సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కిలాడి రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. విష జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. విద్యా రంగాన్ని పట్టించుకోవడం లేదని పొంగులేటి మండిపడ్డారు.
ప్రజలు ఛీ కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి..
రాష్ట్ర్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీదే విజయం అని పొంగులేటి సుధాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్ర్రంలో కేసీఆర్ నియంతృత్వ ధోరణితో పాలన సాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కొనసాగుతుందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఛీ కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశంలో బలమైన ఆర్థిక వ్యవస్థ సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment