సాక్షి, విజయవాడ : సాక్షి, అమరావతి: టీడీపీ – బీజేపీల మధ్య రాజకీయ బంధం ఇప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనసాగుతోందని బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇన్‌చార్జి పురందేశ్వరి పేర్కొన్నారు. కేంద్రంలో టీడీపీ మంత్రులు, రాష్ట్రంలో బీజేపీ మంత్రులు రాజీనామాలు చేయడం మినహా మిత్రపక్షాల మధ్య మరే విధమైన ఇబ్బందులూ లేవన్నారు. కేవలం మంత్రి పదవులకు మాత్రమే రాజీనామాలు చేస్తున్నామని, తాము ఇంకా ఎన్డీఏలోనే కొనసాగుతున్నామని సీఎం చంద్రబాబే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. పురంధేశ్వరి పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్నీ ఇస్తున్నా ఏమీ ఇవ్వడం లేదని అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, విభజన చట్టంలోని అన్ని అంశాలను సంపూర్ణంగా అమలు చేస్తారని చెప్పారు.
ప్రతి అభివృద్ధిలోనూ కేంద్ర భాగస్వామ్యం
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధికి నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయని ఆమె ప్రశ్నించారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, మరుగుదొడ్లు, ఇళ్ల నిర్మాణానికీ కేంద్రమే నిధులిస్తోందని చెప్పారు. ఇక్కడ జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ కేంద్ర భాగస్వామ్యం ఉందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారంపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క కార్యక్రమానికైనా కేంద్రం నిధులు ఇవ్వనని చెప్పిందా? అని ప్రశ్నించారు.
‘కియా’కి కేంద్ర రాయితీలు
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల అనంతరం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు, హోదా లేని రాష్ట్రాలకు కేంద్ర సాయం విషయంలో ఎటువంటి వ్యత్యాసం ఉండడం లేదని పురంధేశ్వరి చెప్పారు. అయినప్పటికీ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు అదనంగా అందజేసే 30 శాతం నిధులను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఏపీకి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో వెనుకబడ్డ 7 జిల్లాల్లో నెలకొల్పే పరిశ్రమలకు ప్రత్యేక పన్ను రాయితీలు ఇస్తోందని చెప్పారు. కేంద్రం పన్ను రాయితీలు కల్పించిన కారణంగానే రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. అనంతపురంలో ఏర్పాటైన ‘కియా’ కార్ల తయారీ సంస్థ సైతం కేంద్ర పన్ను రాయితీలను వినియోగించుకుంటోందన్నారు.
వెయ్యి కోట్లిచ్చినా డ్రైనేజీ పనులు చేయలేదు
రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటివరకు డిజైన్లు సిద్ధం కాకపోయినా, కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక లేకున్నా కేంద్రం రూ.2,500 కోట్ల సాయం చేసిందని చెప్పారు. విజయవాడ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి కేంద్రం రూ.1,000 కోట్లు విడుదల చేసినా పనులు జరగకుండా ఆగిపోయాయని, కావాలంటే తానే స్వయంగా వచ్చి మీడియాకు దీన్ని చూపిస్తానని తెలిపారు.
పదేళ్లైనా హైదరాబాద్ ఐఐటీ పూర్తి కాలేదు
హైదరాబాద్‌లో ఐఐటీ ఏర్పాటుకు నాలుగైదేళ్లు కష్టపడాల్సి వచ్చిందని, పదేళ్లు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ అక్కడ నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. మన రాష్ట్రంలో మాత్రం మూడున్నర ఏళ్లలోనే ఐఐటీ ఏర్పాటును పూర్తి చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. సమావేశంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటకృష్ణ, రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ– బీజేపీ బంధం బాగానే ఉంది
Published Sat, Mar 10 2018 1:02 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment