.
కాగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గాన్ని 30 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన నాగం జనార్దన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం బీజేపీలో కీలకనేతగా ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆయన దిగుతారన్న ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్‌లో తాను చేరుతున్నట్లు వస్తున్న వార్తలను నాగం ఖండిస్తు వస్తున్న విషయం తెలిసిందే. అయితే నాగం తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment