
సాక్షి, తూర్పుగోదావరి : గత టీడీపీ ప్రభుత్వ హయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అందుకే ప్రజలు చంద్రబాబును తిరస్కరించారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్ల కాలంలో ఏపీకి బీజేపీ పెద్దఎత్తున సహకారం చేసినా.. ఏమీ చేయలేదని టీడీపీ దుష్ర్పచారం చేసిందని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేయాలన్న ఉద్దేశ్యం బీజేపీ లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ కోణంలో చూసినా రాష్ట్రంలో అవినీతే కనిపించింది తప్ప అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు.
ఇసుక మాఫీయా, మట్టి మాఫియా, భూదందాలలతో ప్రజలను దోచుకుతిన్నారని ఆరోపించారు. చివరకు పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలను సైతం జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చి తీసుకునే దౌర్భగ్య స్థితిని ప్రజలు అనుభవించారన్నారు. అందుకే ప్రజలు అనూహ్యమైన తీర్పును ఇచ్చారన్నారు. కృష్ణా కరకట్ట మీద ఉన్న నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. అనధికారిక కట్టడాలు ఎవరిదైనా, ఏ పార్టీ వారివైనా కూల్చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో సహకరించి ముందుకు వెళితే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచే అవకాశం ఉంటుందని సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. ఏపీ అభివృద్ది కోసం ఏ రకమైన సహయాన్ని అడిగినా సీఎం జగన్‌కు సహకరించడానికి బీజేపీ కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీ ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని ప్రజలు గ్రహించారని తెలిపారు. తాము ఎటువంటి ఆపరేషన్లు చేపట్టలేదని, పార్టీ సిద్ధాంతాలు, మోదీ అభివృద్ధి చూసే పార్టీలో చేరుతున్నారని పురంధేశ్వరి పేర్కొన్నారు.