టీడీపీ తొండాట.. బాబు అండ్ కోకు మామూలే!
గతంలో ఒక జోక్ ఉండేది. ఇండియా, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ మాచ్ జరుగుతుంటే మా వైపు ధోని వంటి మంచి క్రికెటర్లు ఉన్నారని భారత క్రికెటర్లు చెబితే, తమ వైపు ఎంపైర్ అంటే రిఫరీ ఉన్నారులే అని పాక్ క్రికెటర్లు అన్నారని జోక్‌గా చెప్పుకునేవారు. సరిగ్గా ఏపీలో జరుగుతున్న రాజకీయం చూస్తుంటే, ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలతో పొత్తు కట్టి తిరిగి అధికారంలోకి రావాలని సంకల్పించారు. కానీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం జనసేన, బీజేపీ లతో పాటు ఎల్లో మీడియాతో నేరుగాను, కాంగ్రెస్, సీపీఐ వంటి పార్టీలతో పరోక్ష కూటమి కడుతున్నారు. తాజాగా ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసే పనిలో పడ్డారా అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి.నిష్పక్షపాతంగా ఉంటోన్న ఈసీపై కూటమి నేతలు బీజేపీ ద్వారా ఒత్తిడి తెస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. తత్ఫలితంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బ్లాక్ మెయిల్ చేయడానికి టీడీపీ కూటమి నేతలకు అవకాశం ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రత్యర్థులు అనుసరిస్తున్న ఇలాంటి అనైతిక వ్యూహాలను ఎదుర్కోవడం వైఎస్ జగన్మోహన్రెడ్డికు కొత్తకాదని చెప్పాలి.వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ జీవితం.. పొలిటికల్ కెరియర్ చెప్పాలంటే.. మరీ పెద్దదేం కాదు. ఆయన 2009 నుంచే రాజకీయాలలో ఉన్నట్లు లెక్క. అంటే 15 ఏళ్ల రాజకీయ జీవితం అన్న మాట. కానీ ఆయన ఎదుర్కున్నన్ని సమస్యలు, సవాళ్లు దేశంలోనే మరే నేతకు ఎదురు అయి ఉండకపోవచ్చు. ప్రత్యేకించి ఆయా వ్యవస్థలు పగబట్టినట్లుగా ఆయనపై పడ్డ తీరు తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒక పెద్ద టీవీ సిరియల్ అవుతుంది. సినిమా తీస్తే ఒక సంచలన కథ అవుతుంది.తాజాగా 2024 శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అదే తరహా దాడి జరుగుతున్నట్లు అనిపిస్తుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఒంటరిగా ఎదుర్కోలేమన్న భయంతో కూటమి కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీలు అక్కడితో ఆగకుండా ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసే పనిలో పడ్డట్టు అనిపిస్తుంది. ఎన్నికల సంఘంపై విమర్శలు చేయడం ఉద్దేశం కానప్పటికీ, జరిగిన పరిణామాలు విశ్లేషించినప్పుడు అలాంటి భావన కలుగుతోంది. లేకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయి దాడి, హత్యాయత్నం జరిగితే ఆ కేసును విచారిస్తున్న పోలీసు అధికారిని ఎన్నికల సంఘం సహేతుక కారణం లేకుండా బదిలీ చేయడం, నిర్దిష్ట ఆరోపణలు లేకుండా ఇంటిలెజెన్స్ హెడ్‌ను మార్చడం తాజా ఉదాహరణలుగా నిలుస్తాయి.వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఇలా వ్యవస్థలనుంచి చికాకులు రావడం కొత్తకాదు. చిన్న వయసులోనే అనేక కష్టాలు పడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డి గుండె ధైర్యం మాత్రం మెచ్చుకోదగింది. అదే సాహస యాత్రను ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సొంతంగా పార్టీ పెట్టుకున్న ఫలితంగా సోనియాగాంధీ, చంద్రబాబు వంటివారు కుమ్మక్కై అక్రమ కేసులుపెట్టినా చలించలేదు. పదహారు నెలలు జైలులోపెట్టినా బెదరలేదు. ఇన్ని అడ్డంకులు అధిగమించి, 2014లో తనపార్టీకి ఓటమి ఎదురైనా నిబ్బరంగా రాజకీయాలు చేశారు. ప్రతిపక్షంలో ఉండి 3800 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ప్రజల ఆదరణ చూరగొని రికార్డు స్థాయిలో 2019లో 151 సీట్లను గెలుచుకున్నారు. అది రాజకీయ ప్రత్యర్దులకు కంటగింపుగా మారింది.ముఖ్యంగా తనకంటే పాతికేళ్ల చిన్నవాడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ స్థాయిలో ప్రజల మన్నన పొందడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏ మాత్రం నచ్చలేదు. ఆయనకే కాదు. తన మీడియా బలంతో రాజకీయాలను శాసించాలని అనుకునే రామోజీరావు వంటివారికి అసలు గిట్టలేదు. దాంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాడన్నమాటే కానీ, మళ్లీ అవే సమస్యలు. మళ్లీ అవే ఆటంకాలు. మళ్లీ ఆయా వ్యవస్థల నుంచి ఇబ్బందులు. పార్టీ పెట్టిన కొత్తలో సీబీఐ, ఈడీ వంటి సంస్థలు ఆయనను వెంటబడి వేధించాయి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరికొన్ని వ్యవస్థలు ముఖ్యంగా న్యాయ వ్యవస్థ నుంచి పదే, పదే వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కున్నారు.వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్దహస్తుడన్న చంద్రబాబు నాయుడు న్యాయ వ్యవస్థలో తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు కొందరితో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఇబ్బంది పెట్టడానికి ఎన్ని సమస్యలు పెట్టాలో అన్నీ సృష్టించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ స్కీమును ఆరంభించినా, ఏ సంస్కరణను తీసుకు వచ్చినా తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో లిటిగేషన్ తీసుకురావడం, వాటిని న్యాయ వ్యవస్థలో కొందరు ఎంటర్ టెయిన్ చేయడం వంటివి ప్రజలలో అనేక డౌట్లకు కారణం అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఇబ్బంది పెట్టాలని టీడీపీ కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలు కొంతమేర ఫలిస్తున్నట్లు కనిపిస్తుంది.తెలుగుదేశం వారు రాసిచ్చిన ఒక ఫిర్యాదుపై బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సంతకం పెట్టి ఎన్నికల సంఘానికి పంపారు. అందులో ఏకంగా 22 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదులు చేయడం ఒక ఎత్తు అయితే, తమకు ఫలానా అధికారులు కావాలని, వారికి తాము కోరిన రీతిలో పోస్టింగ్‌లు ఇవ్వాలని కోరడం ఒక సంచలనం. అలాంటి ఫిర్యాదు చేసిన పురందేశ్వరిని మందలించవలసిన ఎన్నికల సంఘం, అలా చేయకపోగా, వారు కోరిన రీతిలో స్పందించారు. అంటే బీజేపీతో టిడిపి ఎందుకు పొత్తు పెట్టుకున్నదో అర్థం చేసుకోవచ్చన్నమాట.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ప్రధాని మోదీని టెర్రరిస్టు అని అనడమే కాకుండా, అనేక రకాలుగా దూషణలు చేసినా, ఓటమి తర్వాత మళ్లీ కాళ్లా, వేళ్లాపడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తనపై ఉన్న కేసుల భయంతోనే చంద్రబాబు ఇలా చేశారులే అనుకున్నారు. కానీ అదొక్కటే కాదని, వ్యవస్థను మేనేజ్ చేయడానికి కూడా ఈ పొత్తు అవసరమని ఆయన లెక్కగట్టుకున్నారని అర్దం అయింది. పురందేశ్వరి ఫిర్యాదు తర్వాత కొందరు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించింది. అయినా టీడీపీ కూటమికి సంతృప్తి కలగలేదు. మరికొందరిని కూడా తప్పించాలని తలపెట్టారు. గతంలో ఇంటెలెజెన్స్ డీజీగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు ఏకంగా టీడీపీ రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టారు. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో కీలక భూమిక పోషించారని ఆరోపణలు వచ్చాయి.గత ఎన్నికల సమయంలో ఆయనపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎన్నికల సంఘం ఆయనను బాధ్యతల నుంచి తప్పించింది. అప్పట్లో ఏబీపై నిర్దిష్ట అభియోగాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఇంటలిజెన్స్ అధికారి సీతారామాంజనేయులుపై అలాంటి ఆరోపణలు లేవు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు రాసిన కథనాలలో కూడా సీతారామాంజనేయులపై స్పష్లంగా ఫలానా ఆరోపణ అని చెప్పలేకపోయాయి. కాకపోతే ఆయన ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టే రీతిలో ప్రవర్తిస్తున్నారన్నట్లుగా రాశాయి. ఆ ఇబ్బంది ఏమిటో తెలియలేదు. అంటే విపక్ష కూటమికి చెందినవారు డబ్బు రవాణా చేసినా, మద్యం సీసాలు సరఫరా చేసినా, దౌర్జన్యాలు చేసినా ఈ అధికారులు పట్టించుకోరాదన్నది వారి ఉద్దేశంగా ఉంది. పోనీ వీరు అధికార పార్టీ వారికి సంబంధించి ఏమైనా తప్పులు ఉంటే కేసులు పెట్టడం లేదా? అంటే అదేమీ లేదు. తెలుగుదేశం పత్రిక ఈనాడులోనే వైఎస్సార్సీపీ వారిపై కేసులు పెట్టిన ఉదంతాలను ఇచ్చింది.ఇక విజయవాడ కమిషనర్ కాంతీలాల్ రాణా బదిలీ అయితే మరీ ఘోరం అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్ షో జరుగుతున్నప్పుడు ఒక దుండగుడు రాయి విసిరాడు. ఫలితంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గాయపడ్డారు. ఆ కేసు రాణా నేతృత్వంలో విచారణ జరుగుతోంది. దానిని ఆయన విజయవంతంగా పరిశోధిస్తూ, సాంకేతికతను వాడి నిందితుడిని పట్టుకున్నారు. ఆ నిందితుడి వెనుక టీడీపీ నేతలు ఉన్నారని బయటకు వినవస్తోంది. అంతే! రాణాపై కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. దానికి స్పందించి ఎన్నికల సంఘం ఆయనను బదిలీ చేసి ప్రజలను ఆశ్చర్యపరచింది. ఈయన బదిలీకి ఏ కారణం ఉందో చెప్పరు. వీరంతా వైఎస్సార్సీపీకి అనుకూలమని ఒక ముద్రవేసి వారిపై చర్య తీసుకోవాలని కోరారు.గతంలో ఏబీని పక్కన పెట్టినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. ఎన్నికల సంఘం తీరును తప్పు పడుతూ ఏకంగా ముఖ్య ఎన్నికల అధికారి వద్దకు వెళ్లి ధర్నా చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు అలా చేయడం లేదు. ఎవరు బదిలీ అయినా, ఎవరిని కొత్తగా నియమించినా ఆయన పట్టించుకోవడం లేదు. తన పని తాను చేసుకుపోతూ ప్రజలలో తిరుగుతున్నారు. ఒక వైపు ప్రధాని మోదీ ముస్లింలపై, కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినా, వాటిపై పదిహేడువేల మంది ఫిర్యాదు చేసినా, స్పందించని ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం చిన్న, చిన్నవాటిపై మాత్రం సీరియస్‌గా స్పందిస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రిపై దాడి కేసులో విచారణ చేస్తున్న అధికారులను బదిలీ చేస్తోంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు